సాక్షి, హైదరాబాద్ /భద్రాది కొత్తగూడెం: తెలంగాణలో మావోయిస్టులు బలపడుతున్నారా? తమపై పోలీసులు– కేంద్ర బలగాలు ప్రకటించిన యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ములుగు జిల్లా వెంకటాపురం హత్యతో సంకేతాలు పంపారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గణపతి తరువాత రెండేళ్ల క్రితం మావోయిస్టు పగ్గాలు చేపట్టిన నంబాల కేశవరావు (అలియాస్ గంగన్న, అలియాస్ బసవరాజు, అలియాస్ బైరు) మొదటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నాడు. మిలిటరీ ఆపరేషన్లు, ఆంబుష్‌లు, మెరుపుదాడుల్లో ఇతను సిద్ధహస్తుడు. మావోయిస్టుల ఏరివేతకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ ప్రహార్ మాదిరిగానే.. తెలంగాణలోనూ కేంద్రబలగాలు రంగంలోకి దిగుతాయన్న ప్రచారంతో తాము కూడా వెనక్కితగ్గబోమన్న సంకేతాలు ఇచ్చే క్రమంలోనే మావోలు తాజాగా వెంకటాపురం (ములుగు)లో హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
గతేడాది నల్లూరి
గతేడాది ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఎమ్మెల్యే బీమా మాండవిని మందుపాతర పెట్టి హత్య చేయడం ద్వారా నంబాల తన పథక రచనలు మొదలుపెట్టాడు. అదే దూకుడుతో గతేడాది జూలై 12న ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావు హత్యతో తెలంగాణలో మావోయిస్టులు ఉనికిని చాటుకునే యత్నం ప్రారంభించారు. తరువాత జరిగిన మావోయిస్టు వారోత్సవాల్లోనూ దూకుడుగానే వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. శనివారం అర్ధరాత్రి ములుగుజిల్లా వెంకటాపురం మండలంలో జరిగిన హత్యలోనూ పార్టీ దూకుడు వెనక నంబాల ఆదేశాలే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అదే విధంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ ఆసిఫాబాద్‌లోనే తిష్టవేయడం, మూడు ఎన్‌కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నా.. ఇంకా అక్కడే ఉండటం వెనకా నంబాల ఆదేశాలే కారణమై ఉంటాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర కమిటీల నియామకం జరిపిన నంబాల.. ఆయా ఏరియాల కార్యదర్శలకు రిక్రూట్‌మెంట్‌కు ఆదేశాలు ఇచ్చినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. మావోలను ఏరివేసేందుకు అక్టోబరు 4వ తేదీన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోనే తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా పోలీసు ఉన్నతాధికారులతో సీఆర్‌పీఎఫ్ డీజీ మహేశ్వరీ, కేంద్ర హోంశాఖ సీనియర్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎస్‌ఎస్‌ఏ), ఐపీఎస్ విజయ్‌కుమార్‌లు సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే.
మావోల ఏరివేతలో అవసరమైతే మరిన్ని కేంద్ర బలగాలు, వీలునుబట్టి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)లను కూడా పంపేందుకు ఈ సమావేశంలో తెలంగాణ పోలీసులకు హామీ లభించింది. అదేరోజు తమ ఆచూకీ తెలిపితే చంపేస్తామని హెచ్చరిస్తూ లేఖ విడుదల చేసిన మావోలు.. అన్నట్లుగానే వారం తిరక్కముందే అధికార పార్టీకి చెందిన భీమేశ్వరరావును హతమార్చడం కలకలం రేపుతోంది. ఈ హత్యలో వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి ముచకి ఉద్గాయి అలియాస్ రఘు, అలియాస్ సుధాకర్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలో దాదాపు 25 మంది వరకు పాల్గొనడంతో వచ్చినవారంతా మావోలేనా? లేక సానుభూతిపరులు కూడా పాల్గొన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలని, తమకు సమాచారం ఇవ్వకుండా ఏజెన్సీలకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు.
మన్యం... ఉద్రిక్తం
ఇటు మావోలు, అటు పోలీసుల పోరులో మన్యంలో రక్తపుటేరులు పారుతున్నాయి. తెలంగాణలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లకు పొరుగునే ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఇన్‌ఫార్మర్లే కారణమని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెండువారాల్లో... తెలంగాణలో నాలుగు ఎన్‌కౌంటర్లలో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించడం పార్టీ జీర్ణించుకోలేకపోయింది. దీంతో ప్రతీకారచర్యలకు దిగింది. బీజాపూర్ జిల్లా గంగలూరులో పోలీస్ ఇన్‌ఫార్మర్లనే ముద్రవేసి పలువురిని కిడ్నాప్ చేసిన మావోలు ప్రజాకోర్టులు నిర్వహించి మొత్తం 25 మందిని చంపేశారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో ఈనెల 7న ప్రకటన సైతం ఇచ్చారు. తెలంగాణలోని జిల్లాల్లోనూ పోలీసు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అనుమానం ఉన్నవారిని అపహరించి ప్రజాకోర్టులు నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పోలీసులు, అటు కేంద్రబలగాలు, మరోవైపు మావోయిస్టుల సంచారంతో మన్యం చిగురుటాకులా వణుకుతోంది. ఎపుడు ఏం జరుగుతుందో తెలియక...గూడెంవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
త్వరలో రంగంలోకి 11 మంది ఐపీఎస్‌లు
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 11 మంది ఐపీఎస్‌లకు ప్రస్తుతం రాజేంద్రనగర్ సమీపంలోని ప్రేమావతిపేటలోని గ్రేహౌండ్స్ కేంద్రంలో అసాల్ట్ కమాండర్ శిక్షణ కొనసాగుతోంది. అటవీ వాతావరణాన్ని తట్టుకునేలా వీరికి కఠోర శిక్షణ ఇస్తున్నారు. దసరాతో శిక్షణ పూర్తికానున్న వీరికి ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లోని మావో ప్రాబల్య ప్రాంతాల్లో కూంబింగ్ బాధ్యతలు అప్పజెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment