సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లు మళ్లీ మొరాయించాయి. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్–మియాపూర్, మియాపూర్–ఎల్బీనగర్ రూట్లో సుమారు 30 నిమిషాలకు పైగా నిలిచిపోవడంతో ఆయా స్టేషన్లలో రైళ్ల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు, రైళ్లలో జర్నీ చేస్తున్న వారు నరక యాతన అనుభవించారు.
సిగ్నలింగ్ సమస్యల కారణంగా ఖైరతాబాద్, లక్డీకాపూల్, అమీర్‌పేట్ తదితర స్టేషన్లలో రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. ప్రయాణికులు ఆందోళన చెందడంతో రంగంలోకి దిగిన అధికారులు..సాంకేతిక సమస్యల కారణంగా రైళ్లను నిలిపివేసినట్లు రైళ్లలో అనౌన్స్‌మెంట్ చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరమ్మతుల అనంతరం రైలు సర్వీసులను పునరుద్ధరించారు.
కాగా నగరంలో మెట్రో రైళ్లను కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టం(సీబీటీసీ)సాంకేతికత ఆధారంగా నడుపుతున్నారు. ఈ విధానం మన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడంతో తరచూ రైళ్లు పట్టాలపైనే నిలిచిపోతున్నాయి. ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమౌతున్నారని ప్రయాణీకులు విమర్శిస్తున్నారు. నగరంలో వాయు కాలుష్యం పెరిగిన ప్రతీసారీ సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు తలెత్తి రైళ్లు నిలిచిపోతున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment