ఎన్నిసార్లు అడిగినా ఒక్కటి కూడా ఇవ్వలేదు: హరీశ్ రావు | Minister Harish Rao Tweet On Medical Colleges Sanctioned To Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం.. నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలకు హరీశ్ కౌంటర్‌! 

Published Mon, Mar 6 2023 3:43 AM | Last Updated on Mon, Mar 6 2023 3:43 AM

Minister Harish Rao Tweet On Medical Colleges Sanctioned To Telangana - Sakshi

తెలంగాణ విషయంలో కేంద్రం చూపిస్తున్న వివక్షపై రాజ్‌భవన్‌ దృష్టి పెడితే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యంగా మెడికల్‌ కాలేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిందని ఆరోపించారు. మెడికల్‌ కాలేజీలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం ఉదయం చేసిన ట్వీట్‌పై ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. వైద్య కళాశాలలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కూడా హరీశ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. 

మెడికల్‌ కాలేజీలపై మోసం 
‘రాష్ట్రానికి కొత్త మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్‌ కాలేజీల్లో ఒక్కటంటే ఒక్క మెడికల్‌ కాలేజీని తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రం మొండిచేయి చూపింది. ఒకటో ఫేజ్‌లో ఇస్తారనుకుంటే రెండో ఫేజ్‌లో కూడా ఇవ్వలేదు, మూడో ఫేజ్‌లో ఇస్తామని చెప్పి చివరకు మోసం చేసింది. ఇప్పుడు నర్సింగ్‌ కాలేజీల విషయంలో కూడా అదే వివక్షను ప్రదర్శించింది. పైగా మెడికల్‌ కాలేజీల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అంటే.. మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్‌ కాలేజీ కోసం తెలంగాణ అడిగిందనీ, అక్కడ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉండటం వల్ల మంజూరు చేయలేక పోయామని అంటారు. ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారు, ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు..?’అని హరీశ్‌ నిలదీశారు.

 దేశంలోనే నం.1గా రాష్ట్రం 
‘కేంద్రం మెడికల్‌ కాలేజీలు ఇవ్వకున్నా, పైసా నిధులివ్వకున్నా..సీఎం కేసీఆర్‌ రాష్ట్ర సొంత నిధులతో 12 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించారు. ఈ ఏడాది 9, మరో ఏడాది 8 ఇలా.. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ 1గా ఉండటం వాస్తవం కాదా? ఒకే ఏడాది, ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్‌ కాలేజీలు ప్రారంభిస్తే, ప్రశంసించేందుకు మనస్సు రానివాళ్లు పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా?..’అని ప్రశ్నించారు.  

గిరిజన వర్సిటీ, కోచ్‌ ఫ్యాక్టరీపై దృష్టి పెట్టండి 
తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని, తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు నిలదీయడం లేదని మంత్రి ప్రశ్నించారు. ఏపీ పునర్‌ విభజన చట్టం –2014 లో ఇచ్చిన0 హామీల మేరకు గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్‌భవన్‌ దృష్టి పెడితే తెలంగాణ ప్రజలకు గొప్ప మేలు చేసినట్టవుతుందని పేర్కొన్నారు.

బీబీనగర్‌ ఎయిమ్స్‌కు ఎందుకింత దుస్థితి? 

‘గతంలో బీబీనగర్‌ ఎయిమ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదు అని ఒక కేంద్ర మంత్రి అన్నారు. ఆధారాలు చూపిస్తే నోట మాట లేదు. ఇప్పుడు మెడికల్‌ కాలేజీల విషయంలోనూ అలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌ స్థాయిలో ఉండాల్సి న బీబీనగర్‌ ఎయిమ్స్, ఎందుకని గల్లీలోని మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో కూడా లేదు? ఎందుకు అధ్వాన్నంగా ఉంది? రూ.1,365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా, ఎందుకు రూ.156 కోట్లు (11.4%) మాత్రమే మంజూరు చేశారు? ఇదే సమయంలో అంటే 2018లో మంజూరు అయిన గుజరాత్‌ ఎయిమ్స్‌కు 52% నిధులు ఇచ్చింది వాస్తవం కాదా?..’అని హరీశ్‌ నిలదీశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement