సురిఫై ఆఫీస్ సిబ్బందితో మంత్రి కేటీఆర్
హఫీజ్‌పేట్: రాష్ట్ర అభివృద్ధిని చూసి ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు క్యూ కట్టాయని మంత్రి కేటీఆర్ అన్నారు. భవిష్యత్ ఐటీ రంగానికి నగరం వేదిక కాబోతోందని చెప్పారు. ఐటీ సంస్థలను హైదరాబాద్ నలువైపులా విస్తరించాలని.. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ పట్టణాల్లోనూ ఏర్పాటు చేయాలని కోరారు. సోమవారం హైటెక్‌సిటీలోని నాలెడ్జ్ సిటీలో మైహోం ట్విట్జా 14వ అంతస్తులో కొత్తగా నెలకొల్పిన సురిఫై ల్యాబ్స్ కార్యాలయాన్ని, కొలియర్స్ కంపెనీ యాక్టివిటీ ఆధారిత వర్క్ స్పేస్ కార్యాలయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కంపెనీల ప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నగరానికి వస్తున్న ఐటీ సంస్థలకు ఎలాంటి సమస్య రాకుండా ప్రత్యేక అనుమతులు, వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
8 ఏళ్ల కిందట 20 లక్షల చదరపు అడుగుల స్థలం కూడా అందుబాటులో లేదని, ఇప్పుడు కోటి 10 లక్షల చదరపు అడుగులు అందుబాటులో ఉందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఇక్కడ నుంచి పని చేయడం హైదరాబాద్ టాలెంట్‌కు దక్కిన గౌరవమన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని మంత్రి కేటీఆర్ అన్నారు. 7 ఏళ్ల కిందట విద్యుత్ కోతలతో సతమతమయ్యామని, ఇప్పుడు వేసవిలోనూ కోతల్లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు.
సురిఫై, కొలియర్స్ రావడం సంతోషకరం
అమెరికా నుంచి హైదరాబాద్ నగరానికి సురిఫై రావడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. పదేళ్ల కిందట ఓ వ్యక్తితో అమీర్‌పేట్‌లో ప్రారంభమైన సురిఫై.. ఇప్పుడు 220 మంది ఉద్యోగుల స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు. అమెరికాలోని టాప్ 20 కంపెనీల్లో 12 కంపెనీలకు సంస్థ పని చేస్తోందని చెప్పారు. అలాగే.. కొలియర్స్ సంస్థ హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. 27 సంవత్సరాల అనుభవమున్న ఈ సంస్థను ప్రపంచంలోని 62 దేశాల్లో నెలకొల్పారని చెప్పారు. కరోనా కాలంలో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేశారని, ఇప్పుడు ఆఫీస్‌లకు వచ్చేలా చూడాలన్నారు.
హైదరాబాద్‌లో తమ కొత్త కార్యాలయం ప్రారంభించుకోవడం మైలురాయిగా నిలుస్తుందని, తమ ప్రయాణానికి మూలస్తంభంగా ఓపెన్ వర్క్ కల్చర్‌ను తీర్చిదిద్దుతామని కొలియర్స్ సీఈవో రమేశ్ నాయర్ చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, సురిఫై ల్యాబ్స్ ఎండీ రామకృష్ణ, సీఈవో డస్టిన్ యాడర్, సియాంట్ ఫౌండర్, చైర్మన్ అండ్ బోర్డ్ సభ్యుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి, కొలియర్స్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంకె ప్రసాద్, సీఈవో రమేశ్ నాయర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిశోర్ వీరఘట్టం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment