సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ) వేదికగా జరిగే టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకల (ప్లీనరీ) ఏర్పాట్లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ఇక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోపాటు పోలీసు, ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి 24 మందితో 7 కమిటీలను కేటీఆర్ ఏర్పాటు చేశారు. ఆహ్వానితులను మొత్తం 22 కేటగిరీలుగా విభజించి వారిని మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతించాలన్నారు. ఆహ్వానాలు అందుకున్న ప్రతినిధులంతా 27న ఉదయం 10 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకొని 11 గంటల్లోగా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్లీనరీ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులేవీ కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 27న గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పార్టీ జెండాలు ఎగరేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాలను నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు సమన్వయం చేయాలని, జంట నగరాల అలంకరణ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యేలు కాదు.. పార్టీయే సుప్రీం
పార్టీ నేతలతో భేటీలో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై మండిపడ్డారు. ప్లీనరీకి తమ అనుమతి లేకుండా ఇతరులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేయకుండా నిరోధించాలని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి సూచించగా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘ఎమ్మెల్యేలు తామే సుప్రీం అనుకుంటే కుదరదు. పార్టీయే సుప్రీం అనే విషయం గుర్తించాలి. పార్టీ లేకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు లేరు. ఇది రాచరికం కాదు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి రాజులు కాదు. ఇతరులకు దీటుగా మీరు కూడా ఏర్పాట్లు చేయండి. మరొకరు ఏర్పాట్లు చేయొద్దని చెప్పడం సరికాదు. ఉద్యమకారులం అని చెప్పుకుంటూ క్రమశిక్షణ తప్పితే కుదరదు. పాత, కొత్త నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి’ అని హితవు పలికారు.
కమిటీలు ఇవీ...
1. ఆహ్వాన కమిటీ: సబితా ఇంద్రారెడ్డి (మంత్రి), రంజిత్‌రెడ్డి (ఎంపీ), అరికెపూడి గాంధీ (ఎమ్మెల్యే), విజయలక్ష్మి గద్వాల్ (మేయర్), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఎమ్మెల్యే)
2. సభావేదిక ప్రాంగణం అలంకరణ కమిటీ: గోపీనాథ్ (ఎమ్మెల్యే), గ్యాదరి బాలమల్లు (టీఎస్‌ఐఐసీ చైర్మన్), మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్)
3. ప్రతినిధుల నమోదు, వలంటీర్ల కమిటీ: శంభీపూర్ రాజు (ఎమ్మెల్సీ), రావుల శ్రీధర్‌రెడ్డి (టీఎస్‌ఈఐడీసీ చైర్మన్), మన్నె క్రిషాంక్ (టీఎస్‌ఎండీసీ చైర్మన్)
4. పార్కింగ్ కమిటీ: కేపీ వివేక్ (ఎమ్మెల్యే),బండి రమేశ్ (రాష్ట్ర కార్యదర్శి), బొంతు రామ్మోహన్ (మాజీ మేయర్)
5. ప్రతినిధుల భోజన కమిటీ:మాధవరం కృష్ణారావు (ఎమ్మెల్యే), నవీన్‌రావు (ఎమ్మెల్సీ), ఎం. సుధీర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
6. తీర్మానాల కమిటీ: మధుసూదనాచారి(ఎమ్మెల్సీ), పర్యాద కృష్ణమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)
7. మీడియా కమిటీ: బాల్క సుమన్ (ఎమ్మెల్యే), భానుప్రసాద్ (ఎమ్మెల్సీ), కర్నె ప్రభాకర్(మాజీ ఎమ్మెల్సీ), గువ్వల బాలరాజు (విప్)
Comments
Please login to add a commentAdd a comment