సాక్షి, హైదరాబాద్: ‘హమ్ బద్లేకి రాజ్‌నీతిమే విశ్వాస్ నహీ రక్తే.. బద్లావ్‌కి రాజ్‌నీతిమే విశ్వాస్ రక్తేహై (మేం ప్రతీకార రాజకీయాలను విశ్వసించం.. మార్పు తెచ్చే రాజకీయాలను నమ్ముతాం).. మార్పు తేవాలనుకుంటున్నాం.. కానీ మిమ్మల్ని ఆగం చేసి (రాజకీయంగా) ఖతం చేయాలని అను కోవడం లేదు. అందరినీ తీసుకుని ముందుకు పోతున్నాం’ అని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం–పాతనగరం అభివృద్ధి అంశంపై సోమ వారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన సభ్యులు లేవనెత్తిన అంశాలకు బదులి చ్చారు. ప్రభుత్వ పథకాల అమలులో తమ ప్రభు త్వం ఎన్నడూ వివక్ష చూపలేదని, భవిష్యత్తులో కూడా చూపదన్నారు. పాత నగరం, కొత్త నగరం.. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు.
‘చరిత్రాత్మక గోల్కొండ కోట, సెవెన్ టోం బ్స్, చార్మినార్‌లకు ప్రపంచ పర్యాటక ప్రాంతా లుగా యునెస్కో గుర్తింపు పొందడానికి కృషి చేస్తాం. మీర్‌ఆలం మండిని చారిత్రక ఆనవాళ్లు దెబ్బతినకుండా పునరుద్ధరిస్తాం. ఇందుకు రూ.10 కోట్లు కేటాయించాం. దుర్గం చెరువు తరహాలో మీర్ ఆలం ట్యాంక్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.40 కోట్లతో ప్రతిపాదనలను మంజూరు చేస్తాం. ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు బకాయిపడిన నిధులను త్వరలో విడుదల చేస్తాం. ప్రైవేటు స్థలాల స్వాధీనం పూర్తయిన వెంటనే లాల్‌దర్వాజ మహంకాళి ఆలయ విస్తరణ పనులను ప్రారంభిస్తాం.
అఫ్జల్‌గంజ్ మసీదు అభివృద్ధి పనులను సైతం త్వరలో చేపడతాం’ అని కేటీఆర్ చెప్పారు. వీటి విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ లేవనెత్తిన ప్రశ్నకు ఆయన బదులి చ్చారు. శివాజీనగర్‌లోని లక్ష్మీనర్సింహ ఆలయం వద్ద కళ్యాణ మండపం, బండ్లగూడలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా మని హామీనిచ్చారు. కొత్త సచివాలయం నిర్మాణంలో భాగంగా రెండు మసీదులు, ఒక ఆలయంతోపాటు చర్చిని సైతం నిర్మిస్తామని ఇచ్చిన హామీకి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తేల్చి చెప్పారు. త్వరలో ముహూర్తం ఖరారు చేసి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. పాతబస్తీకి మెట్రో రైలు కల్పనకు కట్టుబడి ఉన్నామని, త్వరలో మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మసీదులు, ఆలయాన్ని పునర్నిర్మించాలి : అక్బరుద్దీన్
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కొత్త సచివాలయం నిర్మాణంలో భాగంగా రెండు మసీదులు, ఒక ఆలయాన్ని నిర్మించడంతో పాటు చర్చి నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలని ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎంఎంటీఎస్ రెండో విడత ప్రాజెక్టు ముందుకు కదలడం లేదన్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు మహంకాళి లాల్ దర్వాజ ఆలయ విస్తరణ, అఫ్జల్‌గంజ్ మసీదు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఛత్రినాకలోని శివాజీనగర్‌లో శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి సంబం ధించిన 2000 చదరపు అడుగుల స్థలంలో కళ్యాణమండపం నిర్మించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment