క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి తదితరులు
కుత్బుల్లాపూర్: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో మౌలిక వసతులకు పెట్టింది పేరుగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, నచ్చిన ప్రాపర్టీ కొనుక్కుని సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం క్రెడాయ్ ప్రాపర్టీ షో ద్వారా సాధ్యమవుతోందని రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. కొంపల్లి అస్పిసియస్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండు రోజులపాటు కొనసాగే ‘క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నార్త్‘ను ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పక్కా అనుమతులు, కచ్చితమైన సౌకర్యాల కల్పనలో క్రెడాయ్‌పై ప్రజలకు గట్టి నమ్మకం ఉన్నదన్నారు. మేడ్చల్‌కు దాదాపు 22 లక్షల స్క్వేర్ ఫీట్ల గేట్ వే ఆఫ్ ఐటీ పార్క్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిర్మాణ రంగం ఊపందుకుంటోందని తెలిపారు.
ధరణి సమస్యలు పరిష్కరించండి: క్రెడాయ్ ప్రతినిధులు
కాగా.. క్రెడాయ్ సభ్యులు నిర్మాణ సమయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ధరణి రికార్డుల్లో సమస్యలను పరిష్కరించుకోవడానికే కనీసం 6 నెలలు సమయం పడుతోందని, ఇది నిర్మాణంపై ప్రభావం చూపుతోందని వివరించారు. మురుగునీటి సమస్య, కనెక్టివిటీ రోడ్లు, ధరణి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ప్రాపర్టీ షోలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వి.రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రారెడ్డి, అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డితో పాటు క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు జి.ఆనంద్‌రెడ్డి, కె.రాజేశ్వర్, ఎన్.జైదీప్‌రెడ్డి, బి.జగన్నాథ్ రావు, ట్రెజరర్ ఆదిత్య గౌర, శివరాజ్ ఠాకూర్, కె.రాంబాబు, పలు ఆర్థిక సంస్ధలు, సందర్శకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment