క్రెడాయ్ ప్రాపర్టీ షోలో జ్వోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి పొంగులేటి
అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్‌ఆర్,
పీవీ ఎక్స్‌ప్రెస్ వే వంటి ప్రాజెక్టులతో నగర రూపురేఖలు మార్చారు
అప్పుడు పుంజుకున్న స్థిరాస్తి మార్కెట్ ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది
క్రెడాయ్ 13వ ప్రాపర్టీ షో ప్రారంబోత్సవంలో మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విజన్, విధానాల వల్లే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ అధికారంలోకి రాక ముందు హైదరాబాద్‌లో స్థిరాస్తి మార్కెట్ పూర్తిగా క్షీణ దశలో ఉండేదని, ఆయన సీఎం పదవి చేపట్టాక దూరదృష్టితో నగరాభివృద్ధి కోసం చేపట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే వంటి విప్లవాత్మక ప్రాజెక్టులతో హైదరాబాద్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని గుర్తుచేశారు.
దీంతో అప్పుడు పుంజుకున్న స్థిరాస్తి మార్కెట్ ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉందని చెప్పారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ 13వ ప్రాపర్టీ షో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో బిల్డర్లు కూడా భాగస్వాములేనన్నారు. బిల్డర్లు ఎంత వ్యాపారం చేస్తే రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బిల్డర్లను వ్యాపారస్తులుగా చూసే విధానాలకు స్వస్తిచెప్పి పరిశ్రమ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటామని పొంగులేటి హామీ ఇచ్చారు. శివారు ప్రాంతాల్లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మరింత పెంచి హైదరాబాద్ దాహార్తిని తీరుస్తామని, నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. నిర్మాణ అనుమతులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని పేర్కొన్నారు.
ధరణిలో 8.5 లక్షల దరఖాస్తులు పెండింగ్..
ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వం ఎన్నో విధ్వంసాలకు పాల్పడిందని, సామాన్యులకు కలిగిన ఇబ్బందులను కళ్లారా చూస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రస్తుతం ధరణిలో 8.5–9 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిలో 5.8 లక్షల దరఖాస్తులను సహేతుక కారణాల్లేకుండానే తిరస్కరించారని విమర్శించారు. స్పెషల్ డ్రైవ్‌లతో గత వారం రోజులలో 80 వేల పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించామని పొంగులేటి చెప్పారు. రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఉన్న లొసుగులను గుర్తించి సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామన్నారు. పారదర్శక రెవెన్యూ వ్యవస్థను సామా న్యుల చెంతకు తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వైఎస్సార్ లాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి అన్నారు. మూసీ రిఫర్‌ఫ్రంట్, మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లతో ప్రధాన నగరంలో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ జాతీయ మాజీ అధ్య క్షుడు సి.శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి. రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment