మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మం రూరల్: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పాఠశాల నిర్మాణ పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలసి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 28 పాఠశాలలకు శంకుస్థాపన చేయగా.. పాలేరు నియోజకవర్గానికి స్థానం దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సుమారు 3 వేల మంది పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లో శిక్షణ ఉంటుందన్నారు. పది వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణమే.. విద్యారంగంపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని పొంగులేటి తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పెండింగ్‌లో పెట్టిన 22 వేల మంది ఉపాధ్యాయుల పదోన్నతులు, 34 వేల మంది బదిలీలను వివాదాలకు తావు లేకుండా పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment