ఇప్పటికే ఏడు బంగారు పతకాలు కైవసం
పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న మోహిత్
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) క్రీడలో హైదరాబాద్ సిటీ కుర్రాడు సత్తా చాటుతున్నాడు. ప్రత్యర్థులపై పంచ్‌లతో రెచ్చిపోతున్నాడు. ఓవైపు బీటెక్ చదువును కొనసాగిస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూ క్రీడల్లో రాణిస్తున్నాడు. అతడే మోహిత్. ఇప్పటికే ఏకంగా ఏడు బంగారు పతకాలు కైవసమయ్యాయంటే అతని పంచ్ పవరేంటో అర్థం చేసుకోవచ్చు.
తైక్వాండో నుంచి ఎంఎంఏ..
ఫిర్జాదిగూడలోని మేడిపల్లి ఏవీ ఇన్ఫో ప్రైడ్‌లో నివాసముంటున్న ఎస్ మోహిత్‌కు చిన్నతనం నుంచే క్రీడలంటే అమితాసక్తి. దీంతో అతని పేరెంట్స్ స్కూల్లో తైక్వాండో శిక్షణలో చేర్పించారు. దీంతో పాఠశాల స్థాయిలోనే అనేక పోటీల్లో మెడల్స్ సాధించాడు. యుక్త వయసులోకి వచ్చాక తైక్వాండో నుంచి ఎంఎంఏ వైపు ఆసక్తి మళ్లింది. దీంతో గ్రాప్లింగ్ (రెజ్లింగ్) శిక్షణ మొదలుపెట్టాడు. బీటెక్ చదువుతూనే సాయంత్రం వేళ నారాయణగూడలో శిక్షణ ప్రారంభించాడు. రెజ్లింగ్, బాక్సింగ్, కరాటే, తైక్వాండో, స్ట్రిక్కింగ్ వంటి కొట్లాట క్రీడలను మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అంటారు.
యూట్యూబ్‌లో టెక్నికల్ స్కిల్స్..
గతేడాది సర్దార్ పటేల్ కేసరిగా పిలిచే జిల్లా స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ సమయంలో బీటెక్ పరీక్షల కారణంగా ప్రాక్టీస్‌కు పెద్దగా టైం దొరకలేదు. దీంతో యూట్యూబ్‌లో మునుపటి మ్యాచ్‌లు, ఎంఎంఏ ప్రొఫెషనల్స్ అన్షుల్ జుబ్లీ, అలెక్స్ పెరీరా వీడియోలను చూసి, టెక్నికల్ స్కిల్స్ ప్రాక్టీస్ చేశాడు. ఈ పోటీలో 90 కిలోల కేటగిరిలో పాల్గొని, మహారాష్ట్ర ప్రత్యర్థులను చిత్తు చేసి బంగారు పతకం సాధించాడు. ఈ ఏడాది ఓపెన్ కిక్‌బాక్సింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత బెల్ట్ మ్యాచ్ కోసం పోటీపడ్డాడు. ప్రత్యర్థి తన కంటే 5–6 కిలోల బరువు ఎక్కువగానే ఉన్నాడు. అయినా సరే నైపుణ్యం, దృఢ సంకల్పంతో మ్యాచ్‌లో ప్రత్యర్థిని రెండు సార్లు నాకౌట్‌తో పడగొట్టగలిగాడు.
ఇండియాకు ప్రాతినిథ్యం నా లక్ష్యం..
చిన్నతనం నుంచే చదువుతో పాటు క్రీడలు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. దీంతో శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉంటారు. ఎంఎంఏ క్రీడ శిక్షణ, మార్గదర్శకత్వం చేయడంతో పాటు ఇండియా తరపున ప్రాతినిథ్యం వహించాలన్నదే నా లక్ష్యం.
– మోహిత్
Comments
Please login to add a commentAdd a comment