Mixed Martial Arts
-
లోకల్ లైగర్.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడలో సిటీ కుర్రాడి సత్తా !
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) క్రీడలో హైదరాబాద్ సిటీ కుర్రాడు సత్తా చాటుతున్నాడు. ప్రత్యర్థులపై పంచ్‌లతో రెచ్చిపోతున్నాడు. ఓవైపు బీటెక్ చదువును కొనసాగిస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూ క్రీడల్లో రాణిస్తున్నాడు. అతడే మోహిత్. ఇప్పటికే ఏకంగా ఏడు బంగారు పతకాలు కైవసమయ్యాయంటే అతని పంచ్ పవరేంటో అర్థం చేసుకోవచ్చు. తైక్వాండో నుంచి ఎంఎంఏ.. ఫిర్జాదిగూడలోని మేడిపల్లి ఏవీ ఇన్ఫో ప్రైడ్‌లో నివాసముంటున్న ఎస్ మోహిత్‌కు చిన్నతనం నుంచే క్రీడలంటే అమితాసక్తి. దీంతో అతని పేరెంట్స్ స్కూల్లో తైక్వాండో శిక్షణలో చేర్పించారు. దీంతో పాఠశాల స్థాయిలోనే అనేక పోటీల్లో మెడల్స్ సాధించాడు. యుక్త వయసులోకి వచ్చాక తైక్వాండో నుంచి ఎంఎంఏ వైపు ఆసక్తి మళ్లింది. దీంతో గ్రాప్లింగ్ (రెజ్లింగ్) శిక్షణ మొదలుపెట్టాడు. బీటెక్ చదువుతూనే సాయంత్రం వేళ నారాయణగూడలో శిక్షణ ప్రారంభించాడు. రెజ్లింగ్, బాక్సింగ్, కరాటే, తైక్వాండో, స్ట్రిక్కింగ్ వంటి కొట్లాట క్రీడలను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటారు.యూట్యూబ్‌లో టెక్నికల్ స్కిల్స్.. గతేడాది సర్దార్ పటేల్ కేసరిగా పిలిచే జిల్లా స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ సమయంలో బీటెక్ పరీక్షల కారణంగా ప్రాక్టీస్‌కు పెద్దగా టైం దొరకలేదు. దీంతో యూట్యూబ్‌లో మునుపటి మ్యాచ్‌లు, ఎంఎంఏ ప్రొఫెషనల్స్ అన్షుల్ జుబ్లీ, అలెక్స్ పెరీరా వీడియోలను చూసి, టెక్నికల్ స్కిల్స్ ప్రాక్టీస్ చేశాడు. ఈ పోటీలో 90 కిలోల కేటగిరిలో పాల్గొని, మహారాష్ట్ర ప్రత్యర్థులను చిత్తు చేసి బంగారు పతకం సాధించాడు. ఈ ఏడాది ఓపెన్ కిక్‌బాక్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచిన తర్వాత బెల్ట్ మ్యాచ్ కోసం పోటీపడ్డాడు. ప్రత్యర్థి తన కంటే 5–6 కిలోల బరువు ఎక్కువగానే ఉన్నాడు. అయినా సరే నైపుణ్యం, దృఢ సంకల్పంతో మ్యాచ్‌లో ప్రత్యర్థిని రెండు సార్లు నాకౌట్‌తో పడగొట్టగలిగాడు. ఇండియాకు ప్రాతినిథ్యం నా లక్ష్యం..చిన్నతనం నుంచే చదువుతో పాటు క్రీడలు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. దీంతో శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉంటారు. ఎంఎంఏ క్రీడ శిక్షణ, మార్గదర్శకత్వం చేయడంతో పాటు ఇండియా తరపున ప్రాతినిథ్యం వహించాలన్నదే నా లక్ష్యం. – మోహిత్ -
‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’కు ప్రిపేర్ అవుతున్న స్టార్స్!
విలన్ ముఖం మీద హీరో పంచ్ ఇవ్వాలా? కాలితో ఒక్క కిక్ కొట్టాలా? గాల్లో ఎగిరి పల్టీలు కొట్టి మరీ విలన్ని కొట్టాలా? ఇవన్నీ చేయాలంటే కాస్త ట్రైనింగ్ కావాలి. రెగ్యులర్ ఫైట్స్‌కి అయితే అక్కర్లేదు. బీభత్సమైన ఫైట్స్‌కి అయితే శిక్షణ తీసుకోవాల్సిందే. అది హీరో అయినా హీరోయిన్ అయినా. ఈ మధ్య రిస్కీ రోల్స్ ఒప్పుకున్న కొందరు స్టార్స్ ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకోవడానికి ప్రిపేర్ అయ్యారు. కిక్ బాక్సింగ్, కరాటే, కుంగ్ ఫూ, జూడో, కలరి పయట్టు వంటివన్నీ మార్షల్ ఆర్ట్స్ కిందే వస్తాయి. ఫైట్‌కి సూట్ అయ్యే ఆర్ట్ నేర్చుకుని బరిలోకి దిగనున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. మూడు నెలలు బ్యాంకాక్‌లో... హీరో మహేశ్‌బాబు– డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో జరిగే ఈ కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. పోరాట సన్నివేశాలు సహజంగా ఉండేందుకు కెరీర్లో తొలిసారి ఈ సినిమా కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోనున్నారట మహేశ్‌బాబు. ఇందుకోసం మూడు నెలల పాటు బ్యాంకాక్ వెళతారని టాక్. అక్కడ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, హైకింగ్, ట్రెక్కింగ్ వంటివి నేర్చుకోనున్నారట. ఈ శిక్షణ ఇవ్వనున్న బ్యాంకాక్ స్టంట్ టీమ్‌కి ఓ హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ నేతృత్వం వహిస్తారని తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రం పూర్తయ్యాక బ్యాంకాక్‌లో శిక్షణ తీసుకుని, రాజమౌళి సినిమా షూట్లో జాయిన్ అవుతారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. థాయ్‌ల్యాండ్‌లో... తొలి చిత్రం ‘ఉప్పెన’తో (2021) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ మూడు చిత్రాల్లో సాఫ్ట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించిన ఆయన తొలిసారి ‘ఆదికేశవ’ చిత్రంలో ఫుల్ యాక్షన్ రోల్ చేశారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కోసం థాయ్‌ల్యాండ్‌లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా శ్రీలీల నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 18న రిలీజ్ కానుంది. కలరి మార్షల్ ఆర్ట్‌లో... మలయాళ హీరో టొవినో థామస్ కలరి అనే మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ పొందారు. టొవినో థామస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజయంతే రందం మోషణం’. జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ పరంగా కేరళలోని కలరి అనే మార్షల్ ఆర్ట్‌కు ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉండటంతో టొవినో థామస్ ఈ విద్యలో శిక్షణ తీసుకుని నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతీ శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారతీయుడు కోసం... కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘భారతీయుడు 2’ కోసం కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ‘భారతీయుడు’ (1996) సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ (తమిళంలో ‘ఇండియన్ 2) రూపొందుతోంది. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ ఫైట్స్ చేయడం కోసం అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలరి పయట్టు నేర్చుకున్నారు కాజల్. కలరి సాధన చేస్తున్న ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో.. వంటి క్రీడలు కలరి నుంచి పుట్టుకొచ్చినవే’ అని పేర్కొన్నారామె. ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు కాజల్ అగర్వాల్. -
ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే!
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA Fight)లో మనవాళ్ల ప్రతిభ అంతంతమాత్రమే. అందునా మహిళల నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్‌లో బరిలోకి దిగేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎంఎంఏ అనేది సాధారణమైన రెజ్లింగ్ కాదు. పటిష్టమైన దేహదారుడ్యంతో పాటు మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ తెలిసి ఉండాలి. ఒక్కోసారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో పాటుగా అటు బాక్సింగ్.. ఇటు రెజ్లింగ్‌ను కలగలిపి ఈ క్రీడను ఆడాల్సి ఉంటుంది. గేమ్‌లో శరీరంలో ఏ భాగంలోనైనా పంచ్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికి నడుము కింది భాగంలో దాడి చేయడం నిషేధం. అందుకే మొహాలు, ముక్కులు పగిలి రక్తాలు కారడం చూస్తుంటాం. ఒక్కోసారి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ఆటగాళ్లు కోమాలోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇక మన దేశం నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA Fight)లో మహిళల నుంచి వెలుగులోకి వచ్చింది రీతు ఫోగట్ మాత్రమే. మహవీర్ ఫోగట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈమె తొలుత రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీ పడింది. ఆ తర్వాత ఎంఎంఏ ఫైట్‌పై ఉన్న ఆసక్తి రీతు ఫోగాట్‌ను MMA Star ఫైటర్‌గా మార్చింది. తాజాగా ఆ జాబితాలోకి మరో ఆడపులి ప్రవేశించింది. ఆమె పేరే పూజా తోమర్. ఎంఎంఏ ఫైటర్‌గా దేశం తరపున స్టార్ హోదా పొందిన ఈమె తాజాగా ఎంఎఫ్ఎన్(Matrix Night Fight) టైటిల్ గెలిచి ఔరా అనిపించింది. జూలై 2న(ఆదివారం) ఇండోర్ వేదికగా జరిగిన MFN12(Matrix Night Fight) టైటిల్ పోరులో పూజా తోమర్ చాంపియన్‌గా నిలిచింది. రష్యాకు చెందిన మాజీ చాంపియన్ అనస్థిషియా ఫెఫనోవాను బౌట్లో ఓడించి స్ట్రావెయిట్ చాంపియన్‌గా అవతరించింది. మొత్తం నాలుగు రౌండ్లలో జరిగిన ఫైట్‌లో ఏ దశలోనూ పూజా తోమర్ తగ్గింది లేదు. ప్రతీ రౌండ్లో తన ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది. నాలుగో రౌండ్‌కు వచ్చేసరికి అనస్థిషియా ఇక ఆడలేనంటూ పక్కకు తప్పుకోవడంతో పూజా తోమర్ విజేతగా నిలిచినట్లు రిఫరీ ప్రకటించారు. ఆమె ప్రదర్శనను టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యక్షంగా వీక్షించారు. దిశా పటానీ, టైగర్ ష్రాఫ్, శిఖర్ ధావన్‌లు గేమ్ ముగిసిన అనంతరం ఆమెను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. Hard work pays off😊💪 Thanks to @mfn_mma @ayeshashroff @kishushroff for the opportunity. Thanks to my coach @thefighterscoach for motivating and guiding me. Thanks to my Family and Friends for supporting me. Thanks to my Fans for all their love, support and care. @somafightclub pic.twitter.com/zqfL0WQ9CH — puja tomar (@pujatomar19) July 2, 2023 చదవండి: 'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు' #Ben Stokes: స్టోక్స్‌ను దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా పత్రిక.. ఫోటో వైరల్ -
'లైగర్' సినిమా ఎమ్ఎంఏ ఫైట్.. క్రూరమైన క్రీడ నుంచి ఆదరణ దిశగా
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా సినిమా ''లైగర్'' ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా ఫలితం సంగతి పక్కనబెడితే.. ఈ సినిమా ఎంఎంఏ ఫైట్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) నేపథ్యంలో తెరకెక్కింది. మన దేశంలో చాలా మంది ఎంఎంఏ అంటే తెలిసి ఉండకపోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తెలిసినవాళ్లకు మాత్రమే ఈ క్రీడపై కాస్త అవగాహన ఉంటుంది. చాలా మందికి తెలియని ఎంఎంఏ క్రీడ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. -సాక్షి,డెబ్డెస్క్ photo credit : Getty Images ఎంఎంఏ ఫైట్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) అనేది ఒక హైబ్రిడ్ యుద్ధ క్రీడ. బాక్సింగ్, రెజ్లింగ్, జడో, కరాటే, థాయ్ బాక్సింగ్ వంటి క్రీడల నుంచి తీసుకున్న కొన్ని టెక్నిక్స్‌తో ఎంఎంఏను రూపొందించారు. అయితే ఎంఎంఏ రూపొందించిన తొలి రోజుల్లో ఎలాంటి నిబంధనలు పెట్టకపోవడంతో అత్యంత క్రూరమైన క్రీడగా చాలా మంది పేర్కొన్నారు.కానీ కాలక్రమంలో ఎంఎంఏ ఆ చెడ్డ పేరు నుంచి బయటపడి ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న క్రీడగా ఆదరణ పొందుతుండడం విశేషం. photo credit : Getty Images చరిత్ర తిరగేస్తే క్రీస్తూ పూర్వమే ఎంఎంఏ గేమ్‌ను ఒలింపిక్స్‌లో ఆడారని ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. మనకు తెలిసి 20వ శతాబ్దంలో బ్రెజిల్ లోని వాలే ట్యూడో ద్వారా ఎంఎంఏ గేమ్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కార్లో, హెలియో అనే ఇద్దరు సోదరులు నార్త్ అమెరికాలో ఈ గేమ్‌కు బాగా పాపులారిటీ తీసుకొచ్చారు. వాళ్లే ఈ టోర్నమెంట్ కు యూఎఫ్‌సీ(UFC)-అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ అని పేరు పెట్టారు.అయితే ఈ ఎంఎంఏ(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్)పై అమెరికా సహా చాలా దేశాల్లో ఆంక్షలు ఉన్నాయి. ఎంఎంఏ మ్యాచ్‌ల్లో విజయాలను సబ్మిషన్, నాకౌట్, టెక్నికల్ నాకౌట్, న్యాయనిర్ణేతల ద్వారా నిర్ణయిస్తుంటారు. photo credit : Getty Images ఎంఎంఏ ఆట.. కఠిన నిబంధలు ►దశ దిశ లేకుండా సాగుతున్న ఎంఎంఏ ఆటకు యూఎఫ్‌సీ(అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్) కొన్ని స్థిరమైన నిబంధనలు, రూల్స్ తీసుకొచ్చింది. ఆ నిబంధనలు, రూల్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం ►రింగ్‌లోకి వెళ్లే ఆటగాళ్లు ప్యాడ్స్ ఉన్న ఫింగర్‌లెస్ గ్లౌజులతోనే పోరాడాలి ►బూట్లు వేసుకోకూడదు.. తలకు ఎటుంటి సేఫ్‌గార్డ్స్ పెట్టుకోకూడదు. ►ప్రత్యర్థి ఆటగాడి కంట్లో పొడవడం, కొరకడం, జట్టు లాగడం, తలతో కొట్టడం వంటివి పూర్తిగా నిషేధం. photo credit : Getty Images ఎంఎంఏలో యూనిఫైడ్ రూల్స్ కింద ఒక్కో రౌండు ఐదు నిమిషాల చొప్పున మూడు రౌండ్లు పోరాడాల్సి ఉంటుంది. ఒక్కో రౌండు ముగిసిన తర్వాత ఒక నిమిషం విశ్రాంతినిస్తారు. అదే చాంపియన్‌షిప్ బౌట్స్‌లో ఐదు రౌండ్లు ఉంటాయి. ప్రత్యర్థిని నాకౌట్ చేయడం, సబ్మిషన్(ప్రత్యర్థిని ఓటమి ఒప్పుకునేలా చేయడం) ద్వారా గెలుపును నిర్ణయిస్తారు. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్లు సమంగా పోరాడితే మాత్రం.. ఇద్దరిలో విజేత ఎవరనేది ప్యానెల్ నిర్ణయిస్తుంది. photo credit : Getty Images ఇక అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని లాస్వేగాస్లో ఉన్న యూఎఫ్‌సీ ఎంఎంఏకు ప్రధాన సంస్థ. ప్రతీ ఏడాది వివిధ స్థాయిల్లో యూఎఫ్‌సీ ఎంఎంఏ విభాగంలో ఈవెంట్లు నిర్వహిస్తూ వస్తోంది. అందుకే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా సెకండాఫ్ మొత్తం లాస్వేగాస్లో షూటింగ్ జరుపుకుంది. చదవండి: 'లైగర్' బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడిన మౌత్ టాక్ Stuart Broad: ముప్పతిప్పలు పెట్టి తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. -
పంచ్ అదరాలి..
హైదరాబాద్ సిటీ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్‌కు వేదిక కానుంది.ఈ మేరకు ఈ నెల 22న గచ్చిబౌలి స్టేడియంలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ‘బ్రేవ్–20’ నిర్వహించనున్నారు. కండలు తిరిగిన ఫైటర్లు...కళ్లు చెదిరే పంచ్‌లతో రింగ్‌లో అద్భుతమైన విన్యాసాలు చూడొచ్చనినిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ పోరులో పాల్గొనేందుకు 15 దేశాల నుంచి ప్రముఖ ఫైటర్లు నగరానికి రానున్నారు.∙22న మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ‘బ్రేవ్–20’ ∙వేదికైన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ∙15 దేశాల నుంచి ఫైటర్స్ హాజరు∙మన దేశ ఫైటర్లకు గేమ్‌లో చోటు ∙21న నెక్లెస్ రోడ్డులో ఫ్రీ ట్రైల్ కండలు తిరిగిన ఫైటర్లు.. పళ్లు బిగించి రింగ్‌లో పంచ్‌లు విసురుతుంటే చూస్తున్న వారి ఒళ్లు జలదరించాల్సిందే. ఇటువంటి ఫైటింగ్ వీడియోలు చూసే ఉంటాం. లైవ్ ఫైట్స్ అన్నీ ఇప్పటి దాకా ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ చానల్లో మాత్రమే చూసి ఉంటాం. వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ విదేశాలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, కెన్యా, సౌతాఫ్రికా వంటి దేశాల్లో అత్యంత ప్రజాదరణ ఉన్నవాటిలో ఈ క్రీడలు ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సరికొత్త ఆట నగరవాసులను అలరించనుంది. భారతదేశంలో తొలిసారి ‘మెర్క్యుర్ స్పోర్ట్స్’ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22న జరిగే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ) ‘బ్రేవ్–20’కి గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. ఈ పోరులో పాల్గొనేందుకు 15 దేశాల నుంచి కండలు తిరిగిన ఫైటర్లు నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ‘ఎంఎంఏ’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – చైతన్య వంపుగాని ఎక్కడిది ఈ ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’ ‘బెహరైన్’ దేశంలో అక్కడి యువరాజు ‘షేక్ ఖాలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా’ మూడేళ్ల క్రితం ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’(ఎంఎంఏ)ను ‘బ్రేవ్–20’ పేరుతో ఈ ఆటను అక్కడ ప్రారంభించారు. ఇలా ఇప్పటి దాకా 22 దేశాల్లో 19 గేమ్స్ జరిగాయి. ఇప్పుడు ‘గ్లోబల్ ప్రమోషన్’ పేరుతో మన దేశంలో ఏర్పాటు చేసేందుకు ‘ఆల్ ఇండియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్’ అనుమతి ఇచ్చింది. దీంతో దీన్ని సిటీలో నిర్వహించేందుకు ‘మెర్క్యూర్ స్పోర్ట్స్’ సీఈఓ అక్బర్ రషీద్ ముందుకు వచ్చారు. ప్రమోటర్స్ వంశీరాజ్, శ్రీనివాస్, ఆదిత్యతో కలసి ఈ నెల 22న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆటను ప్రారంభించనున్నారు. భారతేదశంలో తొలిసారి నగర వేదికపై ఈ క్రీడ జరుగుతుండడంతో క్రేజ్ పెరిగిపోయింది. బాక్సింగ్‌ను పోలినట్టు.. అందరికీ తెలిసిన బాక్స్ంగ్ మాదిరిగానే ఈ ఆట కూడా ఉంటుంది. అయితే, ఇందులో ముష్టిఘాతాలతో పాటు కర్రసాము కూడా అదనం. ఈ క్రీడ మిడిల్ వెయిట్ బౌట్, లైట్ వెయిట్ బౌట్, బంటమ్ వెయిట్ బౌట్, స్ట్రావ్వెయిట్ బౌట్, ఫిదర్ వెయిట్ బౌట్.. ఇలా మొత్తం 12 కేటగిరీల్లో జరుగుతుంది. అండర్ కార్డ్ విభాగంలో ‘హైవెయిట్ బౌట్, బంటమ్ వెయిట్ బౌట్, మిడిల్ వెయిట్ బౌట్, లైట్ వెయిట్ బౌట్, ఫ్లైవైయిట్ బౌట్’ కేటగిరిల్లో ఇద్దరు చొప్పున తలపడతారు. ఐదు నిమిషాలకు ఓ రౌండ్ చొప్పున మూడు రౌండ్స్ ఉంటాయి. ఒక్కో గేమ్‌ను 15 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇందులో ఓ నిమిషం బ్రేక్ ఉంటుంది. 150 మంది ఆటగాళ్లు రాక గతంలో ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఆటగాళ్లు కూడా ఇప్పుడు జరిగే పోటీలో పాల్గొనేందుకు సిటీకి రానున్నారు. అలాంటి వారు 150 మంది ఉన్నట్టు అక్బర్ రషీద్ తెలిపారు. వీరిలో మన దేశానికి చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారు. వారిలో లియోన్ అలియూ, కాంతరాజ్ శంకర్, నెల్సన్ ఫయీస్, సతేందర్ బంకురా, జాసన్ సాల్మన్, సరబ్జిత్ సింగ్, సత్య బహారియా, నిథిన్ కోషీ ఉన్నారు. 21న ఆటగాళ్లతో పరిచయం ఈ ఆటను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ‘మెర్క్యూర్ స్పోర్ట్స్’ సిద్ధమైంది. క్రీడాకారులను నగరవాసులకు పరిచయం చేసేందుకు సన్నహాలు చేస్తున్నాం. ఈ నెల 21న మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో ట్రయల్ ఫైట్స్ ఉంటాయి. దీనికి ఎలాంటి ప్రవేశ రుసుం లేదు. – అక్బర్ రషీద్, మెర్క్యూర్ స్పోర్ట్స్ సీఈఓ టికెట్లు ఇలా.. ఈ ఆట టికెట్ ధరలు రూ.499 నుంచి రూ.4999 వరకు ఉన్నాయి. గ్యాలరీ టిక్కెట్ రూ.499, ప్రీమియం టిక్కెట్ రూ.3500, వీవీఐపీ టికెట్ రూ.4999. కావాల్సిన వారు www.meraevents.com లో బుక్ చేసుకోవచ్చు. -
జిల్లాను క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దుతాం
=మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాభివృద్ధికి కృషి =అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : జిల్లాలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాభివృద్ధితోపాటు క్రీడల కేంద్రంగా జిల్లాను తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అన్నారు. వరంగల్ హంటర్‌రోడ్డులోని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌కు మంచి అవకాశాలున్నాయన్నారు. ప్రధానంగా కుంగ్‌ఫూ, తైక్వాండో, జూడో, బాక్సింగ్‌లో ప్రవేశం ఉన్న క్రీడాకారులు సైతం ఈ ఆటలో పాల్గొనేందుకు అవకాశముంటుందని తెలిపారు. జిల్లా నుంచి మార్షల్ ఆర్ట్స్‌లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారుకావాలని, వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. అనంతరం జూడో అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర టెక్నికల్ డెరైక్టర్ కైలాస్‌యాదవ్ మాట్లాడుతూ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌కు ముంబై, విశాఖలో ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయని, మూడో ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లాలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటికే ఈ విషయమై రాష్ట్ర, జాతీయ అసోసియేషన్ సెక్రటరీలతో చర్చించినట్లు వెల్లడించారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్‌రావు ఆధ్వర్యంలో జనవరిలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ కార్యదర్శి కిరణ్, ఉపాధ్యక్షులు రాజు, శ్రీనివాస్, రవి, సారంగపాణి, వెంకట్, మహెందర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలు వినీల్, ధన్రాజు, ఆదినారాయణ, బోగేశ్వర్, కోశాధికారి భాస్కర్, కార్యవర్గసభ్యులు నిశాంత్, రాజు, జనార్దన్, వంశీధర్, హరిబాబు పాల్గొన్నారు.