వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
అత్యధికంగా బాచుపల్లిలో 10.8 సెంటీమీటర్ల వర్షం
బుధవారం సగటున 1.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
రాష్ట్రంలో తగ్గిన గరిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వివరించింది.
బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.24 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని ప్రణాళికా విభాగం వివరించింది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సగటున 4.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హైదరాబాద్ జిల్లాలో సగటున 4.42 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్లగొండ, ములుగు జిల్లాల్లో సగటున 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాచుపల్లిలో 10.8 సెంటీమీటర్లు, ఆ తర్వాత శేరిలింగంపల్లిలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జకొరలో 42.9 డిగ్రీల సెల్సియస్
మంగళవారం, బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురవడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదయ్యాయి.
అధికంగా నిజామాబాద్ జిల్లా జకొరలో 42.9 డిగ్రీల సెల్సియస్, కొరట్‌పల్లిలో 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి కాస్త తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కొన్నిచోట్ల సాధారణం కంటే అధికంగా నమోదవు తాయని వాతావరణ శాఖ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment