నేడు, రేపు తేలికపాటి వానలు
2–3 రోజుల్లో మరింత విస్తరించనున్న రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొద్ది రోజుల నుంచి నైరుతి రుతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి. ప్రస్తుతం షీర్ జోన్, గాలుల కోత కారణంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. అదే సమయంలో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, ఒడిశా, వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఫలితంగా ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి.
కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కాగా గురు, శుక్రవారాల్లో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు అక్కడక్కడ పిడుగులు పడతాయని వివరించింది. బుధవారం రాయలసీమలో కొన్నిచోట్ల భారీగా, పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. సిద్ధాపురం (కర్నూలు) 5.1, వ్యాసపురం (అనంతపురం) 5.0, కూచినపూడి (బాపట్ల) 3.8, మారాల (శ్రీసత్యసాయి) 2.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment