లారీలో ‘హోమ్‌’ డెలివరీ.. ఏమిటీ కంటైనర్‌ హోమ్‌? | Modular Homes: Container Homes Demand Increased In India | Sakshi
Sakshi News home page

లారీలో ‘హోమ్‌’ డెలివరీ.. ఏమిటీ కంటైనర్‌ హోమ్‌?

Published Fri, Feb 10 2023 2:05 AM | Last Updated on Fri, Feb 10 2023 8:27 AM

Modular Homes: Container Homes Demand Increased In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా తర్వాత ఆరోగ్యక­రమైన జీవితంపై అందరికీ శ్రద్ధ పెరిగింది. తినే తిండి నుంచి ఉండే ఇల్లు వరకూ ఎక్కడా రిస్క్‌ తీసుకోవట్లేదు. సేంద్రియ ఆహార ఉత్పత్తులు తింటూ పచ్చని ప్రకృతి ఒడిలో నివాసం ఉండాలని భావిస్తున్నారు. కనీసం ఇంటి చుట్టూ నాలుగు చెట్లయినా ఉండాలనుకుంటున్నారు. ఫలితంగా ఫామ్‌హౌస్‌లకు, ఫామ్‌ ప్లాట్లకు డిమాండ్‌ పెరిగింది.

ఫామ్‌హౌస్‌లు కొనుగోలు చేయలేనివారు ఫామ్‌ ప్లాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఫామ్‌ ప్లాట్లలో నివాస భవనాలకు నిర్మాణ అనుమతులు రావు. దీంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే కంటైనర్‌ హోమ్స్‌ (మాడ్యులర్‌ హోమ్స్‌)కు గిరాకీ పెరిగింది. ఇల్లులా ఏర్పాటు చేయడానికి అవసరమైనవన్నీ ఫ్యాక్టరీలో తయారు చేసి, లారీలో తీసికొచ్చి బిగించేస్తున్నారు.

శామీర్‌పేట, కొంపల్లి, కందుకూరు, చేవెళ్ల, భువనగిరి, సదాశివపేట, ఆదిభట్ల, మేడ్చల్‌ వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లలో కంటైనర్‌ హోమ్స్‌ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల్లో మాదిరిగా ఇప్పుడిప్పుడే ఆఫీసులు, హోటళ్లు, వసతి గృహాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలలో ఈ తరహావి ఏర్పాటు చేసేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా చాలామంది ఫామ్‌ ప్లాట్లలో కంటైనర్‌ హోమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారాంతంలో కుటుంబంతో కలిసి పచ్చని వాతావరణంలో సరదాగా గడుపుతున్నారు.  

ఏమిటీ కంటైనర్‌ హోమ్‌?
►కంటైనర్‌ హోమ్స్‌ను గ్యాల్వనైజింగ్‌ స్టీల్‌ షీట్లతో తయారు చేస్తారు. కింద భాగంలో గ్రిడ్‌ వేసి సిమెంట్, కలప మిశ్రమంతో తయారైన బైసన్‌ బోర్డ్‌ వేస్తారు. దానిపైన పాలీ వినైల్‌ ఫ్లోర్‌ (పీవీసీ) ఉంటుంది. పీవీసీ వద్దనుకుంటే బైసన్‌ బోర్డ్‌ మీద టైల్స్‌ కూడా వేసుకోవచ్చు.

►ఇంటి బీమ్‌లు, ఫౌండేషన్‌ స్ట్రక్చర్‌లను ఉక్కుతో నిర్మిస్తారు. గాల్వనైజ్‌ పూత ఉంటుంది. ప్రధాన స్ట్రక్చరల్‌ ఫ్రేమ్, ఫ్లోర్, బాహ్య, అంతర్గత గోడలు, సీలింగ్‌ ప్యానల్స్‌లను ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ప్రీ ఫినిష్డ్‌ వ్యాల్యుమెట్రిక్‌ కన్‌స్ట్రక్షన్‌ (పీపీవీసీ)లతో రూపొందిస్తారు. 

►తలుపులు, కిటికీలు ఇంపాక్ట్‌ రెసిస్టెంట్‌ గ్లాస్‌లతో ఏర్పాటు చేస్తారు. గాలి, తేమలను నిరోధించేలా నాన్‌ వుడ్‌ కాంపోజిట్, సిమెంట్‌ బోర్డ్‌లతో బహుళ పొరలను ఏర్పాటు చేస్తారు. థర్మల్‌ ఇన్సులేషన్‌తో వాల్‌ ప్యానెల్‌ క్లాడింగ్‌లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వేడి ఇంటి లోపలికి రాదు. బయటి వాతావరణం కంటే 6–7 డిగ్రీల తక్కువ ఉష్ణోగత ఉంటుంది.

►నిర్మాణ సామగ్రి తయారీలో బహుళ జాతి కంపెనీలైన సెయింట్‌ గోబైన్, గైప్రోక్‌ల నైపుణ్య కార్మికులు ఈ కంటైనర్‌ హోమ్స్‌ను తయారు చేయడంలో సిద్ధహస్తులు. స్ట్రక్చరల్‌ ఇంజనీర్, ఆర్కిటెక్ట్‌ల సమక్షంలో వీటిని తయారు చేస్తారు. విస్తీర్ణాన్ని బట్టి కంటైనర్‌ హోమ్స్‌ ధరలు ఉంటాయి. మన అభిరుచుల మేరకు హాల్, కిచెన్, బెడ్‌రూమ్, జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి ఏ వసతులనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. 

నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు..
ఈ కంటైనర్‌ హోమ్స్‌కు స్ట్రక్చరల్‌ వారంటీ 50–60 ఏళ్లు ఉంటుంది. ఇంటి తయారీలో వినియోగించిన అంతిమ ఉత్పత్తి డ్యూరబుల్‌ వారంటీ 25 ఏళ్లు ఉంటుంది. ఈ కంటైనర్‌ హోమ్స్‌ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించవచ్చు. వీటిని మెటల్‌తోనే తయారు చేస్తారు కాబట్టి డబ్బులు తిరిగొస్తా­యి. ఎక్కువ నష్టం ఉండదు.

కరోనా టైంలో కట్టించా..
నా పేరు కిశోర్, డిజైనర్‌గా ఉద్యోగం చేస్తు­న్నా. కరోనా రెండో దశలో మా కుటుంబ సభ్యు­లకు వైరస్‌ వచ్చింది. ఆ సమయంలో చు­ట్టుపక్కల వాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జనావాసా­లకు దూరంగా ఇల్లు ఉంటే బెటర్‌ అనిపించింది. దీంతో విశాఖపట్నంలోని కోడూ­రు­లో ఉన్న ఫామ్‌ప్లాట్‌లో రెడీమేడ్‌ ఇల్లు కట్టించుకోవాల­నుకున్నా.

తక్కువ ఖర్చుతో, త్వరగా పూర్తయ్యే ఇల్లయితే బాగుంటుందని పరిశోధన చేసిన తర్వాత 1,200 చ.అ. 2 బీహెచ్‌కే మాడ్యులర్‌ హోమ్‌ కట్టించుకున్నా. 4 నెలల్లో నిర్మాణం పూర్తయింది. రూ.20 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు కరోనా బెడద తొలగడంతో సొంతింటికి వచ్చేశాం. కానీ ప్రతి వీకెండ్‌కు అందరం అక్కడికి వెళ్లి పచ్చని వాతావరణంలో గడిపి వస్తున్నాం.

హోటల్‌ రూమ్‌కు బదులు చిన్న ఇంట్లో..
నా పేరు చైతన్య. విజయవాడలో వ్యాపారిని. నాకు పటాన్‌చెరులోని ముత్తంగిలో 1,600 గజాల స్థలం ఉంది. పని మీద హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఒకట్రెండు రోజులో సిటీలో ఉండాల్సి వస్తుంది. లాడ్జిలో లేదా తెలిసిన వాళ్ల ఇళ్లల్లో ఉండే బదులు నా సొంత స్థలంలో చిన్నపాటి ఇల్లు కట్టించుకుంటే అయిపోతుంది కదా అనిపించింది. అలా 1,100 చ.అ మాడ్యులర్‌ హోమ్‌ కట్టించుకున్నా. చ.అ.కు రూ. 1,300 చొప్పున రూ.14.30 లక్షలు అయింది. ఇంటీరియర్, ఇతరత్రా వ్యయాలు కలిపి మొత్తం రూ.16 లక్షలు ఖర్చయింది. సిటీకి వచ్చినప్పుడల్లా ఇందులోనే ఉంటున్నా. స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తారేమోనన్న భయం కూడా పోయింది.

ఫామ్‌హౌస్‌లలో డిమాండ్‌ ఉంది
కరోనా తర్వాతి నుంచి కంటైనర్‌ హోమ్స్‌కు డిమాండ్‌ ఏర్పడింది. చాలా మంది ఫామ్‌ ప్లాట్లను కొనుగోలు చేశారు. వాటిల్లో ఈ హోమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫ్యామిలీకి అవసరమైన వసతులన్నీ ఈ కంటైనర్‌ హోమ్స్‌లో ఉంటుండటంతో వీకెండ్‌లో ఫ్యామిలీతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నారు. 
– భరత్‌ తేజ్, ఎండీ, అర్బన్‌ శాస్త్ర స్మార్ట్‌ బిల్డ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement