నల్లగొండ : మునుగోడు ఉపఎన్నికలో పోటాపోటీగా పంపకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున మద్యం పంచి, సిట్టింగులు నిర్వహించిన పార్టీలు.. ఆఖరి అస్త్రంగా డబ్బు పంపిణీని ప్రారంభించాయి. మొన్నటివరకు ఒక్కో ఓటుకు రూ.5వేలు, రూ.10 వేలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఓ పార్టీ ఓటుకు రూ.3వేల చొప్పున, మరో పార్టీ రూ.4వేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది.
కొన్నిచోట్ల రూ.3వేల చొప్పున సమానంగా పంపిణీ జరిగింది. సోమవారం రాత్రి నుంచే పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిని ప్రారంభించాయి. రెండో విడత కూడా డబ్బులు పంపిణీ చేసేందుకు పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి విడత రూ.3వేలు, రూ.4వేలు చొప్పున పంపిణీ చేసిన పార్టీలు తిరిగి రెండో విడత ఎంత పంచుతాయో. నేరుగానే ఇంటింటికి తిరిగి నగదును పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
ఓటరు ఎటువైపో..
గత రెండు మాసాల నుంచి ఆయా పార్టీలు కులాల వారీగా సమావేశాలు, సభలు పెట్టి ఎన్నో హామీలు ఇచ్చాయి. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు కూడా. ప్రచారాల్లో ఏ పార్టీ మీటింగ్ పెట్టినా జనం భారీగానే హాజరయ్యారు. దీంతో ఓటరుకు ఆయా పార్టీలు డబ్బులు నేరుగా పంపిణీ చేస్తున్నా ఏ పార్టీకి ఓటు వేస్తారన్నదానిపై అంతుచిక్కడం లేదు. అభ్యర్థులు మాత్రం ఎవరి నమ్మకంలో వారు ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 298 పోలింగ్ బూత్‌లు ఉండగా 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment