దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
బీఆర్‌ఎస్, దళిత సంఘం నేతలతో కలిసి ఫిర్యాదు
ముషీరాబాద్: రోడ్డుపై నిలుచున్న వ్యక్తిని ముషీరాబాద్ పోలీసులు అకారణంగా దాడి చేశారు. పోలీసుల దెబ్బలకు బాధితుని చేయి విరగడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆదివారం బాధితుడు ముషీరాబాద్ బీఆర్‌ఎస్ మీడియా సెల్ ఇన్‌చార్జి సత్యనారాయణబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనాన్ని స్నేహితుడు తీసుకెళ్లడంతో వాహనం కోసం వినోభానగర్‌లోని తన ఇంటి సమీపంలో రోడ్డుపై నిలుచోని ఉన్నానని తెలిపారు.
స్నేహితుడి కోసం నిల్చున్నానని చెబితే...
పార్సిగుట్ట నుంచి వినోభానగర్ వైపు వెళ్తున్న పోలీసులు ఇక్కడ నిలబడొద్దని సూచించారు. తన స్నేహితుడి కోసం నిల్చున్నానని చెబితే అయినా వెళ్లిపోవాలని దురుసుగా మాట్లాడారని అన్నారు. పక్కనున్న బార్‌ను మూయించరు కానీ తనను దబాయిస్తారేందని ప్రశ్నించినందుకు తనపై విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టారన్నారు. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి వెళ్లానని తెలిపారు. వైద్యులు పరీక్షలు చేసి చేయి విరిగిందని చెప్పారన్నారు.
ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలి...
ఆదివారం ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు, మాదిగ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నవీన్‌రాజ్ బాధితుడు సత్యనారాయణ బాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం బాధితుడిని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఇన్‌స్పెక్టర్ రాంబాబుకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ బాబుపై దాడి చేసిన ఏఎస్‌ఐ మోహన్‌రావు, ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయాలన్నారు. వారిని సస్పెండ్ చేయని పక్షంలో స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment