సాక్షి, నల్గొండ: నేరెడుగొమ్ము మండలం బుగ్గతండాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. అర్ధరాత్రి ఆరుబయట ఆదమరచి నిద్దరోతున్న దంపతులపై దాయాదులు పథకం ప్రకారం దాడి చేసి ఘాతుకానికి ఒడిగట్టారు. కళ్లలో కారంచల్లి, కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికారు. ఏం జరుగుతుందోనని తెలుసుకునే లోపే.. ప్రత్యర్థుల దాడిలో ఆ దంపతులు విలవిలలాడుతూ ప్రాణాలు విడిచారు. దీంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న బుగ్గతండా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రెడుగొమ్ము మండలం బుగ్గతండాకు చెందిన వాంకుణావత్ సోమాణి(48), బుల్లి(42) దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. కాగా, సోమాణి సోదరుడు లచ్చ కుటుంబంతో కొంత కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. తరచూ కుటుంబపరమైన వివాదాలు చోటు చేసుకునేవని ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు. కాగా, కొన్నేళ్ల క్రితం లచ్చ అనారోగ్యంతో మృతిచెందాడు.
తరచు గొడవలే..
తండాకు చెందిన సోమాణి, లచ్చ కుటుంబాలు పక్కపక్కనే గృహాలు నిర్మించుకుని నివాసిస్తున్నారు. అయితే, రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదాలు ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రతి చిన్న విషయంపై రెండు కుటుంబాలు తారస్థాయిలో గొడవపడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే లచ్చ అనారోగ్యంతో మృతిచెందడంపై కూడా అతడి కుమారులు అనుమానం పెంచుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లచ్చ కుమారులైన రమేశ్, గణేశ్, సురేష్, నరేశ్ సోమాణి కుటుంబంపై కక్ష పెంచుకున్నారని తెలుస్తోంది.
పథకం ప్రకారమే..
లచ్చ కుమారులు పథకం ప్రకారమే సోమాణి, బుల్లిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ముందస్తుగానే తమ ఇంట్లోని మహిళలను మరో చోటికి పంపి దాడి చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాగా, వేసవి కాలం కావడంతో సోమాణి, బుల్లి దంపతులు ఆది వారం రాత్రి ఆరుబయట నిద్రించారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయడంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రాణాలు విడిచారని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని డిండి సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో పరిశీలించారు.
కాగా, సమాచారం అందుకున్న సోమాణి కుమారులు, బంధువులు లచ్చ కుమారుల ఇంటిపై దాడికి దిగారు. దీంతో గ్రామంలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు నచ్చజెప్పారు. కాగా, హత్యోదంతంతలో లచ్చ కుమారులే పాల్గొన్నారా..? మరి కొంత సహకారం తీసుకున్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహా లను దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే హత్యకు పాల్పడిన నిందితులు పరా రీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడి కుమారు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
( చదవండి: డబ్బు ఇవ్వలేదని.. కన్నతండ్రినే బకెట్‌తో కొట్టి.. )
Comments
Please login to add a commentAdd a comment