
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు ఆమె నిన్ననే బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అయితే.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోరిన కోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ ఉదయం పిటిషన్‌పై విచారణ కొనసాగగా.. షర్మిల కొట్టిందన్న వీడియోలను మాత్రమే పదే పదే చూపిస్తున్నారని, కానీ అంతకు ముందు ఆ తర్వాత ఏం జరిగిందనేది మాతంర చూపించడం లేదని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
చివరకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్‌టీపీ తరపున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు షర్మిల పిలుపు ఇచ్చారు.
షర్మిలను పరామర్శించిన విజయమ్మ
చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ షర్మిలను.. వైఎస్ విజయమ్మ మంగళవారం పరామర్శించారు. విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని విజయమ్మ నిలదీశారు. ‘‘పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు.
షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారు. షర్మిల పాదయాత్రను కూడా అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా షర్మిలకు లేదా? ప్రజల కోసమే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ ఆశయ సాధన కోసమే షర్మిల పోరాటం చేస్తోంది. ప్రభుత్వాలను ప్రశ్నించడమే మా తప్ప. ప్రశ్నించే వారిని ఇంకా ఎంతకాలం అణచివేస్తారు? అని విజయమ్మ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నాకు స్వేచ్ఛ లేదా?.. వైఎస్ షర్మిల
Comments
Please login to add a commentAdd a comment