ని‘వారించండి’... | Narendra Modi Speaks With Lady IAS Officers In Video Conference | Sakshi
Sakshi News home page

ని‘వారించండి’...

Published Sat, Sep 5 2020 4:12 AM | Last Updated on Sat, Sep 5 2020 4:47 AM

Narendra Modi Speaks With Lady IAS Officers In Video Conference - Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఐపీఎస్‌ ప్రొబేషనర్లతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ.. చిత్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సహాయ మంత్రి కిషన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: జమ్మూకశ్మీర్‌లో యువతను దుష్టశక్తులు ఉగ్రవాదంపైపు ఆకర్షిస్తూ ఉగ్ర గ్రూపుల్లో చేర్చుకుంటున్న వైనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాద భూతంతో విలవిల్లాడుతు న్న జమ్మూకశ్మీర్‌లో యువత ‘తప్పుడు బాట’పట్టకుండా నివారించేందుకు మహిళా పోలీసు అధికారులు ఆయా పిల్లల తల్లులను చైతన్యపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ సూ చించారు. మహిళా అధికారులకు ఆ సామ ర్థ్యం ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ శివార్లలోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన 2018 బ్యాచ్‌ ఐపీఎస్‌ ప్రొబేషనర్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ముఖ్య అతిథిగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ అధికారులతో మాట్లాడిన మోదీ... వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కశ్మీర్‌లో యువత పరిస్థితిని ప్రస్తావించడంతోపాటు టెక్నాలజీ వాడకం, శిక్షణ, నైపుణ్యం వంటి అంశాలపై ప్రొబేషనర్లకు కీలక సూచనలు చేశారు. 

కశ్మీరీలు ప్రేమపూర్వక ప్రజలు... 
ఓ మహిళా ప్రొబేషనర్‌కు బదులిస్తూ కశ్మీరీలు ఎంతో ప్రేమపూర్వక ప్రజలని మోదీ కితాబిచ్చారు. కొత్త విషయాలను నేర్చుకొనే ప్రత్యేక సామర్థ్యం వారిలో ఉందన్నారు. ‘‘వారితో నేను ఎంతగానో మమేకమయ్యాను. వారు మిమ్మల్ని ఎంతో ప్రేమతో చూస్తారు. కశ్మీరీ యువత తప్పుడు బాటలో పయనించకుండా ఆపేలా మనందరం కలసికట్టుగా కృషి చేయాలి. దీన్ని మహిళా పోలీసు అధికారులు ఎంతో సమర్థంగా నిర్వహించగలరు. అలాంటి పిల్ల  ల తల్లులను వారు చైతన్యపరిచి యువత వెనక్కి వచ్చేలా చేయగలరు. దీన్ని తొలి దశలోనే చేయగలిగితే మన పిల్లలు తప్పుడు మా ర్గంలోకి వెళ్లకుండా నివారించగలమని గట్టిగా నమ్ముతున్నా’’అని మోదీ పేర్కొన్నారు. 

టెక్నాలజీ వాడకమే కీలకం... 
సమర్థ పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తుంది. అది సీసీటీవీ ఫుటేజీ కావొచ్చు లేదా మొబైల్‌ ట్రాకింగ్‌ కావచ్చు. అది మీకు ఎంతగానో దోహదపడుతుంది. క్షేత్రస్థాయి సమాచారానికి ప్రాధాన్యమిస్తూనే బిగ్‌ డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సోషల్‌ మీడియా వంటి వాటిని మెరుగైన పోలీసింగ్‌లో ఆయుధాలుగా ఉపయోగించవచ్చు’’అని మోదీ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సానుకూలంగా ఉపయోగించేలా పోలీసు అధికారులు ప్రజలకు శిక్షణ ఇవ్వాలన్నారు. పోలీసులు ఎలాంటి తప్పులు చేయరాదన్న మోదీ.. ఒకవేళ ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం వారిని పట్టిస్తుందని హెచ్చరించారు. 

‘సింగం’ పాత్రల ప్రభావానికి లోనుకావొద్దు.. 
‘‘పోలీసు అకాడమీ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం పరిస్థితి మారిపోతుంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. మొదటి అభిప్రాయమే చివరి వరకు ఉంటుంది. మీ బదిలీతోపాటు మీ ఇమేజ్‌ మీ వెంట వస్తుందన్న విషయం మరువరాదు. మీకు పోస్టింగ్‌ లభించిన ప్రతి ఠాణాతో అనుబంధ భావనను పెంచుకొంటూ దానిని గర్వకారణంగా భావించాలి’’అని ప్రధాని కోరారు. ప్రజలను భయపెట్టి అదుపు చేయడంకన్నా వారిపై దయ, జాలిని చూపించి వారి మనసులను గెలుచుకొంటే అది చిరకాలం నిలిచిపోతుందన్నారు. ‘సింగం’లాంటి సినీ వీరోచిత పోలీసు పాత్రల ప్రభావానికి లోనుకారాదని మోదీ సూచించారు. ‘‘ఎన్నటికీ మీ ఖాకీ దుస్తులపై గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. పోలీసులు చేసిన మంచి పనుల కారణంగా ప్రత్యేకించి ప్రస్తుత కరోనా కాలంలో పోలీసులు ప్రదర్శించిన మానవత్వం కారణంగా ఖాకీ యూనిఫారం ప్రజల జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసుకుంది’’అని ప్రధాని కొనియాడారు. 

శిక్షణను శిక్షగా భావించొద్దు.. 
‘‘శిక్షణ అనేది శిక్షతో కూడిన పోస్టింగ్‌గా భావించే మనస్తత్వం నుంచి మీరంతా బయటపడాలి. శిక్షణకు ప్రాధాన్యమిచ్చేందుకు ‘మిషన్‌ కర్మయోగి’కి కేంద్ర కేబినెట్‌ తాజాగా ఆమోదం తెలిపింది. ఏడు దశాబ్దాల చరిత్రగల సివిల్‌ సర్వీసులో సామర్థ్యాల పెంపు పరంగా చూసినా, పనిపట్ల ప్రదర్శించే వైఖరిపరంగా చూసినా ఇది ఒక పెద్ద సంస్కరణ. ప్రతిభను గుర్తించడంలో, ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వడంలో మిషన్‌ కర్మయోగి సాయపడుతుంది. దీంతో సరైన పాత్రలో సరైన వ్యక్తిని నియమించడం సాధ్యమవుతుంది’’అని మోదీ చెప్పారు. గత కొన్నేళ్లలో విపత్తు సంభవించిన సమయాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది శ్రమించిన తీరు పోలీసు సేవకు కొత్త గుర్తింపును తీసుకొచ్చిందని ప్రధాని ప్రశంసించారు. 

మీరంతా యువతలో స్ఫూర్తి నింపగలరు: అమిత్‌ షా 
ఐపీఎస్‌ ప్రొబేషనరీ అధికారుల చిత్తశుద్ధి యువతరం మరింతగా ఐపీఎస్‌ బాట పట్టేలా చేయడంలో స్ఫూర్తినింపుతుందని విశ్వసిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. దేశ భద్రత, సమగ్రతలను కాపాడటంలో రాజీపడొద్దని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ సూచించారు. ప్రొబేషనరీ అధికారులంతా ప్రధాని నిర్దేశించినట్లు స్మార్ట్‌ పోలీస్‌ విజన్‌ లక్ష్యా  లను చేరుకొని ముందుకు సాగాలన్నారు.

ఆల్‌రౌండర్‌ ప్రొబేషనర్‌గా కిరణ్‌ శ్రుతి.. 
పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో 71 ఆర్‌ఆర్‌ (2018) బ్యాచ్‌ నుంచి 121 మంది ప్రొబేషనరీ అధికారులు, 70 ఆర్‌ఆర్‌ (2017) బ్యాచ్‌ నుంచి మరో 10 మంది ప్రొబేషనరీ అధికారులు పాల్గొన్నారు. శిక్షణలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ప్రొబేషనరీ అధికారులకు జాతీయ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అతుల్‌ కార్వా ల్‌ ట్రోఫీలను బహూకరించారు. 2018 బ్యాచ్‌ ఆల్‌రౌండర్‌ ప్రొబేషనరీ అధికారిగా నిలిచిన డి.వి. కిరణ్‌ శ్రుతి పరేడ్‌కు నాయకత్వం వహించారు. కరోనా నేపథ్యంలో ఈసారి ట్రైనీ అధికారుల కుటుంబ సభ్యులు, అతిథులు, మీడియాను లోపలకు అనుమతించలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement