మన జాబిల్లిపై నీరుందట! అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ... నాసా చెబుతోంది! చంద్రయాన్–1 ప్రయోగంతో మనం ఎప్పుడో చెప్పేశాం కదా...నాసా కొత్తగా తేల్చిందేమిటి? అన్నదేనా మీ ప్రశ్న? చందమామ ఉపరితలంపై, నేల అడుగున...నీరు ఉండేందుకు అవకాశముందని చంద్రయాన్–1 చెబితే...ఇదే విషయాన్ని నాసా తాజాగా నిర్ధారించింది. ఓస్ అంతేనా అంటారా? ఊహూ.. తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది!
సాక్షి, హైదరాబాద్: భూమి సహజ ఉపగ్రహం జాబిల్లిపై నీటి ఛాయల కోసం దశాబ్దాలపాటు ప్రయోగాలు జరిగాయి. కానీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2008లో ప్రయోగించిన చంద్రయాన్–1తో చందమామ ఉపరితలంపై, నేల అడుగున కూడా నీరు ఉండే అవకాశముందని స్పష్టమైంది. కానీ ఏ రూపంలో? ఎక్కడ? ఎంత? అన్న ప్రశ్నలకు అప్పట్లో సమాధానాలు దొరకలేదు. ఈ లోటును నాసాకు చెందిన సోఫియా టెలిస్కోపు పూర్తి చేసింది. స్ట్రాటోస్ఫెరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రారెడ్ అస్ట్రానమీ.. క్లుప్తంగా సోఫియా అని పిలిచే ఈ టెలిస్కోపు భూమికి 40 వేల అడుగుల ఎత్తులో పరారుణ కాంతి ద్వారా విశ్వాన్ని పరిశీలిస్తుంది. నక్షత్రాల జననం, మరణం మొదలుకొని అంతరిక్షంలో సంక్లిష్టమైన అణువులను గుర్తించేందుకు దీన్ని వాడుతుంటారు. (చదవండి: నాసా- నోకియా డీల్: చంద్రుడిపై 4జీ నెట్‌వర్క్)
ఇదే క్రమంలో సోఫియా జాబిల్లిపై కూడా కొన్ని పరిశీలనలు చేసింది. ఆ సమాచారం ఆధారంగా జాబిల్లిపై సూర్యుడి వెలుతురు పడే ప్రాంతాల్లోనూ పెద్ద మొత్తంలో నీటి నిల్వలు ఉన్నాయని నిర్ధారణ అయ్యింది. నేచర్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన రెండు పరిశోధన వ్యాసాలు ఈ అంశానికి సంబంధించిన వివరాలను తెలిపాయి. సోఫియా సేకరించిన సమాచారం ఆధారంగా ద్రవ రూపంలో ఉండే నీటి తాలూకూ ప్రత్యేక గుర్తులను చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద తాము గుర్తించామని, ప్రతి ఘనపు అడుగు జాబిల్లి మట్టిలో సుమారు 12 ఔన్స్‌ల నీరు ఉన్నట్లు తెలిసిందని నాసా శాస్త్రవేత్త కేసీ హానిబల్ నిర్వహించిన పరిశోధన తెలిపింది.
అయితే మట్టిలో కలిసిపోయిన ఈ నీటిని వెలికితీయడం కష్టసాధ్యమైన విషయమని స్పష్టం చేసింది. రెండో పరిశోధన ప్రకారం జాబిల్లి మొత్తమ్మీద కోటానుకోట్ల సూక్ష్మస్థాయి గుంతలు ఉన్నాయి. వీటి నీడలు పరుచుకున్న చోట్ల నీరు ఉండేంత చల్లదనం ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే ఇక్కడ ఘనీభవించిన మంచు రూపంలో నీరు ఉంటుందన్నమాట. భవిష్యత్తులో జాబిల్లిపైకి చేరే వ్యోమగాములు ఈ ప్రాంతాల నుంచి సులువుగా నీటిని సేకరించగలరు.
ప్రయోజనాలేమిటి?
జాబిల్లిపై సులువుగా సేకరించగలిగేలా నీరు ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నాసా ఇంకో పదేళ్లలో అక్కడ శాశ్వత స్థావరం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడు వ్యోమగాముల కోసం ఇక్కడి నుంచి నీరు మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా రాకెట్ల బరువు, తద్వారా ప్రయోగ ఖర్చులూ గణనీయంగా తగ్గుతాయి. నాసా 2024లో తన ఆర్టిమిస్ ప్రాజెక్టులో భాగంగా జాబిల్లిపైకి తొలి మహిళను, మరోసారి పురుష వ్యోమగామిని పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగం ద్వారా చందమామపైకి చేరే వ్యోమగాములు నీటి ఉనికిని, లభ్యతను ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్ధారించుకోగలిగితే జాబిల్లిపై మనిషి శాశ్వత నివాసం ఏర్పరచుకునే దిశగా మలి అడుగు పడినట్లే!
జంబోజెట్ విమానంలో దుర్భిణి
నాసాకు చెందిన సోఫియా టెలిస్కోపు ఇతర దుర్భిణుల కంటే చాలా భిన్నమైంది. ఎందుకంటే నాసా, జర్మనీకి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ డీఎల్‌ఆర్‌లు కలిసి దీన్ని ఓ విమానంలో ఏర్పాటు చేశాయి. ఇది నలభై ఏళ్ల పురాతనమైన బోయింగ్ 747 జంబోజెట్. కాకపోతే ఇందులో ప్రయాణికుల సీట్లు వగైరా సామగ్రి మొత్తాన్ని తొలగించి.. పైకప్పుపై పదహారు అడుగుల వెడల్పు, 23 అడుగుల పొడవైన తలుపు ఒకదాన్ని ఏర్పాటు చేశారు. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో ఈ తలుపు తెరుచుకుంటుంది.
అప్పుడు విమానం లోపల సుమారు 8.2 అడుగుల వ్యాసార్ధమున్న దుర్భిణి విశ్వాన్ని చూడటం మొదలుపెడుతుందన్నమాట. భూమికి 40 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల అక్కడ నీటి ఆవిరి కూడా ఉండదు. ఫలితంగా ఖగోళాన్ని ఏ రకమైన అడ్డంకులూ లేకుండా చూడవచ్చునన్నమాట. విశ్వగవాక్షంగా చెప్పుకునే హబుల్ టెలిస్కోపుతో సమానమైన సామర్థ్యమున్న సోఫియా పరారుణ కాంతిలో విశ్వాన్ని పరిశీలించగలదు. హబుల్ దృశ్య, అతినీలలోహిత కాంతుల్లో పరిశీలనలు జరపగలదు.
Comments
Please login to add a commentAdd a comment