ప్రకృతి నుంచి లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు | Nature Has Inspired Manufacture of Important Medicines | Sakshi
Sakshi News home page

ప్రకృతే పరమౌషధం.. ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు

Published Mon, Sep 27 2021 8:32 AM | Last Updated on Mon, Sep 27 2021 8:32 AM

Nature Has Inspired Manufacture of Important Medicines - Sakshi

ఎన్నో రకాల బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని కాపాడిన మందు పెన్సిలిన్‌.. దాని తయారీకి మూలం ఓ ఫంగస్‌.. ఇప్పుడు కరోనా టెస్టుల కోసం వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్‌ విధానంలో వాడేది ఓ బ్యాక్టీరియా.. ఇవే కాదు.. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినదీ ప్రకృతే. అత్యంత ముఖ్యమైన ఔషధాల తయారీకి స్ఫూర్తినిచ్చినదీ ప్రకృతే.. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మందులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా..     

జంతువులు, మొక్కల నుంచి.. 
వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్లగానీ, మన జీవనశైలి వల్లగానీ ఎన్నో రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటికి ఉపశమనం కోసం ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలతో మందులు తయారు చేస్తుంటారు. ఒక్కోసారి కొన్నిరకాల జంతువులు, చెట్లలోని రసాయనాల సమ్మేళనాలు నేరుగా రోగాలు, ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగానో, అనుకోకుండానో అలాంటి వాటిని గుర్తించి.. మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. 

మధుమేహానికి మందు ఇచ్చి.. 
గిలా మాన్‌స్టర్‌.. నలుపు, నారింజ రంగుల్లో ఉండే ఒక రకమైన పెద్దసైజు బల్లి. అమెరికా, మెక్సికో దేశాల్లో ఉండే ఈ బల్లి లాలాజలంలో ఎక్సెండిన్‌–4 అనే హార్మోన్‌ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్‌–2 మధుమేహం చికిత్సలో వాడుతున్న ఎక్సెనటైడ్‌ ఔషధానికి మూలం ఆ హార్మోనే. టైప్‌–2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి, పేషెంట్లు బరువు తగ్గడానికి ఈ హార్మోన్‌ తోడ్పడుతుందని నార్త్‌ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు 2007లో గుర్తించారు. దానిని ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. 

కరోనాను గుర్తిస్తున్నది ఇదే.. 
థర్మస్‌ అక్వాటికస్‌ బ్యాక్టీరియా.. 1969లో అమెరికాలోని ప్రఖ్యాత ఎల్లోస్టోన్‌ నేషనల్‌ పార్క్‌లో దీనిని గుర్తించారు. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ప్రొటీన్ల పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్‌ టెస్టులో ఉపయోగించినప్పుడు.. సంబంధిత వైరస్‌ల ప్రొటీన్లను గుర్తించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం.. ఇండియా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, టర్కీ ఈ ఐదు దేశాల్లోనే ఏడాది మే చివరినాటికి ఏకంగా 100 కోట్ల కరోనా టెస్టులు చేశారు. 

ఫంగస్‌పై పోరు నుంచి.. కేన్సర్‌ చికిత్సకు.. 
పాక్లిటాక్సెల్‌.. కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన ఔషధం. పసిఫిక్‌ యూ అనే చెట్టు బెరడులో లభించే ఈ రసాయన మిశ్రమాన్ని 1971లోనే గుర్తించారు. అది కేన్సర్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని 2015లో జరిగిన పరిశోధనల్లో తేల్చారు. దాదాపు అన్నిరకాల కేన్సర్లకు చేసే కెమోథెరపీ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన అత్యవసర మందుల జాబితాలో ఈ పాక్లిటాక్సెల్‌ ఔషధం కూడా ఉండటం గమనార్హం. నిజానికి పసిఫిక్‌ యూ చెట్లు ఈ రసాయన సమ్మేళనాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తాయో తెలుసా.. తమపై ఫంగస్‌లు పెరిగి తెగుళ్లు కలిగించకుండా ఉండటం కోసమే. వాటి ఇమ్యూనిటీ మనకు ఔషధంగా మారింది. 

సూక్ష్మజీవులను నాశనం చేసే కప్ప 
మాగేనిన్‌.. ఆఫ్రికన్‌ క్లాడ్‌ రకం కప్ప చర్మంలో ఉండే ఓ ప్రత్యేకమైన ప్రొటీన్‌. చాలా రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. కొన్నేళ్ల కింద ఆ కప్పలపై పరిశోధనలు చేస్తున్న కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వాటి శరీరంపై గాయాలైనా ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకడం లేదని గుర్తించారు. దానికి కారణం ఏమిటని పరిశోధించి ‘మాగేనిన్‌’ ప్రొటీన్‌ను గుర్తించారు. ఇది సూక్ష్మజీవుల పైపొరను ధ్వంసం చేస్తోందని తేల్చారు. అయితే ఈ ప్రొటీన్‌ను మానవ వినియోగానికి అనుగుణంగా మార్చడం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు.

మరెన్నో మందులు.. 
జ్వరం, నొప్పులతోపాటు మరెన్నో అనారోగ్య లక్షణాలకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్‌ అనే మందు విల్లో చెట్ల బెరడు, ఆకుల్లో ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలు దానిని వాడుతూ వచ్చారు. 1850వ దశకంలో ఆస్పిరిన్‌ను కృత్రిమంగా తయారుచేశారు. 
మలేరియాకు మందుగా వినియోగించే క్వినైన్‌ అనే ఔషధం సింకోనా చెట్ల బెరడు నుంచి వస్తుంది. వందల ఏళ్లుగా దాన్ని వినియోగిస్తున్నారు. 1940వ దశకంలో శాస్త్రవేత్తలు క్వినైన్‌ను కృత్రిమంగా తయారు చేశారు. 
రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్‌’ను పలు రకాల ఫంగస్‌ల నుంచి విడుదలయ్యే రసాయనాల నుంచి అభివృద్ధి చేశారు. 

లక్షల కోట్ల విలువ! 
మనం పండించే, పెంచే చెట్లు, జంతువులు వంటివి కాకుండా.. సహజ ప్రకృతి నుంచి మనం ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వాడేసుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) అంచనాల ప్రకారం.. భూమ్మీద ఉన్న ప్రకృతిని రూపాయల్లో లెక్కిస్తే.. 92.5 కోట్ల కోట్లు (125 ట్రిలియన్‌ డాలర్లు) విలువ ఉంటుంది. ప్రకృతిని సంరక్షించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఏటా రూ.35.4 లక్షల కోట్లు (479 బిలియన్‌ డాలర్లు) నష్టపోతున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ హెచ్చరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement