Telangana: నీట్‌ టాప్‌ ర్యాంకర్‌ మనోడే... | NEET Result 2021 Declared Hyderabad Mrinal Get AIR 1 With Full Marks | Sakshi
Sakshi News home page

Telangana: నీట్‌ టాప్‌ ర్యాంకర్‌ మనోడే...

Published Tue, Nov 2 2021 2:22 AM | Last Updated on Tue, Nov 2 2021 8:33 AM

NEET Result 2021 Declared Hyderabad Mrinal Get AIR 1 With Full Marks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌–2021 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. తెలంగాణకు చెందిన మృణాల్‌ కుట్టేరి వంద శాతం మార్కులతో టాప్‌ ర్యాంక్‌ సాధించాడు. ఇతనితో పాటు ఢిల్లీకి చెందిన తన్మయ్‌ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్‌ కూడా 720 మార్కులకు గాను, 720 మార్కులతో టాప్‌ ర్యాంక్‌ సాధించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. తెలంగాణ విద్యార్థికి నీట్‌లో టాప్‌ ర్యాంక్‌ దక్కడం ఇదే మొదటిసారి. కాగా తెలంగాణకే చెందిన ఖండవల్లి శశాంక్‌ ఐదో ర్యాంకు సాధించాడు.

ఇతనికి 715 మార్కులు వచ్చాయి. ఇలా దేశవ్యాప్తంగా టాప్‌ 20 ర్యాంకుల్లో ఇద్దరు తెలంగాణకు చెందిన బాలురు ఉండగా.. బాలికల టాప్‌ 20లో రాష్ట్రానికి చెందిన కాస లహరి (దేశవ్యాప్త ర్యాంకు 30), ఈమణి శ్రీనిజ (38), దాసిక శ్రీ నీహారిక (56), పసుపునూరి శరణ్య (60) ఉన్నారు. తెలంగాణకు చెందిన సీహెచ్‌ వైష్ణవి ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో టాప్‌ 10లో నిలిచింది. ఈమె 143వ ఆల్‌ ఇండియా ర్యాంకు సా«ధించారు. ఎస్సీ కేటగిరీలో టాప్‌ 10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన మీస రోహిణ్‌ ప్రభు  (451 ర్యాంకు) చోటు సంపాదించాడు. ఎస్టీ కేటగిరీలోని టాప్‌ 10 ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన కేతవంత్‌ విజయ్‌చందర్‌ ఉన్నాడు. అతనికి జాతీయంగా 3,965 ర్యాంకు వచ్చింది. టాప్‌ ర్యాంక్‌ సాధించిన ముగ్గురికి కౌన్సిలింగ్‌ సమయంలో టై–బ్రేకింగ్‌ ఫార్ములాను అనుసరిస్తామని ఎన్‌టీఏ పేర్కొంది.  విద్యార్థులు తమ ఫలితాలను  neet.nta.nic.in/ntaresults.nic.in వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. 

ఈసారి తగ్గిన కటాఫ్‌ మార్కులు 
    గతేడాది నీట్‌ కట్‌ ఆఫ్‌ 147 మార్కులుగా ఉంది. ఇప్పుడు అది 138కు తగ్గింది. గతేడాది కంటే కఠినంగా పేపర్‌ ఉండటం వల్లే కట్‌ ఆఫ్‌ తగ్గింది. 720కి 700 మార్కులు వచ్చినవాళ్లు గతేడాది 100 మంది ఉంటే, ఈసారి 200 మంది వరకు ఉన్నారు. 640 మార్కులు ఆపై వచ్చినవారు గతేడాది ఈసారి కూడా ఒకేరకంగా ఉన్నారు. ఆ విధంగా మార్కులు సాధించినవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. గతేడాది మొత్తం 180 ప్రశ్నలకు 180 రాయాల్సి ఉండగా, ఈసారి 200 ప్రశ్నలుంటే 180 మాత్రమే రాయాలి. ఇలా ఛాయిస్‌తో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ ఏడాది రెండు నెలలు మాత్రమే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. ఈ కారణంగా చాలామంది నష్టపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

8,70,074 మందికి అర్హత 
    సెప్టెంబర్‌ 12న దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష నిర్వహించారు. తెలంగాణలో పలు నగరాల్లోని 112 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 55 వేల మంది దరఖాస్తు చేయగా, 97 శాతం మంది హాజరయ్యారు. చాలా రోజులకుగానీ ఫలితాలు విడుదల చేయలేదు.   
– దేశవ్యాప్తంగా 16,14,777 మంది నీట్‌ పరీక్ష కోసం రిజిస్టర్‌ చేసుకున్నారు. 15,44,275 మంది హాజరయ్యారు.  
– అందులో బాలురు 7,10,979... బాలికలు 9,03,782 మంది ఉన్నారు. 
– మొత్తం పరీక్ష రాసినవారిలో ఓబీసీ కేటగిరీ వారు 42.97 శాతం మంది ఉన్నారు.  
– 202 పట్టణాలు, నగరాల్లో 3,858 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.  
– 8,70,074 మంది అర్హత సాధించారు. అందులో 4,94,806 మంది బాలికలు, 3,75,260 మంది బాలురు ఉన్నారు. 8 మంది ఇతరులు ఉన్నారు. అర్హత సాధించినవారిలో ఎక్కువగా ఓబీసీ కేటగిరీలో 3,96,772 మంది ఉన్నారు. ముందుగా విద్యార్థుల ఈ మెయిల్స్‌కు ఫలితాల సమాచారం పంపించారు.  

15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సిలింగ్‌ 
    నీట్‌ పరీక్షలో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.  
– నీట్‌ ద్వారా  అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నింటిలోనూ ఈ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ఎయిమ్స్, పాండిచ్చేలోని జిప్‌మర్‌ మినహా అన్నింటిలో ఎంబీబీఎస్‌ సీట్లను నీట్‌ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తారు.  
– దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్‌ పూల్‌లోకి తీసుకున్నారు. వాటన్నింటినీ అఖిల భారత కౌన్సిలింగ్‌లో భర్తీ చేస్తారు. నీట్‌ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్‌ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు.  
– నీట్‌ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్‌ జాబితాను ’మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌’ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌తో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రూపొందిస్తాయి. నీట్‌ మెడికల్‌ మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగానే ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎంసీసీ.ఎన్‌ఐసీ.ఇన్‌’ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్‌టీఏ విజ్ఞప్తి చేసింది.  
 
– ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీచేస్తాయి. అందుకోసం రాష్ట్రస్థాయి నీట్‌ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు.  
– నీట్‌ స్కోర్‌ కార్డ్‌లో వ్యక్తిగత వివరాలు, సబ్జెక్ట్‌ వారీగా మొత్తం మార్కులు, పర్సంటైల్‌ స్కోర్లు, ఆలిండియా ర్యాంక్, అర్హత స్థితి ఉంటాయి. దాంతోపాటు నీట్‌ కట్‌–ఆఫ్‌ స్కోర్లు కూడా ప్రకటిస్తారు. మెడికల్‌ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడానికి తప్పనిసరిగా కనీస నీట్‌ కట్‌–ఆఫ్‌ మార్కులను పొందాలి. 
– నీట్‌ ఫలితాలను ప్రకటించిన తర్వాత, కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటిస్తారు. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) తరపున డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) ఆలిండియా కోటా, ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ), డీమ్డ్‌/సెంట్రల్‌ యూనివర్శిటీల సీట్ల కోసం ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.  
– కటాఫ్, అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా ఆలిండియా మెరిట్‌ జాబితాను సిద్ధం చేస్తారు. కట్‌–ఆఫ్‌ కంటే ఎక్కువ స్కోర్‌ చేసిన వారు ఆలిండియా కోటా కౌన్సెలింగ్‌లో 15 శాతం సీట్లకు అర్హులు అవుతారు. 15 శాతాన్ని ఆలిండియా కోటా నీట్‌ ర్యాంక్‌ ఆధారంగా మాత్రమే భర్తీ చేస్తారు. 85 శాతానికి ప్రవేశం కోసం, రాష్ట్రాలు వ్యక్తిగత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాయి. 
– దేశవ్యాప్తంగా  
ఎంబీబీఎస్‌ సీట్లు– 83,075 
బీడీఎస్‌ సీట్లు – 26,949 
ఆయుష్‌ సీట్లు– 52,720  

నీట్‌ పరీక్షలో పర్సంటైల్, కట్‌ ఆఫ్‌ మార్కు ప్రకారం అర్హులైనవారు 
  
కేటగిరీ                             పర్సంటైల్‌    కట్‌ ఆఫ్‌ మార్కు    అర్హులైన విద్యార్థులు 
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 
జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌                  50                720–138        7,70,857 
ఓబీసీ                                         40                 137–108        66,978 
ఎస్సీ                                          40                 137–108        22,384 
ఎస్టీ                                            40                 137–108        9,312 
    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement