ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ‘మహా’ టెన్షన్‌!! | New Corona Variant Omicron Cases Rise In Maharashtra | Sakshi
Sakshi News home page

ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ‘మహా’ టెన్షన్‌!!

Published Sat, Dec 18 2021 7:42 AM | Last Updated on Sat, Dec 18 2021 1:54 PM

New Corona Variant Omicron Cases Rise In Maharashtra - Sakshi

ఇచ్చోడ: జిల్లా ప్రజలను ‘మహా’ టెన్షన్‌ వెంటాడుతోంది. జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో నమోదైన కేసుల్లో 50 శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర నుంచి జిల్లాకు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో కొత్త వేరియంట్‌ ఎప్పుడైనా జిల్లాలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దులో కట్టడికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

మహారాష్ట్రలోని నాగపూర్, పుణె, ముంబయి లాంటి మహానగరల్లో ఇప్పటికే ఒమిక్రాన్‌  కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లాకు నాగ్‌పూర్‌ పట్టణం 200 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. నాగ్‌పూర్‌లో ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉండటం, విదేశాల నుంచి రాకపోకాలు సాగుతుండటం అక్కడి నుంచి జిల్లాకు నిత్యం వ్యాపార నిమిత్తం వేలాది మంది బస్సుల్లో ఇతర ప్రైవేటు వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు.

డెల్టా వేరియంట్‌ కంటే పది రెట్ల వేగంతో ఒమిక్రాన్‌ వ్యాప్తిచెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండడం, వార్తలు వస్తుడడంతో మహారాష్ట్ర నుంచి రాకపోకలను నియంత్రించకపోతే జిల్లాలోకి కొత్త వేరియంట్‌ అడుగు పెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డెల్టా వేరియంట్‌ కూడా మహారాష్ట్ర నుంచి రాకపోకలతోనే జిల్లాలో విస్తరించిందని పేర్కొంటున్నారు.  

రైళ్లలో రద్దీ.. 
ఇటీవలే రైల్వే శాఖ పలు రైళ్లను పునరుద్ధరించింది. మహారాష్ట్ర రైళ్లు నిత్యం జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ముంబాయి, నాగ్‌పూర్‌కు ఆదిలాబాద్‌ మీదుగా రైళ్లు వెళ్తుంటాయి. బస్సు ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుండడం, చార్జీలు ఎక్కువగా ఉండడంతో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య పెరిగింది. నిత్యం రైళ్లు రద్దీగానే వస్తున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్‌ నుంచి నాగ్‌పూర్, నాందేడ్, చంద్రాపూర్, యావత్మాల్, గడ్చిరోలి, అకోల లాంటి పట్టణలకు, అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు బస్సులు తిరుగుతుంటాయి. రైళ్లలో, బస్సుల్లో భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు కూడా చాలామంది ధరించడం లేదు.  

జిల్లా చుట్టూ మహారాష్ట్ర సరిహద్దులు...
జిల్లా చుట్టూ మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నా యి. ఈ సరిహద్దుల మీదుగా జిల్లాకు నిత్యం వేల మంది వ్యాపారం, వివిధ పనులు నిమి త్తం జిల్లాకు వచ్చిపోతుంటారు. మహారాష్ట్రను ఆనుకుని జిల్లాలోని బోథ్, బజార్‌హత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్, నార్నూర్, బేల, జైనాథ్‌ మండలాలు ఉన్నాయి. బోథ్‌ మండలం ఘన్‌పూర్‌కు మహారాష్ట్రలోని నాందేడ్‌ సరిహద్దు ఉంది. బేల మండలానికి చంద్రపూర్‌ జిల్లా సరిహద్దుగా ఉంది. తలమడుగు మండలం లక్ష్మీపూర్‌కు మహుర్‌ సరిహద్దు ఉంది. మహుర్‌ నుంచి యావత్మాల్, పర్బనీ జిల్లాలకు రాకపోకాలు సాగుతాయి. మహారాష్ట్రలోని గడ్చిరొలి జిల్లా నార్నూర్‌ మండలానికి పొరుగునే ఉంది. జిల్లాలో పలు మండలాలు మహారాష్ట్రను ఆనుకునే ఉండడంతో అక్కడి నుంచి వచ్చేవారిలో ఎవరికైనా ఒమిక్రాన్‌ సోకి ఉంటే వారి ద్వారా వైరస్‌ జిల్లా వాసులకు సోకుతుందని పలువురు పేర్కొంటున్నారు.  

అప్రమత్తం కాకుంటే ముప్పే..
ముందస్తుగా మహారాష్ట్ర సరిహద్దులు ఉన్న గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌తోపాటు రెండు డోసుల టీకా వేసుకున్నవారిని మాత్రమే జిల్లాలోకి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ కూడా చేయాలని కోరుతున్నారు. రాక పోకలు సాగిస్తున్న వారికి పరీక్షలు నిర్వహించి వివరాలు నమోదు చేయడం ద్వారా ముప్పును నియంత్రించవచ్చని అంటున్నారు. మరోవైపు వైద్యాధికారులు కూడా ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంటున్నారు. బయటకు వెళ్లేవారు, ప్రయాణాలు చేసేవారు తరచుగా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలంటున్నారు.  

మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి
ఒమిక్రాన్‌ వైరస్‌ ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో ప్రజలు ముందుస్తు జాగత్రలు పాటించాలి. మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కులు ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారు వెంటనే టీకాలు తీసుకోవాలి. మొదటి టీకాను తీసుకున్నావారు గడువులోగా రెండో డోస్‌ తీసుకోవాలి. స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష. 
– రాథోడ్‌ నరేందర్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement