సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేపట్టిన మణుగూరు – రామగుండం రైల్వేలైను నిర్మాణంలో కీలక అడుగు పడింది. దీంతో రాబోయే బడ్జెట్‌లో ఈ లైనుకు నిధులు మంజూరు కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
చదవండి: కేసీఆర్ ఆదిపురుష్: ఆర్జీవీ సంచలన ట్వీట్
చాన్నాళ్లుగా..
బొగ్గు, విద్యుదుత్పత్తి కేంద్రాలుగా ఉన్న మణుగూరు, రామగుండం మధ్య కొత్తగా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని రెండు దశాబ్దాల కిందట లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా సర్వే నిర్వహించారు. ఆ తర్వాత కూడా అనేక మార్లు సర్వేలు జరిగాయి. ఇరవై ఏళ్లుగా సర్వేలు తప్ప లైన్ విషయంలో మరే పురోగతి కనిపించలేదు. భద్రాచలం రోడ్డు – కొవ్వూరు రైల్వే లైన్ తరహాలోనే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకే పరిమితమవుతుందనే సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు కదలిక వచ్చింది
భూసామర్థ్య పరీక్షలు
ఇటీవల సరుకు రవాణాకు రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. త్వరగా సరుకు రవాణా కోసం ప్రత్యేక ట్రాక్‌లను సైతం నిర్మిస్తోంది. దీంతో పాటు ట్రిపుల్ ఆర్(రివర్, రైల్, రోడ్డు) కాన్సెప్‌్టతో సరుకు రవాణాకు గల అవకాశాలను పరిశీలిస్తోంది. ఇటు మణుగూరు, అటు రామగుండం రెండు పట్టణాలు గోదావరి నదీ తీరంలో ఉన్నాయి. ఈ రెండు పట్టణాల మధ్య రోడ్డు మార్గం ఉంది. ఇప్పుడు అదనంగా రైలు మార్గం నిర్మాణంపై కేంద్రం దృష్టి సారించి, ఇప్పటికే సర్వే పూర్తయినందున రైలు మార్గం నిర్మాణానికి రెడీ అవుతోంది. అందులో భాగంగా రైలు మార్గం వెళ్లే ప్రాంతాల్లో భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ములుగు జిల్లాలో పలు ప్రాంతాల్లో మట్టి నమూనా పరీక్షలు జరుగుతున్నాయి.
ప్రయోజనాలు
ప్రస్తుతం రామగుండం – కాజీపేట – డోర్నకల్ – భద్రాచలంరోడ్డు – మణుగూరు మార్గం 291 కి.మీ. నిడివితో ఉంది. కొత్త మార్గం అందుబాటులోకి వస్తే దాదాపు వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అదే విధంగా భూపాలపల్లిలో ఉన్న సింగరేణి బొగ్గుగనులు, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్లకు రైలుమార్గం అందుబాటులోకి వస్తుంది. న్యూఢిల్లీ – చెన్నై గ్రాండ్‌ట్రంక్ లైన్‌లో నాగ్‌పూర్ – విజయవాడ సెక్షన్‌లో కీలక ప్రత్యామ్నాయ మార్గంగా ఈ లైన్ నిలవనుంది.
రైలు మార్గం ఇలా
మణుగూరు – రామగుండం కొత్త మార్గానికి సంబంధించి రామగుండం దగ్గర ఉన్న రాఘవాపురం రైల్వే స్టేషన్ నుంచి ఈ లైన్ ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి మంథని – భూపాలపల్లి – మేడారం – తాడ్వాయి – కాటాపూర్ – గోపాలపురం – రామనుజపురం మీదుగా మణుగూరుకు చేరుకుంటుంది. మొత్తంగా రాఘవాపురం నుంచి మణుగూరు వరకు 197 కి.మీ నిడివితో ఈ మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. చివరి సారిగా చేసిన సర్వేలో ఈ లైన్ నిర్మాణానికి రూ. 3,000 కోట్లు ఖర్చు కావొచ్చని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment