
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేయడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఆయన త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘బీజేపీ ముక్త్ భారత్’కోసం కలిసికట్టుగా ఉద్యమించడమే లక్ష్యంగా నితీశ్ ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
తన ప్రణాళికను వారికి వివరించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే విపక్ష నేతల సమావేశాన్ని బిహార్‌లో నిర్వహించేందుకు నితీశ్ సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీ తర్వాత జరిగే ఈ భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలతోపాటు ప్రాంతీయ పార్టీల నాయకులను ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సైతం ఆహ్వానించబోతున్నట్లు సమాచారం.
బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా
నితీశ్‌కుమార్ తన సొంత రాష్ట్రం బిహార్‌లో బీజేపీతో బంధాన్ని తెంచుకొని, ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారు. మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలపై నిరసన గళం వినిపిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతామని ఇప్పటికే ప్రతిజ్ఞ చేశారు. మోదీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడేలా వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు సాగిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తోపాటు కమ్యూనిస్ట్ పార్టీల అగ్రనేతలతో వరుసగా భేటీలు నిర్వహించారు. విపక్షాలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఇతర పార్టీల నాయకులను సైతం కలుస్తానని ప్రకటించారు.
నితీశ్‌కు మమతా బెనర్జీ ఓ ప్రతిపాదన చేశారు. 1974లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సోషలిస్ట్ నేత జయప్రకాష్ నారాయణ్ బిహార్ నుంచి ఉద్యమం లేవనెత్తారని, ఇప్పుడు బీజేపీపై పోరాటానికి బిహార్ నుంచే నాంది పలకాలని కోరారు. బిహార్‌లో విపక్ష నేతల సమావేశం నిర్వహించి, కార్యాచరణ సిద్ధం చేద్దామని సూచించారు.
ఈ నేపథ్యంలో బిహార్‌లో విపక్షాల భేటీని వచ్చే నెల రెండో వారంలో నిర్వహించే అవకాశాలున్నాయని జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్ ప్రకటించారు. విపక్షాల సమావేశం పట్ల కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించింది.
బీఆర్‌ఎస్ అండగా నిలుస్తుందని..
బీజేపీపై పోరులో బీఆర్‌ఎస్‌ని కలుపుకొని వెళ్తామని జేడీ(యూ) నేతలు సంకేతాలిచ్చారు. విపక్షాలను కూడగట్టే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లను సంప్రదించే అవకాశం ఉందని జేడీ(యూ) అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. వచ్చే నెలలో విపక్షాల భేటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అంతకంటే ముందే ఢిల్లీలో కేసీఆర్‌తో నితీశ్ భేటీ ఉండొచ్చని తెలుస్తోంది.
అదానీ వివాదం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రాహుల్‌పై అనర్హత వేటు వంటి అంశాలపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసనల్లో బీఆర్‌ఎస్ కూడా పాల్గొందని ఆర్జేడీ నేత ఒకరు గుర్తుచేశారు. ఇకపై బీజేపీపై జరిగే పోరాటంలో బీఆర్‌ఎస్ సైతం విపక్షాలతో కలిసి నడుస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. నితీశ్ ఏర్పా టు చేసే భేటీకి బీఆర్‌ఎస్ హాజరవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment