సాక్షి ,నాగిరెడ్డిపేట: ఆపత్కాలంలో కుయ్ కుయ్‌మంటూ వచ్చి ఆదుకోవాల్సిన అంబులెన్స్‌లు జిల్లాలో అంతంతమాత్రంగానే సేవలందిస్తున్నాయి. ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్స్ అవసరం ఉండగా ప్రస్తుతం జిల్లాలోని చాలా మండలాల్లో అంబులెన్స్‌లే లేవు. జిల్లాలో 22 మండలాలుండగా 13 అంబులెన్స్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో ఆస్పత్రులకు చేర్చలేకపోతున్నారు. దీంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
పది మండలాల్లో ఇబ్బందులు..
జిల్లాలోని బాన్సువాడలో రెండు, కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూర్, సదాశివనగర్, గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి, పిట్లం, బిచ్కుంద, జుక్కల్, బీర్కూర్ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, దోమకొండ, రామారెడ్డి, రాజంపేట, నస్రుల్లాబాద్, పెద్దకొడప్‌గల్, మద్నూర్, తాడ్వాయి, బీబీపేట మండలాల్లో 108 అంబులెన్స్‌లు లేవు. ఆయా మండలాల్లో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే, అత్యవసరంగా ఎవరినైనా ఆస్పత్రికి తరలించాల్సి వస్తే పక్క మండలాల్లోని అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. పొరుగు మండలంనుంచి అంబులెన్స్ వచ్చేంత వరకు బాధితులు నరక యాతన అనుభవించాల్సిందే.. అంతేకాకుండా ఆ సమయంలో పక్క మండలం అంబులెన్స్ వేరే ఇతర రోగులను తరలించే పనిలో ఉంటే ఇక్కడున్న వారి పరిస్థితి మరీ దారుణం. దీంతో అంబులెన్స్‌లు లేనిప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను దాదాపు ప్రైవేట్ వాహనాల్లోనే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆటోలు, కార్లలో తరలించే సమయంలో క్షతగాత్రులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు.
కోవిడ్ బాధితుల వ్యథలు..
ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ వందలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. అయితే వారిని ఆస్పత్రులను తరలించడానికి అంబులెన్స్‌లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోవిడ్ సోకినవారిని ఆస్పత్రులకు తరలించడానికి ప్రైవేట్ వాహనదారులెవరూ ముందుకు రావడంలేదు. అంబులెన్స్‌లు అందుబాటులోలేక, ప్రైవేట్ వాహనదారులు ముందుకురాకపోవడం వల్ల బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రైవేట్ వాహనాల యజమానులు ముందుకు రాకపోవడం వల్ల వారిని కుటుంబ సభ్యులే తీసుకెళ్లాల్సి వస్తోంది. నాగిరెడ్డిపేట మండలంలో 108 అంబులెన్స్ లేదు. శనివారం ఓ కోవిడ్ పేషెంట్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఎల్లారెడ్డి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కానీ బిజీగా ఉండడంతో రాలేమని సమాధానం వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో కుటుంబ సభ్యులు బైక్‌పై ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం స్పందించి ప్రతి మండలానికి ఒక అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
( చదవండి: తల్లి మృతదేహాన్ని స్మశానంలోనే వదిలేసిన కొడుకు )
Comments
Please login to add a commentAdd a comment