
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నుంచి టీఎన్జీవోలను విడదీసే శక్తి ఎవరికీ లేదని, వారి మధ్య ఉన్నది పేగుబంధమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీఎన్జీవోల మద్దతు బేషరతుగా టీఆర్‌ఎస్‌కే ఉంటుందని, తెలంగాణ సాధనలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోషించిన పాత్రను సీఎం మరిచిపోలేదని పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఎన్జీవో భవన్‌లో ఉద్యోగులతో మంత్రులు గంగుల కమలాకర్, మహమూద్ అలీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించి సీఎం కేసీఆర్ వద్ద సమస్యలను గర్వంగా సాధించుకుందామన్నారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకొనే రామచంద్రారావు ఏనాడూ చట్టసభల్లో గ్రాడ్యుయేట్ల హక్కుల గురించి ప్రశ్నించలేదని పేర్కొన్నారు.
సురభి వాణీదేవి విద్యావేత్త అని, దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు గట్టెక్కించిన మేధావి పీవీ కూతురుగానే కాకుండా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లను సరైన దిశలో నడిపించి ఉపాధి చూపించిన వ్యక్తి అనే విషయం మరవొద్దని అన్నారు. పదేళ్లకోసారి పీఆర్సీని ప్రకటించే కేంద్రం కన్నా, రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగులకు ఎక్కువ మేలు చేస్తుందని గంగుల అన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను నమ్మవద్దని, టీఎన్జీవోలకు అత్యధిక లబ్ధి చేకూర్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్న విషయం గుర్తుంచుకోవాలని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment