సాక్షి, హైదరాబాద్, బంజారాహిల్స్: పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఇదే ఉత్తమ సమయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఇంటర్‌ప్రీనర్స్ ఆఫ్ ఇండియా (ఎలీప్) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ వద్ద కేటాయించిన ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (డబ్ల్యూఐటీటీసీ) కేంద్రానికి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏకకాలంలో ఐదు విప్లవాలు హరిత విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవం, పసుపు విప్లవంతో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్త్రం దేశానికి ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు. రా్రష్తంలోని అన్ని జిల్లాలు పారిశామ్రిక ప్రగతికి అత్యధికంగా వనరులున్నాయన్నారు. వీటిని పారిశ్రామికవెత్తలు అందిపుచ్చుకొని గ్రామీణ స్థాయిలో అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితేనే సమతుల్యత సాధించగలమన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటుచేసుకొని వాటిని సాధించేందుకు కృషి చేస్తే అద్భుతాలు సాధ్యమన్నారు. ఎలీప్ అధ్యక్షురాలు రమాదేవి కన్నెగంటి మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితం కేవలం 5 మంది పారిశ్రామికవేత్తలతో ప్రారంభమైన అలీప్‌లో ఇప్పుడు 10వేల మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ జి.బాలమల్లు, డబ్ల్యూఐటీటీసీ వైస్ చైర్‌పర్సన్ జ్యోతి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఎంఎస్‌ఎంఈ అడిషనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రెజ్లర్లకు న్యాయం చేయాలి: కేటీఆర్
లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీలో రెజ్లర్లు చేస్తున్న దీక్షకు రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు మద్దతు తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై విచారణ జరిపి, వారికి న్యాయం చేయాలని శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ‘ఒలంపిక్స్‌లో పతకాలు సాధించి వారు దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినప్పుడు మనం ఉత్సవాలు జరుపుకొన్నాం. ప్రస్తుతం వారు న్యాయం కోసం చేస్తున్న పోరాటానికీ సంఘీభావం తెలుపుదాం. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై నిష్పాక్షిక విచారణ జరిపి, రెజ్లర్లకు న్యాయం అందించాలి’అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
రెజ్లర్ల సమస్యను పరిష్కరించాలి: కవిత
రెజ్లర్లకు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత కూడా ట్వీట్ చేశారు. ‘అంతర్జాతీయ వేదికలపై మన అథ్లెట్లు కనపరిచిన ప్రతిభను చూసి ఉత్సవాలు చేసుకున్నాం. మన అథ్లెట్లు గ్లోబల్ ఐకాన్స్. వారు మనను ఎంతో ప్రభావితం చేస్తున్నారు. మన అథ్లెట్లు చెబుతున్న సమస్యను విని, దేశ భవిష్యత్ దృష్ట్యా వారి సమస్యను పరిష్కరించాలి’అని ఆమె శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment