
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి భవన్ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టులో పిటీషన్ పెండింగ్‌లో ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఈరోజు ఉదయం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా పీపీఈ కిట్లు ధరించి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్‌ను ముట్టడించారు. పోలీసుల కళ్లు గప్పి కార్యకర్తలు క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్బంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న ప్రభుత్వం చెయ్యాల్సిన కరోనా టెస్టుల గురించి పట్టింపు లేని ప్రభుత్వానికి విద్యార్థుల జీవితాలపై కూడా పట్టింపు లేదని మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న కూడా ప్రభుత్వం తన నిరంకుశ మొండి వైఖరితో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టే రీతిలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ నేడు ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి నిర్వహించడం జరిగిందని వెంకట్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment