సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త కరోనా వేరియంట్ ‘ఒమిక్రాన్’ కట్టడి చర్యలపై ఆందోళన వ్యక్తమవుతోంది. విదేశాల నుంచి వచ్చేవారిపై నిఘా పెట్టడం, పాజిటివ్ వచ్చినవారిని ఐసోలేషన్‌లో ఉంచడం, ఇళ్లకు పంపినవారికి తర్వాత టెస్టులు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం సరిగా వ్యవహరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 12న ‘ఒమిక్రాన్’ ముప్పులేని (రిస్క్ లేని) దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చినవారిలో కొందరికి ర్యాండమ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా.. ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతడి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్ ఉన్నట్టు 14వ తేదీన నిర్ధారణ అయింది. అయితే 15వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా అధికారులు అతడి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు.. అంటే 4 రోజులు అతడిని ఎలా వదిలేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలో చేసిన పరీక్షల్లో పాజిటివ్ వస్తున్నవారే తక్కువని, వారిని కూడా కాపలా కాయలేకపోతే ఎలాగన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ 4 రోజుల్లో సదరు వ్యక్తి నుంచి మరెంత మందికి ‘ఒమిక్రాన్’ సోకి ఉంటోందోనన్న ఆందోళన కనిపిస్తోంది.
ముప్పులేని దేశాల నుంచి వచ్చిన వారితోనూ..
ఈ నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒమిక్రాన్ ముప్పున్న దేశాల నుంచి 6,644 మంది వచ్చారు. వారిలో 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు శాంపిళ్లు పంపగా ఒకరికి ‘ఒమిక్రాన్’ ఉన్నట్టు తేలింది. ఇక ముప్పులేని దేశాల నుంచి వచ్చిన వేలాది మందిలో.. ర్యాండమ్‌గా 2% మందికే టెస్టులు చేశారు. అందులో 13 మందికి కరోనా ఉన్నట్టు గుర్తించి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఆరుగురికి ‘ఒమిక్రాన్’ ఉన్నట్టు బయటపడింది. ర్యాండమ్‌గా కొందరికి చేస్తున్న టెస్టుల్లోనే ఇలా కేసులు బయటపడుతుంటే.. ఇంకా ఎంత మంది నేరుగా జనజీవనంలోకి వచ్చేసి ఉంటారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
జాగ్రత్తలేవి?
కేంద్రం ప్రకటించిన మేరకు.. ఒమిక్రాన్ ముప్పున్న దేశాల నుంచి వచ్చే వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలి. ఫలితాలు వచ్చేవరకు విమానాశ్రయంలో ఉంచాలి. పాజిటివ్ వస్తే ఆస్పత్రికి, నెగిటివ్ వస్తే హోం ఐసోలేషన్‌కు పంపాలి. ఇక ముప్పులేని దేశాల నుంచి వచ్చేవారిలో ర్యాండమ్‌గా రెండు శాతం మందికి పరీక్షలు చేయాలని.. ఫలితం వచ్చేవరకు విమానాశ్రయంలో ఉంచాల్సిన అవసరం లేదని కేంద్ర మార్గదర్శకాలు చెప్తున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో అలాంటి వారి ఫలితం వచ్చేవరకు విమానాశ్రయాల్లోనే ఉంచుతున్నారు. మన రాష్ట్రంలో మాత్రం అలా ఉంచడం లేదు. పైగా కరోనా ఉన్నట్టు తేలాక కూడా వారిని గుర్తించి, ఐసోలేట్ చేయకపోవడం దారుణమన్న విమర్శలు వస్తున్నాయి. ఇక ముప్పున్న దేశాల నుంచి వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఎనిమిది రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలి. ఆ మేరకు జిల్లాలకు సమాచారం పంపారు. కానీ ఎంతమందికి పరీక్షలు చేశారు, వారిపై ఏమాత్రం నిఘా ఉందన్నది అధికారులు వెల్లడించడం లేదు.
ఆలస్యంగా కంటైన్మెంట్
కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ ఉన్నట్టు బుధవారమే నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. వారు బస చేసిన టోలిచౌకిలోని ఒక కాలనీని వైద్యారోగ్యశాఖ కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించింది. కాలనీలో బుధవారం 120 మంది నుంచి, గురువారం 430 మంది నుంచి.. మొత్తంగా 550 మంది నుంచి శాంపిళ్లు సేకరించి ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపారు. ఇందులో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే.. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment