సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడానికి వీలుగా ఒకే కార్డును తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు రెండో వారంలోగా ‘కామన్ మొబిలిటీ కార్డు’లను సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఈ అంశంపై సచివాలయంలో గురువారం ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు... తొలుత హైదరాబాద్‌లోని ప్రజారవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి వినియోగించేలా ఈ కార్డును అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మొదట మెట్రోరైల్, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డులను జారీ చేస్తామని, సమీప భవిష్యత్తులో ఇదే కార్డుతో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకొనేలా విస్తరి స్తామని మంత్రులు తెలిపారు.
పౌరులు వారి ఇతర కార్డుల మాదిరే దీన్ని కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరి కామన్ మొబిలిటీ కార్డు ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఈ కార్డుగల ప్రయా ణికులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు.
మరోవైపు కామన్ మొబిలిటీ కార్డుకు ఒక పేరును సూచించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పౌరుల నుంచి పేర్లను కోరుతూ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో అరవింద్ కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment