పడకల్లో ఆరో స్థానంలో రాష్ట్రం | One Lakh beds in public and private hospitals in Telangana | Sakshi
Sakshi News home page

పడకల్లో ఆరో స్థానంలో రాష్ట్రం

Published Thu, Aug 20 2020 5:32 AM | Last Updated on Thu, Aug 20 2020 5:37 AM

One Lakh beds in public and private hospitals in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోని పడకల్లో తెలంగాణ దేశంలోనే ఆరో స్థానంలో నిలిచింది. వాషింగ్టన్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ (సీడీడీఈపీ) అనే ప్రతిష్టాత్మక సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. దీని కార్యాలయం ఢిల్లీలోనూ ఉంది. ఆ సంస్థ ప్రిన్‌స్టన్‌ యూనివర్సిటీతో కలిసి కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలోని 37 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆసుపత్రులు–పడకల పరిస్థితిపై అధ్యయనం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అన్ని రకాల పడకలు, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీ యూ) పడకలు, వెంటిలేటర్ల సామర్థ్యాన్ని ఆ సంస్థ అంచనా వేసింది. తాజాగా ఆ నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో సుమారు 19 లక్షల సాధారణ పడకలు, 95 వేల ఐసీయూ బెడ్లు, 48 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని వివరించింది. 

తెలంగాణలో 5.2 శాతం పడకలు.. 
ఈ అధ్యయనం ప్రకారం దేశంలోని ఆసుపత్రుల్లో చాలా పడకలు, ఐసీయూలు, వెంటిలేటర్లు 7 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని సీడీడీఈపీ తెలిపింది. అందులో మొదటిస్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 14.8 శాతం, కర్ణాటకలో 13.8 శాతం, మహారాష్ట్రలో 12.2 శాతం, తమిళనాడులో 8.1 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 5.9 శాతం ఉండగా, ఆరో స్థానంలో ఉన్న తెలంగాణలో 5.2 శాతం పడకలున్నాయి. అదేస్థాయిలో కేరళలోనూ 5.2 శాతం పడకలున్నాయి. అంటే దేశంలో ఈ ఏడు రాష్ట్రాల్లోనే 65.2 శాతం పడకలున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లో పడకల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరముందని సూచించింది. 

రాష్ట్రంలో దాదాపు లక్ష పడకలు.. 
ఇక తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు 4,110 ఉన్నాయని సీడీడీఈపీ తెలిపింది. అందులో ప్రైవేట్‌ ఆసుపత్రులు 3,247 ఉన్నాయంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మొత్తం కలిపి 99,919 (దాదాపు లక్ష) పడకలున్నాయని పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20,983 పడకలుండగా, ప్రైవేట్‌లో 78,936 పడకలున్నాయని వివరించింది. మొత్తం 99,919 పడకల్లో ఐసీయూ బెడ్లు 4,996 ఉన్నాయని వెల్లడించింది. అందులో ప్రైవేట్‌లో ఐసీయూ పడకలు 3,947 ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,049 ఉన్నాయని తెలిపింది. ఇక వెంటిలేటర్లు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 525 ఉండగా, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 1,973 ఉన్నాయి. మొత్తం కలిపి రాష్ట్రంలో 2,498 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతీ వెయ్యి జనాభాకు 2.85 సాధారణ పడకలు, ప్రతీ లక్ష జనాభాకు 14.2 ఐసీయూ బెడ్లు, అలాగే ప్రతీ లక్ష జనాభాకు 7.13 వెంటిలేటర్లు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ఆరో స్థానం గర్వకారణం.. 
రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో పడకల సంఖ్య దేశంలోనే ఆరో స్థానంలో ఉండటం గర్వ కారణం. వైద్య, ఆరోగ్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధను అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ సీడీడీఈపీ గుర్తించడం విశేషం. కరోనా నేపథ్యంలో చేసిన ఈ పరిశోధన తర్వాత కూడా రాష్ట్రంలో అత్యవసర పడకలు, వెంటిలేటర్లు దాదాపు రెట్టింపు సంఖ్యలో పెరిగాయి.  
– డాక్టర్‌ కిరణ్‌ మాదల,క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement