సాక్షి, పెద్దపల్లి: పెళ్లివేడుక.. సీమంతం పండు.. ఇలా ఏ శుభకార్యమైన ఇంట్లో పిండి వంటలు చేయడం తెలుగింటి కుటుంబాల్లో సాధారణం. పెరిగిన కార్పొరేట్ కల్చర్‌తో పెద్దఎత్తున అప్పాలు చేసే సమయం.. తీరిక లేకపోవడంతో శుభకార్యాలకు ఆర్డర్ ఇచ్చి అప్పాలు తయారుచేయించుకునే సంస్కృతి పెరిగిపోతోంది. దీనిని అవకాశంగా తీసుకున్నారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్ మహిళలు. క్వాలిటీగా అప్పాలు చేయడాన్ని ఉపాధిగా మలుచుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
లక్ష్మీ ఆలోచన అదుర్స్..
సుమారు పదిహేను ఏళ్ల క్రితం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ లీడర్‌గా పదిమంది సభ్యులతో గ్రూపుగా ఏర్పాటు చేసుకుని ఇంటివద్దనే ఉంటూ చిన్నమొత్తాలతో ఏమైనా వ్యాపారం చేయాలనుకున్నారు. పలురకాలుగా ఆలోచిస్తున్న సమయంలో గ్రూప్‌లోని ఓ సభ్యురాలి ఇంట్లో వివాహ వేడుకకు పెద్ద మొత్తంలో అప్పాలు తయారు చేయాల్సి వచ్చింది. దీంతో గ్రూప్ సభ్యుల సహకారంతో ఆ పెళ్లికి కావాల్సిన సారెను అందరూ కలిసి సరదాగా సిద్ధం చేశారు. ‘ఊళ్లో ఉన్న మనకే సారె తయారు చేయడానికి ఇతరుల సహాయంతో చేయాల్సిన పరిస్థితి నెలకొందని.. ఇక సిటీలో ఉన్నవారు పరిస్థితి ఏంటి..? వారు అప్పాలు పెద్దమొత్తంలో ఎలా తయారు చేసుకుంటారు..?’ అనే ఆలోచన లక్ష్మీకి తట్టింది. దీనిని ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదని గ్రూప్ సభ్యులకు వివరించింది. తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో కూడినది కావటంతో అందరూ సరేనన్నారు.
చదవండి: మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ రేణుకా చౌదరి మధ్య మాటల యుద్ధం
ఏడు గ్రూప్‌లు.. 350మంది వర్కర్లు
తమ గ్రూపునకు ఎటువంటి పేరుగానీ.. బ్రాండ్‌గానీ లేకుండా క్వాలిటీతో మొదట తమ గ్రూప్ సభ్యులు, వారి బంధువులు, స్నేహితులకు ఆర్డర్స్ మీద తయారు చేసి ఇచ్చేవారు. అలా నోటిమాటతో క్వాలిటీ నచ్చి ఆర్డర్స్ పెరుగుతూపోయాయి. దాదాపు ఏడాదికి రూ.60 లక్షలపైనే ఆర్డర్స్ వస్తుండటంతో అప్పాలు కాల్చడానికి.. పిండి తయారీకి.. సకినాలు చుట్టడానికి.. ఇతరత్రా పనులకు రోజువారీ వర్క్‌ర్స్ సహాయం తీసుకుని వారికి ఉపాధి కల్పించారు. దీంతో వీరిని చూసి గ్రామంలో మరో ఆరు సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్కో గ్రూప్‌లో పది మంది సభ్యులతో పాటు వారికి సహాయంగా పనికి వచ్చే 50మంది వర్క్‌ర్స్, పిండి గిర్నీ, ట్రాలీ, కట్టెలు కొట్టేవారు కలిపి దాదాపు 300మందికి పైగా ఇప్పుడు ఆ గ్రామంలో అప్పాలతో ఉపాధి పొందుతున్నారు.
బాహుబలి అప్పాలు..
32 వరుసలతో చక్రాల్లా సకినాలు, కిలో పరిమాణంలో లడ్డూ, గరిజ, బెల్లం అరిసెలు, నువ్వుల లడ్డూ, మురుకులు, చెగోడీలూ, గవ్వలు, ఖారా, ఇతరత్రా వంటకాలను పెద్ద ఎత్తున తయారు చేయడం వీరి ప్రత్యేకత. వీరి అప్పాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలతోపాటు, అమెరికా, ఇంగ్లాండ్, అస్ట్రేలియాలాంటి దేశాలకు సైతం ఆర్డర్స్ మీద సరఫరా చేస్తున్నారు.
పిల్లలను అమెరికా పంపిన
ఖాళీగా ఉండకుండా ఇంటిపట్టున ఉంటూ ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆర్డర్ మీద అప్పాలు చేయాలన్న ఆలోచన వచ్చింది. ప్రత్యేకంగా బ్రాండ్ లేకుండానే తెలిసిన వారి నుంచి ఆర్డర్స్ తీసుకుని క్వాలిటీతో సమయానికి ఇవ్వడంతో రోజురోజుకూ ఆర్డర్స్ పెరిగాయి. అప్పాలు చేయడంతో వచ్చిన పైసలతోనే మా ఇద్దరు అమ్మాయిలను అమెరికా పంపించా.
– తానిపత్తి లక్ష్మీ, గ్రూప్ లీడర్
పిల్లలు అమెరికాలో చదువుతున్నరు
ఎండలో పనికి పోకుండా.. ఇంటి పట్టునే ఉంటూ ఆర్థికంగా ఇంటికి ఆసరా అవుతున్నం. చదువుల కోసం పిల్లల్ని విదేశాలకు పంపే స్థితికి వచ్చాం. మా గ్రూప్‌ను చూసి గ్రామంలో మరో ఆరు గ్రూప్‌లు ఏర్పాడ్డాయి. వీటిమీద ఆధారపడి మరో 300 మంది వరకు పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి రోజు కూలీ రూ.500పైనే పడుతోంది. అర్డర్స్ ఎక్కువ వస్తే ఇతర గ్రూప్‌లతో పంచుకుంటాం.
– సుభాషిణి, సభ్యురాలు
రోజుకు రూ.500పైనే కూలీ
నీడ పట్టున ఉంటూ అప్పాలు తయారు చేయడానికి పనికి వస్తుంట. 32 వరుసల సకినం చుట్టితే ఒక్కోదానికి రూ.20 ఇస్తారు. రోజుకు రూ.500 పైనే కూలీ పడుతుంది. తెల్లారేవరకు అందరితో సరాదాగా పనిచేస్తూ మా పిల్లలను మంచిగా చదివిస్తున్నా. వృద్ధులు సైతం వచ్చి పనిచేసుకుంటూ సొంత కాళ్ల మీద బతుకుతున్నారు.
– రాజేశ్వరి, సహాయకురాలు
Comments
Please login to add a commentAdd a comment