కెరమెరి(ఆసిపాబాద్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్‌లో బాహుబలి సినిమాలో జరిగినట్లు ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ సినిమాలో మహేంద్ర బాహుబలిని శివగామి తన చేతిలో పట్టుకుని నదిని దాటినట్లుగా.. లక్మాపూర్ వాగులో ఓ వ్యక్తి చంటి బిడ్డను ఇలా చేతుల్లో పట్టుకుని వాగు దాటాడు. గ్రామానికి చెందిన రాథోడ్ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మరోవైపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. దీంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లే వీల్లేక మూడు రోజులు వేచి చూశారు.
చిన్నారి పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సాయంకోసం కృష్ణ తన తమ్ముడు సాయిప్ర కాశ్‌ను తీసుకుని బయల్దేరారు. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాయిప్రకాశ్ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గొంతు వరకు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటారు. తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా వాగుదాటారు.
అనంతరం ముగ్గురూ కెరమెరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తిరిగి ఇదే రీతిలో వాగుదాటి ఇంటికి వెళ్లారు. కాగా, ఈ వాగుపై 2016లో వంతెన నిర్మాణం ప్రారంభించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆ ప్రాంతవాసులు చెపుతున్నారు. దీంతో ఏటా వానాకాలంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని లక్మాపూర్ వాసులు వాపోతున్నారు.
చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి
Comments
Please login to add a commentAdd a comment