జాగ‘రణం’.. బండి సంజయ్‌ దీక్ష భగ్నం | Police Arrested Bjp Chief Bandi Sanjay Karimnagar | Sakshi
Sakshi News home page

జాగ‘రణం’.. బండి సంజయ్‌ దీక్ష భగ్నం

Published Sun, Jan 2 2022 10:58 PM | Last Updated on Mon, Jan 3 2022 4:34 AM

Police Arrested Bjp Chief Bandi Sanjay Karimnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/కరీంనగర్‌ టౌన్‌: ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను సవరించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదివారం కరీంనగర్‌లో తలపెట్టిన జాగరణ దీక్ష రణరంగంగా మారింది. లాఠీఛార్జీలు, తోపులాటలతో ఎంపీ ఆఫీసు యుద్ధక్షేత్రాన్ని తలపించింది. కార్యాలయం లోపలి నుంచి తాళం వేసుకుని సంజయ్‌ దీక్షకు దిగగా.. రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో సంజయ్‌ అక్కడే దీక్షకు దిగారు.  

సభకు అనుమతి లేదన్న పోలీసులు 
ఉదయం సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన ఎంపీ సంజయ్‌.. తిరిగి కరీంనగర్‌కు రాకముందే వందలాదిగా కార్యకర్తలు దీక్ష స్థలానికి చేరుకున్నారు. అయితే ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సభకు అనుమతి లేదని, నిర్వహించవద్దని పోలీసులు ఉదయమే నోటీసులు జారీచేశారు. అయినా పెద్దయెత్తున కార్యకర్తలు దీక్షా స్థలానికి చేరుకోవడంతో పోలీసులు వచ్చినవారిని వచ్చినట్లుగా అరెస్టు చేశారు.

సాయంత్రానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం గుమిగూడటంతో పోలీసులు పలుమార్లు లాఠీలకు పనిచెప్పారు. కార్యకర్తలను చెదరగొట్టేందుకు స్వయంగా సీపీ సత్యనారాయణ కూడా లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.  

కేసీఆర్‌కు గుణపాఠం చెబుతాం 
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య బండి సంజయ్‌ సినీఫక్కీలో బైకు మీద తన కార్యాలయానికి వచ్చారు. పోలీసుల కళ్లు గప్పి లోపలికి వెళ్లి ప్రహరీ గేటుకు, కార్యాలయానికి లోపలి నుంచే తాళం వేసుకున్నారు. కిటికీలో నుంచి మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనను, టీచర్లను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌కు గుణపాఠం చెబుతామన్నారు. అనంతరం వందమందికి పైగా నేతలతో కలిసి లోపలే కూర్చుని దీక్షకు దిగారు.

సంజయ్‌ దీక్షను భగ్నం చేసేందుకు రాత్రి 10.గంటల సమయంలో తలుపులు పగలగొట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇంకొందరు పోలీసులు కిటికీల్లోంచి స్ప్రింక్లర్ల ద్వారా లోపలికి నీటిని చిమ్మడంతో కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. తొలుత గ్యాస్‌ కట్టర్లతో గేట్లు తొలగించి, అనంతరం గునపాలతో తలుపులు తెరిచారు. తలుపులు తెరుచుకోకుండా కార్యకర్తలు లోపలి నుంచి తీవ్రంగా  ప్రతిఘటించారు.

ఎట్టకేలకు తలుపులు తెరిచిన పోలీసులు సంజయ్‌ని బలవంతంగా ఎత్తుకొచ్చి, అరెస్టు చేసి జీపులో వేసి తీసుకెళ్లారు. అరెస్టు సమయంలో బండి సంజయ్‌ కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. బండి సంజయ్‌ అరెస్టు అనంతరం మరోసారి భారీగా కార్యకర్తలు ఎంపీ కార్యాలయం వద్దకు దూసుకురావడంతో నాలుగోసారి పోలీసులు లాఠీఛార్జి చేశారు. 

ఎప్పుడేం జరిగిందంటే.. 
ఉదయం 7 గంటల సమయంలో చైతన్యపురిలోని ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 9.35 గంటల తర్వాత సంజయ్‌ సిరిసిల్ల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. 10 గంటల నుంచి దీక్ష స్థలానికి కార్యకర్తల రాక మొదలైంది. 11.15 సమయంలో ఏసీపీ తుల శ్రీనివాసరావు దీక్షకు అనుమతి లేదని నోటీసులు జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను అరెస్టు చేశారు. 

కార్యకర్తలతో నిండిపోయిన వీధులు 
సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య పోలీసులు భారీ సంఖ్యలో దీక్షా స్థలానికి చేరుకున్నారు. కాగా చైతన్యపురి వీధులన్నీ కార్యకర్తలతో నిండిపోయాయి. బండి సంజయ్‌ రాగానే అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ముందుగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రతిఘటించిన వారిపై రెండుసార్లు లాఠీలు ఝుళింపించారు.

రెండోసారి లాఠీఛార్జీలో సీపీ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. కాగా రాత్రి 7.30 సమయంలో సంజయ్‌ పోలీసుల కన్నుగప్పి బైకుపై వచ్చి కార్యాలయంలోకి వెళ్లారు. సంజయ్‌ మాట్లాడుతుండగా కవర్‌ చేస్తున్న  మీడియా ప్రతినిధులను పోలీసులు లాగేశారు. దీంతో పోలీసులకు మీడియాకు మధ్య వాగ్వాదం జరిగింది. 

సీఎం సతీమణికి సంజయ్‌ ఫిర్యాదు 
బండి సంజయ్‌ కార్యాలయంలో దీక్షకు దిగిన విషయం తెలుసుకున్న కార్యకర్తలు అకస్మాత్తుగా దూసుకొచ్చారు. వీరిని నియంత్రించేందుకు పోలీసులు మూడోసారి లాఠీఛార్జి చేశారు. రాత్రి 8 గంటల సమయంలో ఫేస్‌బుక్‌ లైవ్‌లో సీఎం కేసీఆర్‌ సతీమణిని ఉద్దేశించి బండి సంజయ్, మాట్లాడారు. కార్యకర్తలు, టీచర్లు, మీడియాపై పోలీసులతో కేసీఆర్‌ దాడి చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

పలువురి అరెస్టు 
9.30 సమయంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతోపాటు మరికొందరు మహిళామోర్చా నాయకులు, ఉమామహేశ్వరరెడ్డి, చొప్పరి జయశ్రీలను పోలీసులు అరెస్టు చేశారు. 9.45కు బయటికి రావాలని మెగాఫోన్లలో బీజేపీ నాయకులకు సీపీ విజ్ఞప్తి చేశారు. పోలీసులు లోపలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు.

ఎట్టకేలకు రాత్రి 9.55 సమయంలో గ్యాస్‌ కట్టర్లతో ప్రహరీ గేట్లను కట్‌చేసిన పోలీసులు ఎంపీ కార్యాలయం ప్రాంగణంలోనికి వెళ్లారు. అక్కడ గునపాలతో కిటికీలు, తలుపులు తెరిచారు. లోపల వందలాది మంది ఉండటంతో పోలీసులకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వారిని చెదరగొట్టేందుకు కిటికీల్లోంచి వాటర్‌ స్ప్రేయర్లతో నీటిని పంపారు. దీంతో తడిసిన నాయకులు  చెల్లాచెదురయ్యారు.  

దీక్ష వద్దన్నా వినలేదు 
రాత్రి 10.16కు సంజయ్‌ను బలవంతంగా అరెస్టు చేసి బయటకు ఎత్తుకొచ్చి మానకొండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో సంజయ్‌ అక్కడే దీక్షకు కూర్చున్నారు. అరెస్టుకు ముందు పోలీసులతో బండి సంజయ్‌ వాగ్వాదానికి దిగారు. ఆయనతో పాటు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, గంగాడి క్రిష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తరలించారు.

బండి అరెస్టు విషయం తెలుసుకున్న కార్యకర్తలు మరోసారి దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు నాలుగోసారి లాఠీఛార్జి చేశారు. ఒమిక్రాన్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఇలాంటి దీక్షలు వద్దని తాము ముందు చెప్పామని, అయినా ఎంపీ, ఆయన అనుచరులు తమ మాట వినలేదని సీపీ సత్యనారాయణ వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement