Police Recruitment Board Chairman vv Srinivasa Rao With Sakshi, Full Details Inside - Sakshi
Sakshi News home page

IPS Officer VV Srinivas Rao: తెలంగాణ పోలీస్‌ నియామకాలు! ఏ పరీక్షలు ఎప్పుడు ఉండొచ్చంటే..

Published Sat, May 7 2022 2:35 AM | Last Updated on Sat, May 7 2022 10:43 AM

Police Recruitment Board Chairman vv Srinivasa Rao With Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మొదటిసారి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అన్ని యూనిఫాం విభాగాల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఐదు విభాగాలకు సంబంధించి 17 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి చేపడుతున్న చర్యలను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి వివరించారు. అప్లికేషన్ల దాఖలు నుంచి తుది రాతపరీక్ష వరకు అవలంభిస్తున్న వినూత్న పద్ధతులు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలను వెల్లడించారు. 

సాక్షి: ఇప్పటివరకు ఆరు నోటిఫికేషన్లు ఇచ్చారు. అభ్యర్థులకు ఫీజు భారంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి కదా? 
చైర్మన్‌:
గతంలోనూ ఇలాగే దరఖాస్తు రుసుము పెట్టాము. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి రిబేట్‌ రూపంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నాము. ఇక్కడ ఒక చిన్న విష యం చెప్పాలి. తుది రాతపరీక్ష పూర్తయ్యే వరకు ఒక్క సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అభ్యర్థిపై బోర్డుకు రూ.2,700 ఖర్చవుతోంది. గత నోటిఫికేషన్‌ సమయంలో రూ.2,050 ఖర్చయ్యేది. ఇక, కానిస్టేబుల్‌ అభ్యర్థికి గతంలో రూ.900 ఖర్చయ్యేది.. ఇప్పుడు ధరలు పెరగడంతో రూ.1,200 అవుతోంది. 

సాక్షి: దేహదారుడ్య పరీక్షలపై గతంలో పలు ఆరోపణలు, కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి అలాంటివి రాకుండా ఏం చర్యలు చేపడుతున్నారు?
చైర్మన్‌:
ఆరోపణలు సహజం, కానీ చేపట్టిన చర్యల్లో ఎక్కడా తప్పులు దొర్లలేదు. ప్రిలిమినరీ రాత పరీక్ష తర్వాత నిర్వహించే దేహదారుడ్య పరీక్షల్లో ఖచ్చితమైన ఫలితాలు, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వస్తున్నాం. రన్నింగ్‌ టెస్ట్‌ సమయంలో ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) బిబ్స్‌ను వాడుతున్నాం, అంతేకాకుండా ఈసారి రిస్ట్‌ బ్యాండ్‌లను కూడా వాడాలని భావిస్తున్నాం. మరింత పారదర్శకత కోసం సీసీటీవీలను సైతం ఉపయోగించనున్నాం. తప్పిదాలకు తావు లేకుండా సాంకేతికంగా అన్నీ చర్యలు చేపడుతున్నాం. 

సాక్షి: రాతపరీక్షతో పాటు మిగతా పరీక్షలు ఎప్పుడు, ఏయే పోస్టులకు నిర్వహించనున్నారు?
చైర్మన్‌:
దరఖాస్తు దాఖలుకు ఈ నెల 20 వరకు అవకాశముంది. అయితే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యాక ప్రశ్నపత్రాల రూపకల్పన ఇతర ప్రక్రియకు నెలన్నర పడుతుంది. బహుశా జూలై చివరి వారం లేదా ఆగస్టు రెండో వారంలో ప్రిలిమినరీ నిర్వహించాలని భావిస్తున్నాం. ముందుగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు నిర్వహిస్తాం. తర్వాత రెండు వారాలకు కానిస్టేబుల్, ఇతర ఉద్యోగాలకు ప్రిలిమినరీ నిర్వహించాలని అనుకుంటున్నాం. సెప్టెంబర్‌ చివరి వారం వరకెల్లా ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నిస్తాం. ప్రిలిమినరీ ఉత్తీర్ణులైన వారి నుంచి డిటైల్డ్‌ అప్లికేషన్‌ సేకరించాలి. దీనికి కనీసం నెలన్నర పట్టొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయితే అక్టోబర్‌–నవంబర్‌ మధ్య పీఎంటీ, పీఈటీ(దేహదారుడ్య) పరీక్షలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నాం. తుది రాతపరీక్ష డిసెంబర్‌ రెండో వారం నుంచి నాలుగో వారం మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక సెలెక్షన్‌ లిస్ట్‌కు మూడు వారాల నుంచి నాలుగు వారాలు పడుతుంది. అంటే ప్రక్రియ జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి రెండో వారంలోపు ముగించాలని కార్యచరణ రూపొందిస్తున్నాం. 

సాక్షి: మహిళ అభ్యర్థుల దరఖాస్తులు ఏ మేరకు వస్తున్నాయి?
చైర్మన్‌:
గతంకంటే చాలా మెరుగైన రీతిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు 25 శాతానికి పైగా మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇది 35 శాతం వరకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నాం. పోలీస్‌ శాఖలోకి వచ్చేందుకు మహిళలు ఉత్సాహం చూపిస్తున్నారు. సివిల్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ విభాగంలో 33 శాతం, ఆర్మ్‌డ్‌ విభాగంలో 10 శాతం కోటా కూడా ఉండటంతో భారీ స్థాయిలో మహిళలు ముందుకువస్తున్నారు. 

సాక్షి: దేహదారుడ్య పరీక్షల ప్రక్రియలో తెచ్చిన మార్పుల్లో వ్యూహం ఏంటి?
చైర్మన్‌:
పురుషుల విభాగంలో 1,600 మీటర్లు నిర్ణీత సమయంలో పరుగెత్తిన వారికి చాతి కొలతలు అవసరంలేదు. పరుగులో అతడి శక్తి తెలిసిపోతుంది. మహిళలకూ ఆ టెస్ట్‌ తొలగించాం. ఎందుకంటే 800 మీటర్లు నిర్ణీత సమయంలో చేరిన వారికి ఆ పరీక్ష అవసరంలేదు. ఇక పురుషులకు, మహిళలకు లాంగ్‌జంప్, షార్ట్‌పుట్‌ ఒకే విధానం ఉంటుంది. ఆర్మ్‌డ్, స్పెషల్‌ పోలీస్, సీపీఎల్, ఎస్‌పీఎఫ్‌ విభాగంలోని వారికి రన్నింగ్‌ టెస్టులోనే మెరిట్‌ మార్కులుంటాయి. షార్ట్‌పుట్, లాంగ్‌ జంప్‌లో ఉండవు. నిర్ణీత దూరం ఉత్తీర్ణత సాధిస్తే చాలు. అలాగే ఆర్మ్‌డ్, స్పెషల్‌ పోలీస్‌ విభాగంలో లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ ఉన్న అభ్యర్థులకు మరో మూడు మార్కులు అదనంగా వస్తాయి. డ్రైవర్లుగా కూడా వారి సేవలను వినియోగించుకునేందుకు ఈ మార్కులు ఇస్తున్నాం.

సాక్షి: రిక్రూట్‌మెంట్‌ తర్వాత మీరు మరో రెండు కీలక బాధ్యతలు పోషించాల్సి ఉంది కదా?
చైర్మన్‌
: అవును, పోలీస్‌ ట్రైనింగ్, అకాడమీ డైరెక్టర్‌. ఈ విభాగాలకు బాధ్యుడిని నేనే. అందుకే ఇప్పటికే ట్రైనింగ్‌కు కార్యచరణను రూపొందించే పనిలో ఉన్నా. అకాడమీలో ఒకేసారి 14 వేల మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పోలీస్‌ విభాగ అభ్యర్థులకే మా వద్ద శిక్షణ ఉంటుంది. ఎక్సైజ్, అగ్నిమాపక, జైలు, రవాణా, ఎస్‌పీఎఫ్‌ అభ్యర్థులకు ఆయా విభాగాలు శిక్షణ ఇస్తాయి. 

సాక్షి: ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి బోనఫైడ్‌ సర్టిఫికేట్ల విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి పరిష్కారం ఏమిటీ?
చైర్మన్‌:
రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం స్థానికత అంశంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ లేదా ఎక్కువ కాలం ఆ సమయంలో ఎక్కడ ఉన్నారో రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ దాఖలు చేసినా సరిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement