మేం వచ్చాక మొదటి లిఫ్ట్ ట్రయల్‌రన్ పూర్తి
ఆగస్ట్ 15న ఫస్ట్ ఫేజ్ సీఎంతో ప్రారంభిస్తాం: పొంగులేటి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా తలపెట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయితే, ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పక్కన పెట్టి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందని.. అయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో మంగళవారం పర్యటించిన ఆయన తిప్పారెడ్డిగూడెం, దమ్మాయిగూడెం, బీరోలు, పోచారంలో సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అలాగే దమ్మాయిగూడెం నుంచి పోచారం వరకు నిర్మాణం జరుగుతున్న కాలువ, సొరంగం పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు.
అనంతరం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండగా, ఇప్పటికే మొదటి లిఫ్ట్ ట్రయల్‌రన్ పూర్తిచేసి రెండో లిఫ్ట్ ట్రయల్ రన్‌కు సిద్ధమవుతున్నామని తెలిపారు.
మొదటి విడత ఆగస్ట్ 15న..
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మొదటి విడతగా ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయిస్తామని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుపై ఎక్కడా నీటి నిల్వకు రిజర్వా యర్లు కట్టలేదని, దీంతో 10 టీఎంసీల నుంచి 12 టీఎంసీలు నిల్వ చేసేలా రిజర్వాయర్ నిర్మించాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.
కాగా, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ చంద్ర నాయక్, నీటిపారుదల శాఖ సీఈ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment