కరీంనగర్ (జగిత్యాలటౌన్) : గతంలో పెళ్లి, ప్రత్యేక సందర్భాలకే పరిమితమైన ఫొటోలు.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా పోస్ట్ వెడ్డింగ్, ప్రివెడ్డింగ్, ఫొటోషూట్స్, హల్దీ, మెహందీతో పాటు సినిమా సాంగ్స్‌కు అనుగుణంగా అపురూపమైన ఫొటోలను కరిజ్మా, క్యాన్‌వెరా అల్బమ్‌లతో ముస్తాబు చేసి అందిస్తున్న ఫొటోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను తమ ఉపాధిగా మల్చుకుంటున్నారు యువత. లెన్స్ కెమెరాలతో పాటు డ్రోన్, క్రేన్ కెమెరాలతో ఓవైపు షూట్ చేస్తూనే మరోవైపు జరుగుతున్న షూటింగ్‌ను లైవ్ ద్వారా వీక్షించేలా ఫంక్షన్ హాల్ నలువైపులా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రీవెడ్డింగ్ సాంగ్స్‌తో పెళ్లిల్లకు కొత్త అందాలు అద్దుతూ ఔరా అనిపిస్తున్నారు. షూట్ చేసిన ఫొటోలను ఆకర్షణీయమైన ఆల్బమ్స్ తయారు చేస్తూ పెళ్లిళ్లు, శుభకార్యాలు, సంబరాలను చిరకాలం గుర్తుండే మధుర స్మృతిగా మలుస్తున్నారు.
యువతకు ఉపాధి..
ఫొటోగ్రఫీలో వస్తున్న కొత్త ట్రెండును పట్టణ జిల్లా ప్రజలు ఆహ్వానిస్తుండటంతో ఫొటోగ్రఫీని స్థానిక యువత ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. ప్రివెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి ఫొటో షూట్‌లతో కలిపి సినిమా ఫొటోగ్రఫీ, వీడియో క్యాన్‌వెరా, ఎల్‌ఈడీ స్క్రీన్స్, క్యాండెట్ ఫొటోగ్రఫీ అల్బమ్‌తో సహా కస్టమర్ రిక్వైర్‌మెంట్‌ను బట్టి రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు చార్జ్ చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో దాదాపు 240మంది ఫొటోగ్రాఫర్లు ఉండగా 40 నుంచి 50కి పైగా ఫొటో స్టూడియోలు, మిక్సింగ్ సెంటర్లు, అల్ఫా డిజైనర్స్ ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు.
ఔట్‌డోర్ ఫొటో షూట్..
పెళ్లికి ముందు జరిపే ప్రివెడ్డింగ్ షూట్‌ల ను ఔట్‌డోర్‌లలో అత్యాధునిక లెన్స్ కెమెరాలు, డ్రోన్, క్రేన్ కెమెరాలను వినియోగిస్తూ సినిమా షూటింగ్‌ను తలపించేలా షూట్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఔట్‌డోర్ ఫొటోషూట్‌లకు నగర శివారు ప్రాంతాలతో పాటు హైదరా బాద్, నిజామాబాద్(డిచ్‌పల్లి), సిద్దిపేట లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి ఫొటోషూట్ చేస్తున్నా రు. ఈ షూటింగ్‌ను చూస్తున్న చాలామంది సినిమా షూటింగ్ అని భ్రమపడుతున్నారు.
ఉపాధి కల్పిస్తున్నాను
టీనేజ్‌లో ఫొటోగ్రఫీ నా హాబీగా ఉండేది. సొంత ఫొటోలను మాత్రమే తీసుకునే నేను ప్రస్తుతం ఫొటోగ్రఫీని ఉపాధిగా మార్చుకుని వెడ్డింగ్ షూటింగ్, వీడియో మిక్సింగ్, ఆల్బమ్ మేకింగ్ చేస్తూ నాతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాను.
– శ్రీనివాస్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్
ఆల్బమ్ మేకింగ్ చేసిస్తాం
జిల్లా కేంద్రంలో ఎడిట్ పాయింట్ నిర్వహిస్తున్నాను. కొత్త జంటల తొలి కలయికలకు సంబంధించిన మధురమైన స్మృతులను పదికాలాల పాటు దాచుకునేలా షూటింగ్, ఎడిటింగ్‌తో పాటు, ఆల్బమ్ మేకింగ్ కూడా చేసిస్తాం. ఒక్కో వెడ్డింగ్‌కు అన్ని ఫార్మాలిటీస్ కలుపుకుని రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు చార్జ్ చేస్తాం.
– గంటె మహేశ్, ఎడిట్ పాయింట్
Comments
Please login to add a commentAdd a comment