నిరసనలకు గురువారమే సిద్ధమై వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిన పోస్టు
సాక్షి, హైదరాబాద్: మధ్యలో ఉన్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆగిపోయిందనే ఆవేదన.. ‘అగ్నిపథ్’తో ఉద్యోగ అవకాశం పోతుందేమోనన్న ఆందోళన.. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆర్మీ అభ్యర్థులను ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు రెచ్చగొట్టారు. గట్టిగా నిరసన తెలిపితే ప్రభుత్వం దిగొస్తుందంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులతో ఉసి గొల్పారు. ఆ మాటలు నమ్మిన ఆర్మీ అభ్యర్థులు ఆవేశంతో ఆందోళనకు దిగారు. కానీ ఎవరూ పట్టిం చుకోవడం లేదన్న భావనతో వారిలో కొందరు విధ్వంసం మొదలుపెట్టారు. మరికొందరూ వారిని అనుసరించారు.
చివరికి బోగీలకు నిప్పుపెట్టడం, రైళ్లను ధ్వంసం చేయడం వంటి చర్యలకూ దిగారు.. శుక్రవారం నాటి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనపై పోలీసుల దర్యాప్తులో ఇలాంటి కీలక అంశాలెన్నో బయటపడుతున్నాయి. ఏపీలోని నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నడుపుతున్న ఆవుల సుబ్బారావు ఈ వ్యవహారంలో సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ఏపీ పోలీసులు శుక్రవారం రాత్రే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి రైల్వే, హైదరాబాద్ సిటీ పోలీసులు.. మొత్తంగా 150 మందికిపైగా అదుపులోకి తీసుకున్నా, రైల్వేస్టేషన్‌లో ఎవరెవరు విధ్వంసం సృష్టించారో నిర్ధారించి అరెస్టులు చేస్తున్నారు. అందులో శనివారం 52 మందిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపర్చారు.
వైద్య పరీక్షల కోసం నిందితులను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తున్న పోలీసులు
ఫీజుల కోసం ప్రైవేట్ అకాడమీలు
కుట్రతో, పక్కా పథకం ప్రకారం జరిగిన రైల్వేస్టేషన్ విధ్వంసం వెనుక.. సాయి డిఫెన్స్ అకాడమీ సహా తొమ్మిది ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల పాత్ర ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వీటిలో కొన్ని అభ్యర్థులు ఎంపికయ్యా ఫీజుల చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఎంపిక పరీక్షల్లో ఒక్కోదశ దాటే కొద్దీ అభ్యర్థులు నిర్ణీత మొత్తం ఫీజు చెల్లిస్తుంటారు. ఈ నెల 14న రాజ్‌నాథ్‌సింగ్ ‘అగ్నిపథ్’ ప్రకటన చేయడంతో రిక్రూట్‌మెంట్లు నిలిచిపోతాయని.. తమకు రావాల్సిన ఫీజులు, భవిష్యత్తులో చేరే అభ్యర్థుల సంఖ్యపై ప్రభావం ఉంటుందని అకాడమీలు భావించాయి.
ఈ క్రమంలో నిర్వాహకులు అప్పటికే తమవద్ద శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులతో సృష్టించిన వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వీడియోలు పోస్టు చేశారు. ఈ నెల 17న నిరసన తెలపడానికి సికింద్రాబాద్ రైల్వే జంక్షన్‌కు రావాలని సందేశాలు పెట్టారు. ఇలా పాత గ్రూపులు, కొత్తగా క్రియేట్ చేసిన వాటితో కలిపి మొత్తం 12 గ్రూపుల్లో ఈ సమాచారం సర్క్యులేట్ అయింది. సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావుతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు, ఏపీకి చెందిన అభ్యర్థులు గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కొందరు లాడ్జిల్లో, మరికొందరు హైదరాబాద్‌లోని డిఫెన్స్ అకాడమీల్లో బస చేశారు. వారికి ప్రైవేటు అకాడమీల నిర్వాహకులే భోజనం, ఇతర వసతులు ఏర్పాటు చేశారు.
17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రావాలంటూ వాట్సాప్ మెసేజ్
వచ్చిన తర్వాతే పెట్రోల్ తెచ్చి..
శుక్రవారం ఉదయం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్మీ అభ్యర్థులు కృష్ణ, గోదావరి, గౌతమి, ఇతర రైళ్లలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారు తమ ప్రతి కదలికనూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసుకున్నారు. ఈ క్రమంలో హకీంపేట ఆర్మీ సోల్జర్స్ సహా నాలుగు గ్రూపులను గుర్తించిన పోలీసులు.. వాటిలోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. వాటిలో ఉన్న వాయిస్ మెసేజీల ప్రకారం.. ఆర్మీ అభ్యర్థులు తొలుత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నిరసన తెలపాలని మాత్రమే భావించారు.
కానీ ఈ నిరసన ఆశించిన స్థాయిలో అందరి దృష్టీ ఆకర్షించలేదని, బలగాలు వచ్చి తమను తరిమేసే లోపు అందరి దృష్టి ఆకర్షించేలా విధ్వంసానికి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు నిరసన మొదలయ్యాకే వెళ్లి పెట్రోల్ తెచ్చి.. బోగీలకు నిప్పంటించారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు స్టేషన్‌లోకి పోలీసు బలగాలు ప్రవేశించడంతో.. బయట రేతిఫైల్ బస్టాప్ వద్ద బస్సులకూ నిప్పుపెట్టాలని అభ్యర్థులు ప్రయత్నించినట్టు గుర్తించారు.
► హకీంపేట్ వాట్సాప్ గ్రూప్‌లోని వాయిస్ మెసేజీలలో.. ‘‘ఎంతసేపు ఒర్రుతార్రా ఒర్రోర్రి నోర్లు నోస్తయ్. అందుకే గమ్మునపోయి పెట్రోల్ తీసుకువచ్చి తగలబెట్టేసినం అనుకో.. బయటికి పోతాది న్యూస్. అంతేగని ఎంతసేపు ఒర్రినా, ఎంతసేపు బ్యానర్లు చూపించినా ఏమీ అవ్వదు. రెండు గంటలు, ఒక గంటల స్క్వాడ్ వస్తది. అందరినీ వెల్లగొడ్తది. అందుకే పోయి పెట్రోల్ తీసుకొస్తే రెండు నిమిషాల్లో తగలబెట్టొచ్చు’ అంటూ ఒక వాయిస్ మెసేజీ..
► ‘‘అరే పెట్రోల్ పంప్‌కు పోతున్నా పెట్రోల్ తీస్కరానీకి, ఎవరైనా వస్తే పెట్రోల్ తీస్కరానికి రండి’’ అంటూ మరో వాయిస్ మెసేజీ ఉన్నాయి.
► ఇక మరో వాట్సాప్ గ్రూపులో.. ‘‘బెటాలియన్ ఆగయా.. సబ్ లోగ్ రేతిఫైలి కనే ఆజావ్.. బస్ జలాదేంగే..’’ అంటూ ఇంకో వాయిస్ మెసేజీని పోలీసులు గుర్తించారు. ఈ మూడు సందేశాలను పోస్టు చేసినది ఒకే వ్యక్తి కావడంతో.. అతడే విధ్వంసానికి సూత్రధారి అని అనుమానిస్తున్నారు.
అడ్మిన్ల ఫోన్ నంబర్లు.. టవర్ లొకేషన్లతో..
రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, వాట్సాప్ గ్రూపులు, సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 12 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్టు నిందితుల ద్వారా తెలుసుకున్న అధికారులు.. అందులో నాలుగింటిని గుర్తించారు. వీటిలో అడ్మిన్లు, సభ్యుల ఫోన్ నంబర్లు సేకరించి.. వారి సెల్ టవర్ లోకేషన్లను పరిశీలిస్తున్నారు. తద్వారా విధ్వంసం సమయంలో రైల్వేస్టేషన్‌లో ఉన్నవారిని గుర్తిస్తున్నారు. కేసు తీవ్రమైనది కావడంతో అనుమానితులను పూర్తిగా పరిశీలించి, ప్రశ్నించాకే అరెస్టు చేస్తున్నారు.
పోలీసులు శుక్రవారం రైల్వే స్టేషన్ వద్ద సుమారు 150 మందిని అదుపులోకి తీసుకుని వివిధ ఠాణాలకు తరలించారు. పరిశీలన అనంతరం 52 మందిని నిందితులుగా గుర్తించి శనివారం అరెస్టు చేశారు. వారికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో కీలకమని భావిస్తున్న మరో ఏడుగురిని ప్రశ్నిస్తుండగా.. మిగతా వారిని విడిచిపెట్టారు. మొత్తంగా ఈ కేసులో నిందితులుగా 200 మందిని గుర్తించారు. వారి కోసం సికింద్రాబాద్ జీఆర్పీతోపాటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, నార్త్‌జోన్ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దర్యాప్తును హైదరాబాద్ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీసీపీ చక్రవర్తి గుమ్మి పర్యవేక్షిస్తున్నారు.
పట్టుకున్నాక తెలిసింది పోలీసని..
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం మొదలయ్యాక మీడియాకు ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారని, రావాలని ఆ ఫోన్ చేసిన వ్యక్తి కోరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కూడా అభ్యర్థేనని, కీలక వ్యక్తి కావడంతోనే మీడియాను పిలిచి ఉంటాడని భావించారు. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే అప్రమత్తమై తప్పించుకోవచ్చని భావించి.. సాంకేతిక ఆధారాలు, ముమ్మర గాలింపుతో ఆయనను గుర్తించి పట్టుకున్నారు. కానీ ఆయన జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ అని తెలిసింది. రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు దిగిన అభ్యర్థులను వెళ్లిపోవాలని కోరగా.. మీడియా వస్తే తప్ప వెళ్లబోమని భీష్మించారని, దాంతో మీడియా వస్తే త్వరగా నిరసన ముగుస్తుందనే ఫోన్ చేశానని ఆయన వివరించారు. దీంతో ఆయన్ను అధికారులు విడిచిపెట్టారు.
కీలక నిందితుడు.. ఏపీ పోలీసుల అదుపులో..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో అభ్యర్థులను ప్రేరేపించిన నిందితుడు, సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును ఏపీ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆవుల సుబ్బారావు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని రావిపాడు పంచాయతీ పరిధిలో డిఫెన్స్ అకాడమీని నడుపుతున్నారు. గురువారం అర్ధరాత్రి సికింద్రాబాద్ వెళ్లిన సుబ్బారావు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నరసరావుపేటకు చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
అక్కడి పాతూరులోని సాయి రెసిడెన్సీ లాడ్జిలో శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు చెందిన డిఫెన్స్ అకాడమీ కార్యాలయంలో తనిఖీలు చేసి.. రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావును ఆదివారం తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశమున్నట్టు తెలిసింది. అయితే సుబ్బారావు గుంటూరు, విశాఖపట్నంలలోనూ ఆర్మీ అభ్యర్థుల నిరసనలకు ప్రేరేపిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. దీనితో అక్కడే కేసులు నమోదు చేసి, అరెస్టు చేయవచ్చే వాదన వినిపిస్తోంది. సుబ్బారావు అప్పగింతపై శనివారం రాత్రి వరకు స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment