
దీనిలో వాడిన పోర్టబుల్ లిథియం బ్యాటరీలను ఒక్కసారి రీచార్జ్ చేస్తే 65 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
సంగారెడ్డి టౌన్: ఐఐటీ హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ప్యూర్ ఈవీ దూసుకుపోతోంది. పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలకు సైతం పోటీనిస్తూ సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ–ట్రాన్స్ ప్లస్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్, బ్లూ, మాట్ బ్లాక్–గ్రే కలర్ వేరియంట్లతో తీసుకొచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్–షోరూం ధర రూ. 56,999 గా కంపెనీ నిర్ణయించింది. దీనిలో వాడిన పోర్టబుల్ లిథియం బ్యాటరీలను ఒక్కసారి రీచార్జ్ చేస్తే 65 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ మోడల్ హై–స్పీడ్ వేరియంట్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ఇప్పటికే 4 ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేసింది.
(చదవండి: చైనా శకం ముగిసింది!)
ఇంధన ఖర్చులు ఆదా
ప్రజల ఇంధన ఖర్చులు తగ్గించాలనే లక్ష్యంతో ఈ–స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు ప్యూర్ ఎనర్జీ సీఈవో రోహిత్ వదేరా తెలిపారు. మన దేశ రోడ్ల నిర్మాణానికి అనుగుణంగా ఎట్రాన్స్ ప్లస్‌ను రూపొందించామని, ఎక్కువ కాలం మన్నే బ్యాటరీలు దీని మరో ప్రత్యేకతగా చెప్పుకొచ్చారు.