రోడ్డు ప్రమాదాలతో ఆర్థిక, సామాజిక వ్యవస్థపై ప్రభావం: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: జీవితాల్లో గుణాత్మక మార్పు తేవడమే లక్ష్యంగా సాంకేతికతను ఉపయోగించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల మూలంగా ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారని, ఇది కుటుంబ వ్యవస్థతోపాటు ఆర్థిక, సామాజిక వ్యవస్థలపైనా ప్రభావం చూపుతోందన్నారు. ఈ నేపథ్యంలో వాహనాల తయారీలో భద్రతకు పెద్దపీట వేస్తూ సాంకేతిక ఆవిష్కరణలు, ఉత్పత్తులు అందుబాటులోకి రావాల్సిన అవసరముందని చెప్పారు.
హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్ లైఫ్‌టెక్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం శ్రీధర్‌బాబు సంస్థ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవవనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాహన రంగంలో భద్రతకు సంబంధించి జెడ్‌ఎఫ్ లైఫ్‌టెక్ సంస్థ బలమైన భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సా గాలని సూచించారు.
రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే సంస్థలకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని చెప్పా రు. పారిశ్రామిక, పెట్టుబడిదారుల అనుకూ ల విధానాలు అవలంబిస్తామని చెప్పారు.
భద్రతా ప్రమాణాలు పెంచుతాం
ప్రపంచ ఇంజనీరింగ్ అవసరాలకు అనుగుణంగా నూతనంగా ప్రారంభించిన జెడ్‌ఎఫ్ గ్లోబల్ కేపబుల్ సెంటర్ ద్వారా కార్లు, ఇతర వాహనాల సీటు బెల్టులు, ఎయిర్‌బ్యాగ్‌లు, స్టీరింగ్‌ల్లో అధునాతన సాంకేతికత ద్వారా భద్రతా ప్రమాణాలు పెంచుతామని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ రుడాల్ఫ్ స్టార్క్ చెప్పారు. వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్‌తోపాటు ప్రపంచ ఇంజనీరింగ్ అవసరాలు తీర్చే విధంగా తమ సంస్థ కార్యకలాపాలు ఉంటాయన్నారు.
సేఫ్టీ టెక్నాలజీలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ దిగ్గజ సంస్థలతో కలిసి పనిచేస్తామని జెడ్‌ఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆకాశ్ పస్సే అన్నారు. సమావేశంలో సంస్థ ఇండియా విభాగం ఈడీ రవికుమార్ తుమ్మలూరుతోపాటు రాష్ట్ర డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ భవానీ శ్రీ, టీజీఐఐసీ ఎండీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment