Hyderabad: అత్యంత విలువైన రైల్వే భూముల్లో రియల్‌ దందా | Railway Land Development Authority: Chilkalguda, Mettuguda Lands Lease | Sakshi
Sakshi News home page

Hyderabad: అత్యంత విలువైన రైల్వే భూముల్లో రియల్‌ దందా

Published Mon, Sep 12 2022 3:43 PM | Last Updated on Mon, Sep 12 2022 7:17 PM

Railway Land Development Authority: Chilkalguda, Mettuguda Lands Lease - Sakshi

చిలకలగూడలోని రైల్వే క్వార్టర్స్‌

సాక్షి, హైదరాబాద్: అత్యంత విలువైన రైల్వే భూముల్లో రియల్‌ దందా పరుగులు  తీస్తోంది. జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో దక్షిణమధ్య రైల్వేకు ఉన్న ఖరీదైన భూములను కారుచౌకగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజాం కాలంలోనే రైల్వేల కోసం వందల ఎకరాల భూమిని కేటాయించారు. రైల్వే కార్యాలయాలు, ఉద్యోగులు, అధికారుల నివాసాల కోసం సికింద్రాబాద్‌లోని అనేక చోట్ల రైల్వేకు విలువైన స్థలాలు ఉన్నాయి. 

ప్రస్తుతం ఆ భూములను నిరర్థక ఆస్తుల ఖాతాలో చేర్చి అతి తక్కువ మొత్తానికి బడా రియల్‌  సంస్థలు, భవన నిర్మాణ సంస్థలకు ధారాదత్తం చేయడం పట్ల ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు  రైల్వే భూములను లీజుకు ఇవ్వడంలో రైల్వేకు, ప్రైవేట్‌ సంస్థలకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) నిబంధనలను అమలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ నివాస సదుపాయాలను ఏర్పాటు చేయకుండానే  రీబిల్డింగ్‌ పేరిట ఉద్యోగుల క్వార్టర్స్‌ భవనాలను కూల్చివేయడం దారుణమని  ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.  

21 ఎకరాలపై రూ.200 కోట్లు.. 
► సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్న చిలకలగూడ రైఫిల్‌ రేజ్‌ క్వార్టర్స్, మెట్టుగూడ రైల్వే కల్యాణ మండపానికి సమీపంలో ఉన్న మరో విలువైన స్థలాన్ని ఓ ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టారు. ఈ రెండు చోట్ల కలిపి దక్షిణమధ్య రైల్వేకు సుమారు 21 ఎకరాల  భూమి ఉంది. చిలకలగూడలో ఉన్న 18 ఎకరాల స్థలాన్ని 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. దీనిపై రూ.170 కోట్లు, మెట్టుగూడలోని మరో  3 ఎకరాలను కూడా 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ.30 కోట్ల చొప్పున లభించనున్నట్లు అంచనా.  

► ప్రైవేట్‌ సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) ఏర్పడిన సంగతి తెలిసిందే. రైల్వే స్థలాలను సేకరించి బడా నిర్మాణ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ఆర్‌ఎల్‌డీఏ  ప్రణాళికలను రూపొందించింది. మొదట్లో వ్యాపార, వాణిజ్య భవనాల కోసం మాత్రమే లీజుకు ఇవ్వాలని భావించారు. కానీ పెద్దగా స్పందన లభించలేదు. ఈ భూములను అతి తక్కువ ఆదాయానికి ఏకంగా 99 ఏళ్లకు లీజుకు ఇవ్వడం పట్ల కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 

► మరోవైపు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఈ  భూమిపై  రైల్వేకు లీజు ద్వారా వచ్చే ఆదాయం కూడా కేవలం రూ.200 కోట్లు మాత్రమే. గ్రేటర్‌ హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ వంటి ప్రభుత్వ సంస్థలు, పలు ప్రైవేట్‌ సంస్థలు అతి తక్కువ భూమిలో వేల కోట్ల రూపాయల వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుండగా రైల్వే  భూములను మాత్రం అతి తక్కువ ఆదాయానికి లీజుకు ఇవ్వడం  దారుణమని ఉద్యోగ  సంఘాలు పేర్కొంటున్నాయి. పైగా గతంలో లీజు కాలపరిమితి కేవలం  49 ఏళ్లు ఉంటే ఇప్పుడు దానిని 99 ఏళ్లకు పెంచడాన్ని కూడా ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు. ప్రైవేట్‌ సంస్థలు రైల్వే ఆస్తులను కొల్లగొట్టడం మినహా మరొకటి కాదని ఎంప్లాయీస్‌ సంఘ్‌ నేత ఒకరు తెలిపారు.  

► ప్రస్తుతం బడా నిర్మాణ సంస్థకు ఈ భూములను కేటాయించడంతో ఉద్యోగుల క్వార్టర్స్‌ను పునర్నిర్మించనున్నట్లు లీజు ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ రైఫిల్‌ రేజ్‌ క్వార్టర్స్‌లో ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండానే రెండో దశ పాత భవనాల కూల్చివేతలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (క్లిక్ చేయండి: రైళ్లిక రయ్‌.. గంటకు 130 కి.మీ. వేగంతో పరుగులు!)

ఒకే చోట నివాసాలు ఉండాలి.. 
వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం అధికారులకు, ఉద్యోగులకు విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం నిరుపయోగ భూములను లీజుకు ఇచ్చే నెపంతో ఉద్యోగుల నివాసాలను తొలగించడం, ప్రస్తుతం ఉన్న చోట కాకుండా మరోచోట నివాసాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. (క్లిక్ చేయండి: చట్టానికి దొరక్కుండా.. ఆన్‌లైన్‌ గేమింగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement