హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో భూమి కొని అందులో రిసార్ట్ నిర్వహిస్తున్నారు. పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకల వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతిరోజు లక్షలు ఆర్జిస్తున్నాడు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమి వ్యవసాయ భూమిగా నమోదై ఉండటంతో ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ఏడాదికి రెండుసార్లు అతని ఖాతాలో జమవుతోంది.
మొయినాబాద్ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే మూడేళ్ల క్రితం క్రీడా మైదానం ఏర్పాటుచేసి రోజూ అద్దెకు ఇస్తున్నారు. సాధారణ సమయాల్లో రోజుకు రూ 2,000–4,000, వారాంతాల్లో రూ.8,000– 10,000 అద్దె వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరం మొత్తం అద్దెకిచ్చే క్రీడా మైదానానికీ రైతుబంధు డబ్బులు అందుతున్నాయి. ఇదే తరహాలో జిల్లాలో వ్యవసాయేతర కార్యకలాపాలు నిర్వహించే చాలా భూముల యజమానులకు రైతుబంధు డబ్బు తేరగా వస్తోంది.
మొయినాబాద్: రైతులకు ఆర్థికంగా చేయూతనందించడానికి ప్రభుత్వం 2018 మే 10న రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. పంట పెట్టుబడి సహాయం పేరుతో వ్యవసాయంచేసే ప్రతి రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.8 వేల చొప్పున అందిస్తా మని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించి మొదటి విడతలో రైతుల పేరుతో చెక్కులు పంపిణీ చేసింది. ఆపై రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. 2019 నుంచి ఈ సహాయాన్ని వానాకాలం, యాసంగి పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున ఎకరాకు సాలీనా రూ.10 వేలకు పెంచింది. తాజాగా యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు డబ్బులను ప్రభుత్వం జమ చేస్తోంది.
రికార్డుల్లో వ్యవసాయం.. క్షేత్రంలో వాణిజ్యం
రైతులను ఆదుకునేందుకు ఇస్తున్న రైతుబంధు కొందరి స్వార్థం కారణంగా పక్కదారి పడుతోంది. పంటలు సాగుచేసే వ్యవసాయ భూములకు మాత్రమే ఈ సాయం అందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ వ్యవసాయేతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న భూములకూ రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇటీవల క్రీడా మైదానాలు, ఫాంహౌస్‌లు, రిసార్ట్స్, ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఎక్కువయ్యాయి. ఇవి వెలసిన భూములన్నీ రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం పట్టా భూములకు రైతుబంధు ఇవ్వాలనే మార్గదర్శకాలకు అనుగుణంగా వీరికి యథావిధిగా సాయం అందుతోంది. దీంతో బడా వ్యాపారులు, సంపన్నవర్గాలు, సెలబ్రిటీలు, ఆ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ రైతుబంధును తీసుకుంటున్నారు. ఇలా రాజధాని శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి. వాటన్నింటికీ రైతుబంధు ఇస్తుండటంతో ఏటా కోట్ల రూపాయలు ‘పెద్ద’ రైతుల ఖాతాల్లోకి వెళుతున్నాయి.
గుర్తించని అధికారులు
రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయేతర కార్యకలాపాలు జరిగే పంట భూములను గుర్తించడంలో యంత్రాం గం విఫలమవుతోందనే విమర్శలున్నాయి. వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు వాడే భూములను నాలా కింద మార్చాల్సి ఉంటుంది. కానీ చాలామంది నాలా మార్పిడి చేయకుండానే వ్యవసాయ భూములను వ్యాపార కార్యకలాపాలకు వాడుతున్నారు. ఇదిలావుండగా, 111 జీవో పరిధిలో వ్యవసాయేతర కార్యకలాపాలపై ప్రభు త్వం ఆంక్షలున్నాయి. మొత్తం విస్తీర్ణంలో కేవలం పదిశాతమే వ్యవసాయేతర అవసరాలకు విని యోగించుకోవాలనే నిబంధనలున్నాయి. దీంతో వ్యవసాయేతర భూముల మార్పిడి కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు బడాబాబులు, రియల్టర్లు తమ భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తూ.. ప్రభుత్వం కళ్లుగప్పుతున్నారు.
నిజమైన రైతులకు అందాలి
ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు నిజమైన రైతులకు అందట్లేదు. వాణి జ్య భూములకు రైతుబంధు ఇస్తున్న ప్రభు త్వం అసైన్డ్ భూములు సాగుచేసుకునే పేదరైతులకు ఇవ్వట్లేదు. వాణిస్య భూములకు రైతుబంధును నిలిపివేయాలి. పేదలకు అసైన్డ్ చేసిన భూములపై వారికే హక్కులు కల్పించి రైతుబంధు ఇవ్వాలి.
– ఉప్పరి శ్రీనివాస్, అసైన్డ్ భూమి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మొయినాబాద్
111 జీవో పరిధిలో నాలా కన్వర్షన్ లేదు
వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవాలి. కానీ 111 జీవో పరిధిలో నాలా కన్వర్షన్ లేదు. దీంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయేతర భూములు కూడా రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాలి.
– అనితారెడ్డి, తహసీల్దార్, మొయినాబాద్
Comments
Please login to add a commentAdd a comment