రాజ్‌నీతి సర్వే సంస్థ తెలంగాణపై తాజాగా తన సర్వే నివేదికను విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని రాజ్‌నీతి ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడింది. బీఆర్ఎస్‌కు 75 స్థానాలు లభిస్తాయని తెలిపింది. 42.43 శాతం ఓట్లు పోల్ అవుతాయని వివరించింది. సంపూర్ణ మెజారిటీతో బీఆర్ఎస్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది.
కాంగ్రెస్‌కు 31 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. 32. 62 శాతం వరకు ఓట్లు పడొచ్చని రాజ్‌నీతి అంచనా వేసింది. దీని ప్రకారం చూస్తే- తెలంగాణలో మరోసారి హస్తం పార్టీకి పరాభవం తప్పకపోవచ్చు. మూడోసారి కూడా ప్రతిపక్ష స్థానానికే పరిమితం అవుతుంది. గతంతో పోల్చుకుంటే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకోగలుగుతుంది.
ఇక భారతీయ జనతా పార్టీకి(బీజేపీ) చెందిన అభ్యర్థులు అయిదు నియోజకవర్గాల్లో మాత్రమే గెలుస్తారని రాజ్‌నీతి ఒపీనియన్ పొల్ తెలిపింది. 16.71 శాతం ఓట్లు పడతాయి. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు(ఎంఐఎం) ఏడు సీట్లు దక్కుతాయి. ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది.
చదవండి: ఫేక్ వీడియోలు వైరల్ కావొచ్చు: కేటీఆర్
ఈ ఒపీనియన్ పోల్‌పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పందించారు. దీన్ని ఆయన స్వాగతించారు. జై తెలంగాణ అంటూ నినదించారు. #TelanganaWithKCR అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజాభిప్రాయాలతో ఈ సర్వే రూపొందించగా.. మొత్తంగా 38,351 మంది అభిప్రాయాలను సేకరించింది. రాజ్‌నీతి సంస్థ. రైతులు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, బస్సు/ఆటోడ్రైవర్లు, పక్కా ఇళ్ల యజమానులు, ఇతరులుగా వారిని విభజించింది. మొత్తం తొమ్మిది వర్గాల నుంచి ఈ అభిప్రాయాలను సేకరించింది. అన్ని సామాజిక వర్గాల ప్రజలు, అన్ని వయస్సుల వారు ఇందులో ఉన్నారు. వీటన్నింటిని క్రోడీకరించి ఈ నివేదికను తయారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment