సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో రియల్ రంగం మళ్లీ ఊపందుకుంది. కోవిడ్ ఉధృతి, వరుస లాక్‌డౌన్‌ల కారణంగా కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రియల్ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు జిల్లాలో జరిగిన రిజి్రస్టేషన్లు, వాటి ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయాన్ని పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. ఈ ఐదు మాసాల్లో 95,049 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, భూ క్రయవిక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.1,088 కోట్ల ఆదాయం సమకూరింది. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక భూ క్రయవిక్రయాలు జరిగిన జిల్లాల్లో రంగారెడ్డే టాప్‌లో ఉండటం గమనార్హం. ఆ తర్వాత స్థానంలో మేడ్చల్ ఉంది.
కోవిడ్‌లోనూ పెట్టుబడుల వరద
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ అనుబంధ రంగాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. అనేక సంస్థలు సంక్షోభంలో కూరుకుపోయాయి. లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధి అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఈ క్లిష్ట సమయంలోనూ రంగారెడ్డి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తాయి. తక్కువ ధరకే కావాల్సినంత భూమిని ప్రభుత్వం సేకరించి ఇస్తుండటం, ప్రత్యేక పారిశ్రామిక వాడల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, 24 గంటల కరెంట్ సరఫరా, సబ్సిడీ, పన్నుల నుంచి మినహాయింపు, రక్షణ పరంగా ఈ ప్రాంతం అనుకూలంగా ఉండటంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
టాటా, పీ అండ్ జీ, విప్రో, పోకర్ణ గ్రానైట్స్, ప్రీమియర్ ఎనర్జీస్, చిర్పాల్ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఇటీవల ముందుకు వచ్చాయి. గతంలో వ్యవసాయ భూములు ఎస్‌ఆర్‌ఓ కార్యాలయాల్లో జరుగుతుండేవి. ప్రస్తుతం ధరణి రాకతో తహసీల్దార్ కార్యాలయాల్లోనూ భూముల రిజి్రస్టేషన్ల ప్రక్రియ సులభతరమైంది. భూముల ధరలను కూడా ఇటీవల ప్రభుత్వం సవరించింది. స్టాంప్ డ్యూటీని 6 నుంచి 7.5 శాతానికి పెంచింది. ఫలితంగా 2019తో పోలిస్తే ఈ సారి రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ల సంఖ్య తగ్గినా.. స్టాంప్‌డ్యూటీ పెంపుతో ప్రభుత్వానికి ఆదాయం రెట్టింపు స్థాయిలో రావడం విశేషం.
మచ్చుకు కొన్ని సంస్థలు
జిల్లాలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా ఔటర్ రింగ్‌రోడ్డు ఉండటం పారిశ్రామిక వేత్తలకు కలసి వచి్చంది. మౌలిక సదుపాయాలతో పాటు మానవ వనరులు కూడా చాలా తక్కువ ధరకే లభిస్తుండటంతో ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కూడా జిల్లాపై దృష్టి సారించాయి. అంతర్జాతీయ కంపెనీలకు సమీపంలో ఆకర్షణీయంగా రియల్ వెంచర్లు చేసి క్రయవిక్రయాలు జరిపిస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని రైతుల భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు భారీగా కాసులు వచ్చి చేరుతున్నాయి.
► ప్రముఖ బహుళజాతి కంపెనీ అమేజాన్ కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్, షాబాద్, చందనవెల్లి, యాచారంలోని మేడిపల్లిలో డాటా సెంటర్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది.
► ఇబ్రహీంపట్నం సమీపంలో 19,333 ఎకరాల్లో రూ.64 వేల కోట్ల వ్యయంతో ఫార్మాసిటీ వస్తుంది. దీని ద్వారా 1.70 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
►శంకర్‌పల్లి కొడకల్ వద్ద రూ.800 కోట్లతో మేధా ఆధ్వర్యంలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతోంది.
►అబ్ధుల్లాపూర్‌మెట్ బాటసింగారంలో రూ.35 కోట్ల వ్యయంతో 40 ఎకరాల్లో, ఇబ్రహీంపట్నంలోని మంగల్‌పల్లిలో 22 ఎకరాల్లో రూ.20 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు.
►ఇప్పటి వరకు టీఎస్‌ఐపాస్ కింద రూ.19,0028 కోట్ల పెట్టుబడితో 892 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిలో 2.92 లక్షల మందికి ఉపాధి లభించింది. మరో రూ.3,971 కోట్ల పెట్టుబడి తో 11 భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. వీటి ద్వారా 7,460 మందికి ఉపాధి లభించనుంచనుంది.
Comments
Please login to add a commentAdd a comment