
హైదరాబాద్‌లో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: నగరం సాగరమైంది.. వీధులు నదులయ్యాయి. దారులు గోదారుల య్యాయి.. కుండపోత.. గుండెకోతను మిగిల్చింది. నీట మునిగిన ఇళ్లు.. బతుకమ్మలను తలపించాయి. జడివాన.. అలజడి సృష్టించింది. జలఖడ్గానికి జనం కకావికలమయ్యారు. 1,500 పైగా కాలనీలు జలదిగ్బంధమయ్యాయి.. 20,540 ఇళ్లు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. 30 పాతభవనాలు, గోడలు కూలిపోయాయి.. ఇదీ భాగ్యనగరం పరిస్థితి. వందేళ్ల తర్వాత కురిసిన రికార్డు వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురిసిన వానలకు నాలాలు ఉప్పొంగాయి. నగరం చుట్టూ ఉన్న చెరువులు తెగిపోయాయి. కుంటలు పొంగిపొర్లాయి. వాటిల్లో ఉండాల్సిన నీళ్లు రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి చేరాయి. విజయవాడ, కరీంనగర్, వరంగల్ మార్గాలు జలమయమయ్యాయి.
జీహెచ్‌ఎంసీలోని ఈస్ట్, సౌత్ జోన్లలో ఎక్కువ నష్టం వాటిల్లింది. నగరంలో 1,500 కాలనీలకుపైగా నీట మునిగాయి. సరూర్‌నగర్, గడ్డిఅన్నారం, దిల్‌సుఖ్‌నగర్ పాంతాల్లో దాదాపు 200 కాలనీలు జలమయమయ్యాయి. బోయిన్‌చెరువు తెగడం, హస్మత్‌పేట నాలా పొంగిపొర్లడంతో దాదాపు 100 కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఉప్పల్, కుషాయిగూడ, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, కొత్తపేట, బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, మీర్‌పేట, పాతబస్తీలోని పలు కాలనీలు నీటచిక్కి గజగజ వణికాయి. ఇళ్లలోని సామాన్లు కొట్టుకుపోయాయి. వరదనీరు బుధవారం మధ్యాహ్నానికి కూడా తగ్గలేదు. టోలిచౌకి నదీం కాలనీ, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, ఫలక్‌నుమా, కవాడిగూడ అరవింద్ కాలనీ, రామంతా పూర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను బోట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్, ఆర్మీ తదితర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నగరంలోని 122 ప్రాంతాల్లో 20,540 ఇళ్లు నీట మునిగినట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. దాదాపు పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, లక్షా యాభై వేల మందికి ఆహారం అందజేసినట్లు తెలిపింది. 24 గంటలు పనిచేసే 30 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
ఆలయాల్లోకి చేరిన నీరు..
బల్కంపేట ఎల్లమ్మగుడిలోకి సైతం అమ్మవారి పాదా ల వరకు వర్షపునీరు చేరింది. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా గుడి, పురానాపూల్ శివాలయాల్లోకి వరదనీరు చేరింది. వానకు తడిసిపోయి దా దాపు 30 పాతభవనాలు, గోడలు కూలిపోయాయి.
ప్రధాన రహదారుల్లో ..
ప్రధాన రహదారుల మార్గాల్లోని మలక్‌పేట రైల్వేస్టేషన్, డబీర్‌పురా కమాన్, యశోద ఆస్పత్రి, నల్ల గొండ క్రాస్‌రోడ్, శాలివాహన నగర్, సంతోష్‌నగర్ రాయల్‌సీ హోటల్, ఓల్డ్ చాంద్రాయణగుట్ట, హుమాయూన్‌నగర్, గుడిమల్కాపూర్, బజార్‌ఘాట్, బేగంబజార్, కింగ్‌కోఠి ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రి, కోఠి, అఫ్జల్‌గంజ్, బషీర్‌బాగ్, జియాగూడ, అశోక్‌నగర్ బ్రిడ్జి, ఇందిరాపార్కు, హిమాయత్‌నగర్, అంబర్‌పేట, నారాయణగూడ, నింబోలిఅడ్డ రైల్వే బ్రిడ్జి, తిలక్‌నగర్ జంక్షన్, గోల్నాక చర్చి, రామంతాపూర్, నారాయణగూడ, ఫీవర్ హాస్పిటల్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజ్, మైత్రివనం, లక్డీకాపూల్, నిమ్స్, కేసీపీ జంక్షన్, పంజగుట్ట, షేక్‌పేట, కర్బలా క్రాస్‌రోడ్స్, బేగంపేట జలమయమయ్యాయి.
కొట్టుకుపోయిన బ్రిడ్జి ఫెన్సింగ్..
మూసారాంబాగ్ బ్రిడ్జి ఫెన్సింగ్ రెండువైపులా కొట్టుకుపోయింది. హుస్సేన్‌సాగర్ నీరు పూర్తిస్థాయి మట్టాని కంటే ఎక్కువై తూముల గుండా దిగువకు ప్రవహిస్తోంది. రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించేందుకు డివైడర్లు ధ్వంసం చేశారు. దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. కోఠి– దిల్‌సుఖ్‌నగర్ మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి.
నీళ్లలో కాలనీలు..
గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలోని 30 సర్కిళ్లలో పలు కాలనీలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. కాప్రా సర్కిల్‌లోని అంబేద్కర్‌నగర్ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, ఉప్పల్ సర్కిల్‌లోని రామంతాపూర్, పీవీఆర్ కాలనీ, ఎల్‌బీనగర్ సర్కిల్‌లోని గుంటి జంగయ్యనగర్, రెడ్డికాలనీ, మల్లికార్జుననగర్, వెంకటేశ్వరకాలనీ, గ్రీన్‌పార్క్ కాలనీ, మారుతీనగర్, గ్రీన్‌పార్క్ కాలనీ, మారుతీనగర్, తపోవన్ కాలనీసహా ఇరవైకిపైగా కాలనీలు నీటమునిగాయి. సరూర్‌నగర్ సర్కిల్‌లోని భవానీనగర్, నాగోల్, అల్కాపురి తదితర కాలనీలు, మలక్‌పేట సర్కిల్‌లోని శంకర్‌నగర్, మూసానగర్, సంతోష్‌నగర్ సర్కిల్‌లోని సింగరేణికాలనీ, రెయిన్‌బజార్, తలాబ్ చంచలం, పాతబస్తీ పరిధిలోని ముర్గిచౌక్, మీరాలం, అల్‌జుబేల్ కాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. వీటితోపాటు కోర్‌సిటీలోని బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా, అశోక్‌నగర్, దోమలగూడ, రత్నానగర్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, తారానగర్, చందానగర్‌లోని దీప్తిశ్రీనగర్, కూకట్‌పల్లిజోన్‌లోని ఫతేనగర్, భరత్‌నగర్, అల్లాపూర్, బాలానగర్, కల్యాణ్‌నగర్, సుభాష్‌నగర్, పేట్‌బషీరాబాద్ తదితర ప్రాంతాల్లోనూ కాలనీలు నీటమునిగాయి.
24 మంది మృత్యువాత
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ఏకంగా 24 మంది మరణించారు. ఈమేరకు అధికారులు బుధవారం ధ్రువీకరించారు. భారీ వర్షాలతో చాలా చోట్ల వరదలు పోటెత్తాయి. కొన్నిచోట్లఇళ్ల నుంచే వరద సాగడంతో ఆ ప్రవాహంలో పలువురు కొట్టుకుపోయి విగతజీవులయ్యారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 11 మంది మరణించారు. రంగారెడ్డి జిల్లాలో ఏడుగురు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు, మేడ్చల్ జిల్లాలో ఇద్దరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.
మళ్లీ మొదలైన వాన..
రాజధానిలో బుధవారం ఉదయం నుంచి కాస్త తెరిపినిచ్చిన వాన రాత్రి మళ్ళీ మొదలైంది. వాయుగుండం ప్రభావంతో రాత్రి 9 గంటల నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అసలే అంధకారంలో ఉన్న ముంపు ప్రాంతాల్లో ఈ వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ విభాగాలు అప్రమత్తమయ్యాయి. సహాయక బృందాలను రంగంలోకి దింపాయి.