వెబ్‌సైట్‌లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితా
అక్టోబర్ 21 నుంచి గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి జూన్ 9న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా తెలంగాణ పబ్లిక్‌సర్విస్ కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
మెయిన్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపిక 1:50 నిష్పత్తిలో చేపట్టినట్టు టీజీపీఎస్సీ తెలిపింది. 563 ఉద్యోగాలకుగాను 31,382 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, మల్టీజోన్లు, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక చేపట్టారు.
గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి మార్కులు, కటాఫ్ మార్కులు తదితర వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్‌నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. హాల్‌టికెట్లు పరీక్షలకు వారంరోజుల ముందు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు.
టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫైనల్ కీ కూడా
జూన్ 9న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ కీని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఆదివారం వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ఈ పరీక్ష నిర్వహించిన కమిషన్... ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచింది.
ఆ తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన కమిషన్..విషయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారితో చర్చించి తుది కీని తయారు చేసింది. ఈ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టినట్టు కమిషన్ కార్యదర్శి ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల స్కాన్డ్ ఓఎంఆర్ పత్రాలు సైతం కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment