సాక్షి, ములుగు: ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ఆర్టీటీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ములుగు శివారులోని గట్టమ్మ ఆలయం మూల మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. పలువురికి గాయాలవ్వగా ములుగు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వగా.. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. బస్సు ముందు భాగం కూడా కొంత దెబ్బతింది. ఆర్టీసీ బస్సు హన్మకొండ నుంచి మేడారం వస్తుండగా.. కారు హన్మకొండ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మేడారం వెళ్లే మార్గం కావడంతో ఘట్టమ్మ ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులువెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ములుగు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు శ్రీనివాస్, సుజాత, రమేష్, జ్యోతిగా గుర్తించిన పోలీసులు వారంతా ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామస్తులుగా తెలిపారు. కళ్యాణ్ అనే వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా మేడారం జాతర జరుగుతుండటంతో గత మూడు రోజుల నుంచి వరంగల్- మేడారం దారులు భక్తుల వాహనాలతో మరింత రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో చిన్నచిన్న ప్రమాదాలు చోటుచేసుకోగా ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి.
చదవండి: నల్లకుంటలో విద్యార్థి అదృశ్యం.. తండ్రి మందలించడంతో పాల ప్యాకెట్ కోసమని వెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment