సాక్షి, హైదరాబాద్: తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తూ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పది రోజుల క్రితం ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ (పీఎంఎల్‌ఏ) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. ఇప్పటికే ఈడీ విచారణకు రెండుసార్లు హాజరయ్యానని చెప్పారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాను ఫిర్యాదుదారుడినని, అందుకే ఈడీ కావాలనే కేసు నమోదు చేసిందన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో మనీల్యాండరింగ్ జరగలేదని, అయినా ఆ కేసును నీరుగార్చే క్రమంలోనే ఈడీ మనీ ల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిందన్నారు. గుట్కా వ్యాపారి అభిషేక్, ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుకుమార్‌ను కూడా ఈడీ ప్రశ్నించిందని వెల్లడించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులను సిట్ విచారణ జరుపుతున్న క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగిందన్నారు. మనీ ల్యాండరింగ్ జరిగింది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేకున్నా... తమ వద్ద ఉన్నాయని ఈడీ చెబుతోందని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న బీజేపీ–బీఆర్‌ఎస్‌ల మధ్య తీవ్ర రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేల ఎర కేసు నుంచి బయటపడేందుకే ఈడీతో తప్పుడు కేసును తనపై బనాయించారని ఆరోపించారు. ఈడీ పరిధి దాటి కేసు నమోదు చేసిందన్నారు. వెంటనే ఈడీ కేసు దర్యాప్తును నిలిపివేయాలని, దర్యాప్తుపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఈడీ జాయింట్ డైరెక్టర్, ఈడీ డిప్యూటీ డైరెక్టర్(హైదరాబాద్), ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్(హైదరాబాద్)ను ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఈ పిటిషన్ న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment