సాక్షి, ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఆమెకు మధ్యంతర బెయిల్ తిరస్కరిస్తూ సోమవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ మేరకు జడ్జి కావేరి భవేజా 21 పేజీల తీర్పు వెల్లడించారు.
రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యం అవుతుండడంతో.. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో పిల్లవాడికి తల్లి అవసరం ఉందని కవిత తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వానలి కోరారు.
అయితే ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తి అయ్యాయని, ఇప్పుడు బెయిల్ అవసరం లేదని కోర్టుకు ఈడీ తెలిపింది. పైగా కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. ఈ క్రమంలో 4వ తేదీన వాదనలు ముగియగా.. తీర్పు రిజర్వ్ చేసి తీర్పు నేటికి వాయిదా వేశారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా. ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ ఇవాళ ఉదయం కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది
ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తి అయ్యాయని, ఇప్పుడు బెయిల్ అవసరం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. పైగా కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ ఇవాళ ఉదయం కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
కవిత బెయిల్ తీర్పులో కీలక అంశాలు
- కవితకు ఈడి నోటీసులు ఇచ్చిన తర్వాత తన ఫోన్లో డాటాను ధ్వంసం చేశారు
- ఫోరెన్సిక్ నివేదికలో ఈ విషయం నిర్ధారణ జరిగింది.
- బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేయగలరు.
- బెయిల్ ఇవ్వడానికి ట్రిపుల్ టెస్ట్ పాస్ కాలేదు.
- కవిత కుమారుడి వయసు 16 సంవత్సరాలు.
- ఇప్పటికే సగం పరీక్షలు పూర్తయ్యాయి.
- తండ్రి , పిన్ని తగినంత మానసిక ధైర్యం కుమారుడికి కల్పిస్తారు.
- పరీక్షల భయం మద్యంతర బెయిల్‌కు తగిన కారణం కాదు.
- తల్లిదండ్రులు భౌతికంగా అందుబాటులో లేకున్నా, 19 ఏళ్ల కుమారుడు స్పెయిన్‌లో చదువుకుంటున్నాడు.
- చిన్న కుమారుడు తండ్రి , పిన్ని సమక్షంలో చదువుకోవడానికి, పరీక్షలు రాయడానికి ఇబ్బంది ఏమీ ఉండదు.
- మహిళ అనే కారణంతో బెయిల్ ఇవ్వాలన్న అంశంపై కోర్టులు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి.
- నేరాలలో బలి కావడానికి కవిత నిస్సహాయు రాయులైన మహిళ కాదు.
- కవిత సమాజంలో ఉన్నత స్థానంలోని విద్యావంతురాలు.
- సాక్షులను బెదిరించడం, సాక్షాలను ధ్వంసం చేయడంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారని దానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి.
- ఈ నేపథ్యంలో మహిళ అయినంత మాత్రాన పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 (1) కింద బెయిల్ ఇవ్వలేం
- అందుకే కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తున్నా.
ఇదిలా ఉండగా.. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కవిత మార్చి 26వ తేదీ నుంచి కవిత తీహార్ జైల్లో ఉన్నారు. కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఇవాళ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో.. రేపు(మంగళవారం) మళ్లీ కోర్టు ముందు హాజరుపరుస్తారు. మరోవైపు.. కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై మాత్రం ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు వింటామని కోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ పిటిషన్‌ను త్వరగతిన విచారణ చేప్టాలంటూ ఆమె కోర్టును ఆశ్రయిస్తూ మరో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment